నిఘా నేత్రంలో..

Thu,September 13, 2018 12:14 AM

-ఖైరతాబాద్ గణేశుడి వద్ద 32 సీసీ కెమెరాలు
-కంట్రోల్ రూమ్‌లో వీహెచ్‌ఎఫ్ సెట్
-డోర్‌ఫ్రేమ్ డిటెక్టర్లు....బాంబ్ స్కాడ్ సిబ్బంది
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ కాలసర్పమహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్త జనకోటికి నిఘా నేత్రాల ద్వారా రక్షణ కల్పిస్తున్నారు. సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 32 అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చారు. ఐమ్యాక్స్ రోడ్, సెన్సేషన్ థియేటర్ రోడ్, రైల్వే గేటు, గణేశుడి మండపం వద్ద మొత్తం 30 డే అండ్ నైట్, సీ మౌంట్, డోమ్ కెమెరాలతో పాటు 360 డిగ్రీల పరిధిలో దృశ్యాలను రికార్డు చేసే ఆధునిక పాన్ టిల్ట్ జూమ్ (పీజీజెడ్) రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. రెండు మెగాపిక్సెల్‌తో కూడిన ఈ కెమెరాలు అర కిలోమీటరు వరకు దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరిస్తుంది. 24/7 నిఘా ఉంచేందుకు గణేశుడి మండపం వెనుక భాగం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బంది, సీసీ కెమెరాల టెక్నిషియన్లను నియమించారు.

ప్రత్యేక వీహెచ్‌ఎఫ్ సెట్ ఏర్పాటు
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునే వచ్చే భక్తుల బాగోగులను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు సెంట్రల్‌జోన్ పోలీస్ విభాగానికి అనుసంధానంగా వీహెచ్‌ఎఫ్ సెట్‌ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులకు చేరవేయడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలకు ఉపక్రమించే విధంగా ఈ వీహెచ్‌ఎఫ్ రేడియోను వినియోగిస్తున్నారు.

డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లు...బాంబ్ స్కాడ్ సిబ్బంది
మహాగణపతి దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏడు డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లను అమరుస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ముడింతలు భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే గేటు, గణేశుడి మండపం వెనుకవైపు, వార్డు ఆఫీస్ రోడ్డులో ఈ డోర్‌ఫ్రేమ్ డిటెక్టర్లు సిద్ధం చేశారు. వీటితో పాటు బాంబ్, డాగ్ స్వాడ్ సిబ్బంది అనుక్షణం భక్తులకు రక్షణ కల్పిస్తారు. అలాగే ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 12 మంది ఎస్సైలు, 70 మంది మహిళా, పురుష కానిస్టేబుళ్లు, నాలుగు ప్లాటూన్ల ప్రత్యేక భద్రతా దళాలు గణేశుడి భక్తులకు 11 రోజుల పాటు రక్షణలో పాలుపంచుకుంటారు.

ట్రాఫిక్ ఆంక్షలు ..
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఖైరతాబాద్ బడా గణేశ్ మండపం వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రతి రోజూ దర్శనం కోసం భక్తులు వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకుని గణపతి మండపం వైపు వచ్చే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ..హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు, వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు.
-మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ నుంచి వాహనాలను ఖైరతాబాద్ గణేశ్ మండపం వైపు అనుమతించరు. ప్రభుత్వ మింట్ కంపౌండ్ వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు.
-రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి వాహనాలకు ఈ మార్గంలో ఎంట్రీ లేదు. ఆ వాహనాలను సంత్‌నిరంకారీ వైపు మళ్ళిస్తారు.
-రాజ్‌దూత్ హోటల్, ఖైరతాబాద్ మార్కెట్ మార్గం నుంచి వచ్చే వాహనాలను మండపం వైపు అనుమతించరు. ఈ వాహనాలను ప్రింటింగ్ ప్రెస్, మార్కెట్ మార్గాల్లో మళ్లిస్తారు.
-ఈ మార్గంలో ఆంక్షలు 13వ తేదీ నుంచి 23 వరకు అమల్లో ఉంటాయని సీపీ అంజనీకుమార్ వివరించారు.

324

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles