కుండపోత


Thu,October 18, 2018 01:10 AM

-నగరంలో ఉదయం, సాయంత్రం భారీ వర్షం
-ఆసిఫ్‌నగర్‌లో అత్యధికంగా 6.1సెం.మీలు నమోదు
-మరో రెండు రోజులు వర్షసూచన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అండమాన్‌నికోబార్‌లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు విడతల వారీగా కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయింది. వర్షం నీటి వరదకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, కృష్ణానగర్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వరదనీటి దాటికి కొట్టుకుపోయింది. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, సరూర్‌నగర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కర్మాన్‌ఘాట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, మెట్టుగూడ, ఉప్పల్, నాంపల్లి, అబిడ్స్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లో మోస్తరు నుంచి బారీ, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

నిమిషాల్లో రంగంలోకి సహాయక బృందాలు
నగరంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమై, రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బల్దియాకు చెందిన మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్‌ఎఫ్) వెంటనే రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని ఖాళీ చేయించేందుకు విస్తృతంగా కృషి చేశాయి. మేయర్ బొంతు రామ్మోహన్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అంతేకాకుండా, పారిశుధ్యం, ఇంజినీరింగ్ అధికారులతో సహాయక చర్యలపై ఆయన చర్చించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బోరబండ, మూసాపేట్ పరిధిలోని అల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

జనజీవనానికి అంతరాయం..
భారీవర్షం కారణంగా నగరంలో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెలవుదినం కావడంతో ట్రాఫిక్ సమస్య కొంతమేరకు మామూలుగానే ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రధాన రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదలడంతో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఉదయం నుంచే వర్షసూచన ఉండటంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ డిజాస్టర్ రెస్పాన్స్‌టీమ్‌లతోపాటు జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగు అధికారులను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు ఫోన్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. బల్దియా సహాయక బృందాలు వెంటనే రంగంలోకిదిగి నీరు నిలిచిన ప్రాంతాల్లో నీటిని మోటార్ల ద్వారా, మ్యాన్‌హోళ్లలో ఇరుక్కున్న చెత్తను తొలగించడం ద్వారా త్వరితగతిన ఖాళీ చేయించాయి. ముఖ్యంగా చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, జంగమ్మెట్‌లోని రాజన్నబావి, మోడల్‌హౌస్, పంజాగుట్ట, మాదాపూర్ మెయిన్‌రోడ్, దీప్తిశ్రీనగర్, లింగంపల్లి, జూబ్లీహిల్స్ నీరూస్, జూబ్లీహిల్స్ రోడ్‌నెం-45 కూకట్‌పల్లి తదితర చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయినట్లు బల్దియాకు ఫిర్యాదులు రావడంతో వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు నీటిని తొలగించాయి.

317
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...