అభ్యర్థులు కావలెను

Wed,September 19, 2018 12:44 AM

-జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, టీడీపీ వెతుకులాట
-పొత్తులో ఇచ్చేస్తే మంచిదని ఎవరికి వారుగా ప్రయత్నాలు
-ఓడిపోయే సీటులో ఎందుకు బలవ్వాలని గుసగుసలు
- బంజారాహిల్స్ : అన్నా ఈసారి ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటంటావ్.. ఓ కాంగ్రెస్ కార్యకర్తతో మరో కార్యకర్త ముచ్చట. అరే ఊరుకో భాయ్.. మన అన్న ఈసారి పక్క నియోజకవర్గం నుంచి నిలబడ్తా అంటూ గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నడు.. ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చి రుద్దుతారో అనే టెన్షన్ ఉంది.. మరో కార్యకర్త ఆందోళన. అన్నా.. కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు కదా.. మరి మన పార్టీకి సీటు వస్తే ఎవర్ని నిలబెడ్తారంటావ్?.. ఓ టీడీపీ నాయకుడి ప్రశ్న. దేవుడి దయవల్ల ఈ సీటు కాంగ్రెస్‌కు వెళ్తే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు.. లేకపోతే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టే అభ్యర్థిని ఎక్కడ నుంచి తేవాలి.. ఓ సీనియర్ నేత సమాధానం.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిస్థితులకు ఈ సంభాషణ అద్దం పడుతోంది. ఓ వైపు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్, టీడీపీకి అభ్యర్థుల కొరత వేధిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగిన మాగంటి గోపీనాథ్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఆయనతో పాటు టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచి టీఆర్‌ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తుండటంతో టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఎదిగింది. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్థి పీ విష్ణువర్దన్, ఎన్నికల తర్వాత పూర్తిగా కనుమరుగయ్యారు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి ఇచ్చేసి, పక్కనే ఉన్న ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తానని టీపీసీసీ పెద్దలకు చెప్పినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. మాజీ మంత్రి తనయుడికే ఈ పరిస్థితి ఉంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నిలబడితే డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. దీంతో వారెవరూ పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల్లో నిలబడేందుకు ఎవరో ఓ నాయకుడిని ఒప్పించి తీసుకొచ్చిన తర్వాతే, వేరే టికెట్ గురించి మాట్లాడండి.. అని పార్టీ పెద్దలు నేరుగా విష్ణుకు సూచించారంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. దీంతో కొత్త అభ్యర్థిని పట్టుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. ఓడిపోయే సీటులో ఎందుకు బలవ్వాలని పక్కకు తప్పుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బయటి నుంచి ఎవరో ఒకరిని దింపి, పరువు పోగొట్టుకునే దానికన్నా పొత్తుల లెక్కల్లో టీడీపీకి ఇస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దయనీయంగా టీడీపీ..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్లన్నింటినీ పొత్తులో భాగంగా తీసుకోవాలంటూ టీడీపీ అధినేత చేసిన సూచనలు టీటీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేల వెంట 90శాతం కార్యకర్తలు, నాయకులు కూడా వెళ్లిపోయిన పరిస్థితిలో పోటీకి సిద్ధమవ్వడం ఎంత మాత్రం సాధ్యమయ్యే పనికాదని అంతర్గత సమావేశాల్లో ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా టీడీపీ గెలువకపోవడం, ఒకరిద్దరు డివిజన్ స్థాయి నాయకులు తప్ప నియోజకవర్గ స్థాయిలో పని చేయగలిగిన నేత ఒక్కరూ పార్టీలో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్న ఒకరిద్దరు నాయకులు కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేకపోయారని, అలాంటి వారిని ఎమ్మెల్యేగా బరిలో దింపి పరువు తీసుకునేకన్నా పొత్తులో భాగంగా ఈ సీటును కాంగ్రెస్‌కు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే మంచిదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయాల్సి వస్తే ఎవరిని నిలబెట్టాలనే దానిపై ఏ మాత్రం స్పష్టత రావడం లేదు. సినీ ఇండస్ట్రీకి చెందిన వారెవరైనా పోటీకి సిద్ధమైతే వారికి టికెట్ ఇవ్వాలని, లేకపోతే ఎవరైనా కమ్మ సామాజికవర్గం వ్యక్తిని పట్టుకుని జూబ్లీహిల్స్ బరిలో దింపితే కనీసం పరువు దక్కుతుందని వారు భావిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడం అనేది అసాధ్యమైన విషయమని, అభ్యర్థుల కోసమే ఇంత ఇబ్బంది పడాల్సి వస్తోందని ఓ టీడీపీ నాయకుడు నిట్టూర్చాడు.

537

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles