నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

Tue,September 18, 2018 03:25 AM

-8,597 మంది పారిశుద్ధ్య కార్మికులు
-30 సెకండ్లలోనే నీటిలోకి వినాయకుడు
-35 క్రేన్లకు ఆధునిక హుక్కులు
-రద్దీకి అవకాశం లేకుండా చర్యలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ఖైరతాబాద్ : ఈ నెల 23న జరిగే వినాయక నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. సచివాలయం రోడ్డు లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనాలు నేత్రపర్వంగా జరుగుతుండగా, నిరాటంకంగా కొనసాగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఒక్కో క్రేన్ వద్ద ఒక ఏఈ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 8,597 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలందించనున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద క్రేన్లకు 100 టన్నుల బరువును సునాయసంగా మోసే క్విక్ రిలీజ్ డివైస్(క్యూఆర్‌డీ)తో డిజైన్ చేసిన హుక్కులను వాడుతున్నారు. విద్యుత్ సమస్యలు రాకుండా 44 ప్రాంతాల్లో 101 ట్రాన్స్‌ఫార్మర్లు, అత్యవసర వినియోగం కోసం మొబైల్ డీటీఆర్‌లు సమకూర్చినట్లు టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఈనెల 23న జరుగనున్న గణనాథుడి మహా నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న భాగ్యనగర గణేశుడి నిమజ్జన ఘట్టంలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్య లు చేపడుతున్నారు. పారిశుధ్యం, లైట్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు, క్రేన్లు, గజ ఈతగాళ్లు తదితర ఏర్పాట్ల కోసం రూ. 17. 07కోట్లు వెచ్చిస్తున్నారు. అలాగే, 8, 597మంది పారిశుధ్య కార్మికులు, మరో 345మంది వీధిలైట్ల సిబ్బందిని నియమిస్తున్నారు.

గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీతోపాటు వాటర్‌బోర్డు, వైద్యశాఖ, విద్యుత్, హెచ్‌ఎండీఏ, రోడ్లు-భవనాలు తదితర శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో క్రేన్లను అద్దెకు తీసుకునేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వీటికోసం రూ. 5.4కోట్లు కేటాయించారు. 20 గణేశ్ నిమజ్జన కొలనులను శుభ్రంచేసి.. శుభ్రమైన నీటితో నింపే ప్రక్రియ చేపడుతున్నారు. అలాగే గణేశ్ శో భాయాత్ర నిర్వహించే ప్రధాన మార్గాల్లో రూ. 10.52 కోట్లతో రోడ్ల రీకార్పెటింగ్, రోడ్ల నిర్వహణ, గుంతల పూడ్చివేత తదితర 169 పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రమాదాలు జరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఊరేగింపు మార్గాల్లో ఇబ్బంది కలుగకుం డా ఉ ండేందుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించేందుకు సర్కిల్‌కు ఒకటి చొప్పున హార్టికల్చర్ బృందాన్ని రెండు షిఫ్టుల్లో నియమించాలని నిర్ణయించారు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో ....
- రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో సాగర్ 12 కిలోమీటర్ల పరిధిలో బారీకేడింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ డబెల్ లేయర్ బారీకేడింగ్ ఏర్పాటు చేయనున్నారు. 15 ప్రాంతాల్లో మొత్తం సుమారు 7200చ.అ.ల వైశాల్యంలో వాటర్‌ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయనున్నారు. వాచ్ టవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
- అలాగే, ఏటా మాదిరిగానే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైన గణనాథుడి విగ్రహాలను వెనువెంటనే తొలగించే బాధ్యతను హెచ్‌ఎండీఏ చేపట్టింది. దీనికోసం వారు 1000 లేబర్‌సహా పర్యవేక్షక సిబ్బందిని నియమిస్తున్నారు.
- వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా కోసం వివిధ ప్రాంతాల్లో 101 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పంపిణీ కోసం 30 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధంచేస్తున్నారు.
- ఊరేగింపు మార్గాల్లో 38 ఫైర్ వెహికిల్స్‌ను అగ్నిమాపకశాఖ ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ తదితర మూడు చెరువుల్లో ఒక్కోటి చొప్పున మూడు బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువుల వద్ద ఒక్కోటి చొ ప్పున రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తున్నారు.
- టూరిజం శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు మూడు, నెక్లెస్‌రోడ్డు వైపు రెండు బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవికాకుండా మరో నాలుగు స్పీడ్ బోట్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, మరో పదిమంది గజ ఈతగాళ్లను కూడా నియమిస్తున్నారు.
- టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ చుట్టూ 48ట్రాన్స్‌ఫార్మర్లు, సరూర్‌నగర్ చెరువు వద్ద ఐదు, ఇతర ప్రాంతాల్లో మొత్తం కలిపి 101 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు.
- విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై 11, నెక్లెస్‌రోడ్డులో- 10, రాజన్నబౌలిలో -3, మీరాలం మండివద్ద-4, కవాడిగూడ క్రాస్‌రోడ్ వద్ద-4, మొబైల్ జనరేటర్లు- 43 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- జీహెచ్‌ఎంసీ వీధిలైట్ల విభాగం ఆధ్వర్యంలో శోభాయాత్ర మార్గాల్లో నూరు శాతం వీధిలైట్లు వెలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పారిశుధ్య ఏర్పాట్లు ఇలా....
- గణేశ్ యాక్షన్ టీమ్(జీఏటీ)లు : 3-4 కి.మీ.లకు ఒకటి
- ఒక్కో జీఏటీలో ఒక పారిశుధ్య పర్యవేక్షకుడు(ఎస్‌ఎస్)/పారిశుధ్య జవాను, 3 శానిటరీ ఫీల్ట్ అసిస్టెంట్(ఎస్‌ఎఫ్‌ఏ)లు, 21మంది వర్కర్లు
- రోజుకు మూడు షిఫ్టులు
- మొత్తం జీఏటీలు : 178
- శోభాయాత్ర రోడ్డు పొడవు : 369.5కి.మీ.లు
- ఎస్‌ఎస్‌లు/జవాన్‌లు మొత్తం : 481(158+166+157)
- ఎస్‌ఎఫ్‌ఏలు మొత్తం : 719(239+252+228)
- వర్కర్లు మొత్తం : 8597 (2859+2970+2768)
- హుస్సేన్‌సాగర్ చుట్టూ మొబైల్ టాయిలెట్లు
- వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా వైద్య శిబిరాలు

క్రేన్ల ఏర్పాటు....
- 11న మొత్తం క్రేన్‌లు : 117
- 11న మొబైల్ క్రేన్‌లు : 96
- క్రేన్‌ల లొకేషన్లు : 35
- జనరేటర్లు : 32
- మొబైల్ జనరేటర్లు : 43

వీధిలైట్లు...
- వీధిలైట్ల నిర్వహణకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక జీఏటీ. ఒక్కో జీఏటీలో ముగ్గురు సిబ్బంది. మూడు షిఫ్టులు
- మొత్తం వీధిలైట్ల జీఏటీలు : 115, సభ్యులు : 345
- తాత్కాలిక లైట్ల ఏర్పాటు : 34926లైట్లు, వ్యయం రూ. 94.21లక్షలు రూ. 17.07కోట్ల వ్యయం
- శోభాయాత్ర మార్గాల్లో రోడ్ల మరమ్మతులకు : రూ. 10.52కోట్లు
- క్రేన్లకోసం : రూ. 5.4కోట్లు
- తాత్కాలిక లైట్లకు : రూ. 94.21లక్షలు

అదనంగా101 ట్రాన్స్‌ఫార్మర్లు
-సమీక్షలో టీఎస్‌ఎస్సీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : వినాయక నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగేందుకు విద్యుత్‌శాఖ 44 చోట్ల నిమజ్జన ప్రక్రియ లో అదనంగా 101 ట్రాన్స్‌ఫార్మర్లు, అత్యవసర వినియోగం కోసం మొబైల్ డీటీఆర్‌లు సైతం సమకూర్చినట్లు టీఎస్‌ఎస్సీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. మింట్‌కాంపౌండ్ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డైరెక్టర్లు, సీజీఎం, ఎస్‌ఈలతో కలిసి సీఎండీ రఘుమారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇనుప స్తంభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వీధి దీపాల స్తంభాల వద్ద వదులుగా ఉన్న తీగలను సరిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీధి దీపాల విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

డైరెక్టర్లకు సమన్వయ బాధ్యతలు
నిమజ్జనం రోజు నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసేందుకుగానూ డైరెక్టర్లు ప్రాంతాల వారీగా సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్‌సాగర్ నిమజ్జన ప్రాంతం వద్ద డైరెక్టర్ (ప్రాజెక్టులు) టి. శ్రీనివాస్, ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ మార్గంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) జె. శ్రీనివాస్ రెడ్డి, సరూర్‌నగర్ చెరువు, రంగారెడ్డి జోన్ పరిధిలో డైరెక్టర్ (కమర్షియల్) కె. రాములు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. మేడ్చల్ జోన్ పరిధిలో డైరెక్టర్ (హెచ్‌ఆర్‌డీ) జి.పర్వతం, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్ల పరిధిలో డైరెక్టర్ ( పీఅండ్‌ఎంఎం) సీహెచ్ మదన్‌మోహన్‌రావు, చార్మినార్, హైదరాబాద్ సౌత్ సర్కిళ్ల పరిధిలో డైరెక్టర్ (ఐపీసీ)ఎన్.స్వామిరెడ్డి పర్యవేక్షిస్తారు.

24/7 విధుల్లో అధికారులు, సిబ్బంది
ఖైరతాబాద్ : నగరంలో గణేశ్ నవరాత్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ నిమజ్జనోత్సవాలను సైతం విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇప్పటికే సెక్రటేరియేట్ రోడ్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనాలు నేత్రపర్వంగా సాగుతుండగా, నిరాటంకంగా కొనసాగేందుకు జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. సాగర్‌లో గణపతుల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వినియోగించే క్రేన్‌లను ఈ సారి జీహెచ్‌ఎంసీ సమకూర్చింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని ఎన్టీఆర్ గార్డెన్ ముందు నుంచి లుంబీనీ పార్కు రోడ్డు వరకు 9 క్రేన్‌లను ఏర్పాటు చేసింది. వాటిటి అదనంగా మరో మూడు క్రేన్‌లను సిద్ధంగా ఉంచింది. 24 గంటల పాటు నిమజ్జనోత్సవాలు కొనసాగేందుకు 24/7 అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారీగా సేవలందిస్తున్నారు.

ఒక్కో క్రేన్‌కు ఇన్‌చార్జిగా ఏఈ
ఒక్కో క్రేన్ వద్ద ఏఈ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కింద ముగ్గురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తుండగా, ముగ్గురు ఏఈలకు ఒక డీఈ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఒక్కో క్రేన్ వద్ద ఒక్క ఎస్‌ఎఫ్‌ఏ కింద 21 మంది పారిశుధ్య సిబ్బంది చొప్పున... 9 క్రేన్‌ల వద్ద 189 మంది పనిచేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10గంటల వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల వరకు మూడు షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బంది తమ సేవలను అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ జీహెచ్‌ఎంసీ వాహనాల ద్వారా వాటిని తరలిస్తున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం 9వ రోజు 21 నుంచి 24 వరకు ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద విధులు నిర్వహించనున్న అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. కె.సత్యనారాయణ ( డిప్యూటీ కమిషనర్ ), డి. నాగిరెడ్డి డిప్యూటీ డైరెక్టర్ అర్బన్ బయో డైవర్సిటీ), ఆర్.మోహన్ సింగ్ ( సూపరింటెండెంట్ ఇంజినీర్), బి. విజయ్ కుమార్ ( ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్), బి. కృష్ణా (ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ), ఆర్. శివానంద్ (ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ), టి. వేణుమాధవ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్), డాక్టర్ భార్గవ నారాయణ , డాక్టర్ రవికాంత్ ( అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్) , ఎస్. రమేశ్ (మేనేజర్, అర్బన్ బయో డైవర్సిటీ), కార్తీక్ ( డిప్యూటీ చీఫ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి), వి. లచ్చి రెడ్డి ( సీనియర్ యాంటమాలజిస్ట్)

514

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles