ఫేస్‌బుక్ దారి చూపించింది...

Wed,September 12, 2018 12:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/మన్సూరాబాద్: ఫేస్‌బుక్ ప్రొఫైల్... 8 సంవత్సరాల కిందట తప్పిపోయిన బావమరిది ఆచూకీ బావకు చిక్కేలా చేసింది. ముద్దుగా పిల్చుకునే పేరు క్లూగా మారడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసుల సహాయంతో బావమరిదిని ఇంటికి తీసుకువచ్చాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ ప్రాంతానికి చెందిన అజిత్‌కుమార్ కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి మౌలాలిలో నివాసం ఉంటున్నాడు. బావమరిది సుజిత్‌కుమార్ ఝా(15)ని కూడా తీసుకువచ్చి తన వద్ద ఉంచుకుని చదివిస్తున్నాడు. 2011లో సుజిత్‌కుమార్ ఝా చదువుకోవడం ఇష్టం లేక అక్క, బావకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీనిపై అజిత్‌కుమార్ మల్కాజిగిరి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు కింద న మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత పలుమార్లు బావమరిది ఆచూకీ కోసం ఆరా తీసినా ఫలితం దక్కలేదు. పోలీసులను వాకబు చేసిన వారు కూడా చేతులు ఎత్తేశా రు. ఆశ చావని అజిత్‌కుమార్ ఎలాగైనా తన బావమరిది ఆచూకీ దొరకపట్టాలని ఫేస్‌బుక్‌లో తరుచుగా ఉంటూ ప్రతి ఒక్కరి ప్రొఫైల్‌ను చూస్తున్నాడు. ఇలా ఓ రోజు సుజిత్‌కుమార్ ఝా(ముద్దుగా పిల్చుకునే సుజిత్)పేరుతో ఓ ప్రొఫైల్ కనిపించింది. దీంతో దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా సుజిత్‌కుమార్ దాన్ని తిరస్కరించి ఆ ఖాతా బ్లాక్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన అజిత్‌కుమార్ తన బంధువు ఫేస్‌బుక్ ప్రొఫైల్ నుంచి మరోసారి వాకబ్ చేయగా సుజిత్‌కుమార్ ఝా ప్రొఫైల్‌లో వేరే పేరును పెట్టుకున్నట్లు గు ర్తించాడు. దీంతో అతను తన బావమరిదిగా అనుమానించి మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించాడు.

అక్కడి పోలీసులు సైబర్ క్రైం పోలీసులను సంప్రదించమని చెప్పడంతో అజిత్‌కుమార్ ఈ విషయాన్ని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫేస్‌బుక్ ఖాతా ఐపీ అడ్రస్సు ద్వారా సుజిత్‌కుమార్ లొకేషన్ ముంబయిలోని మాజ్‌గావ్ ప్రాంతంలో తేలింది. దీంతో సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ జలంధర్‌రెడ్డి, సిబ్బందిని అక్కడికి పంపించి సుజిత్‌కుమార్ ఝాను గుర్తించి అతన్ని మంగళవారం నగరానికి తీసుకువచ్చి బావకు అప్పగించారు. ఐపీ అడ్రస్సు ద్వారా గాలింపు సందర్భంగా అతను ఓ సందర్భంలో ముం బా యి రెడ్ లైట్ ఏరియాలో ఉన్నట్లు లొకేషన్ రావడంతో అతన్ని చిన్నప్పుడు కిడ్నాప్ చేసి ఆ ఏరియాలో అమ్మేశారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. చివరకు చదువుపై ఇష్టం లేక ముంబాయికి వెళ్లినట్లు తేలడంతో మిస్సింగ్ కేసు కథ సుఖాంతమైంది.
ఈ మిస్సింగ్ కేసును టెక్నాలజీ పరంగా గుర్తించి కుటుంబ సభ్యులకు 8 సంవత్సరాల తర్వాత సుజిత్‌కుమార్ ఝాను అప్పగించిన సైబర్ క్రైం బృందాన్ని సీపీ మహేశ్ భగవత్ అభినందించి రివార్డులను ప్రకటించారు. ఇంటి నుంచి వెళ్లిన సుజిత్‌కుమార్ ఝా ప్రస్తుతం ముంబాయిలోని విజయ్ శిర్ఖా నిర్వహిస్తున్న క్యాటరింగ్ సంస్థలో పని చేస్తున్నాడని అతను పోలీసులకు వివరించాడు.

చాలా ఆనందంగా ఉంది....
8 సంవత్సరాల తర్వాత నా బావమరిది దొరకడం చాలా ఆనందంగా ఉంది. చదువు చెప్పించేందుకు బావమరిది సుజిత్‌కుమార్ ఝాను బీహార్ నుంచి తీసుకువచ్చాను. 2011లో ఇంట్లో ఎవరీకి చెప్పకుండా వెళ్లిపోవడం తీవ్రమానసిక వేదనకు గురి చేసింది. నేను ఏదో తప్పుచేసినట్లు భావించాను. పోలీసులకు ఫిర్యాదు చేసి నిరంతరం వాక బు చేసినా ఎలాంటి ఫలితం లభించలేదు. అయినా అతని ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించాలనే కసి పెరిగింది. ఇటీవల నా బావమరిది ఇప్పుడు యువ వయస్సుకు వచ్చి ఉంటాడు. ఇప్పుడు యువత అంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని చాలా సందర్భాల్లో విన్నా. రెండు సంవత్సరాల కిందట ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి నిరంతరం ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లను పరిశీలించా. ఓ రోజు సుజిత్‌కుమార్ ఝా, అలియాస్ సుజిత్ పేరుతో ఉన్న ఖాతా దొరికింది. సుజిత్ నా బావమరిది ముద్దు పేరని గుర్తించి దాన్ని అనుసరించా. చివరకు రాచకొండ సైబర్ క్రైం పోలీసుల సహాయంతో బావమరిదిని ఇంటికి తీసుకువచ్చా. అతన్ని తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్తా. టెక్నాలజీతో చెడు ఎంత ఎక్కువగా ఉందో అంతే మంచి కూడా జరుగుతుందని నా బావమరిది సంఘటనలో రుజువైంది.
- అజిత్‌కుమార్

347
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles