ఢిల్లీ కేంద్రంగా మోసాలు

Tue,September 11, 2018 12:21 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉద్యోగాలిస్తామంటూ నమ్మిస్తూ... ఢిల్లీలోని ఓ కాల్‌సెంటర్ నిర్వాహకులు దేశ వ్యాప్తంగా వందలాది మందిని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు వచ్చిన ఒక ఫిర్యాదుపై దర్యాప్తు చేసి, ఢిల్లీలోని ఈ కాల్‌సెంటర్‌పై దాడి చేశారు. కొన్ని నెలలుగా ఈ ముఠా ఒక వెబ్‌సైట్‌ను పెట్టి, కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రధాన సూత్రధారులు ముగ్గురిని అరెస్ట్ చేసి, అందులో పనిచేస్తున్న 19 మంది టెలీకాలర్స్‌కు సీఆర్‌పీ 41 కింద నోటీసులు జారీ చేశారు. వివరాలను సైబర్‌క్రైమ్స్ అదనపు డీసీపీ రఘువీర్ సోమవారం మీడియాకు వివరించారు. సుమంత్ భరద్వాజ్(బీహార్), ప్రదీప్‌గుప్తా(ఢిల్లీ), సునీల్ రాణ(హర్యాన)లు ముఠాగా ఏర్పాడ్డారు. ఢిల్లీ కేంద్రంగా షైన్‌క్యారీర్.ఓఆర్‌జీ.ఇన్ పేరుతో సంవత్సరం క్రితం ఒక వెబ్‌సైట్‌ను ప్రా రంభించారు. ఈ వెబ్‌సైట్ నిర్వాహణకు సంబంధించి ఢిల్లీలోని జానకీపురిలో ఒక కార్యాలయాన్ని తెరిచి, దాన్ని కాల్‌సెంటర్‌గా ఉపయోగిస్తున్నారు. ఇందులో 19 మంది టెలీకాలర్స్ ఉండగా.... ఇందులో 11 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

నిరుద్యోగులకు వల..
నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ బయోడేటాలను జాబ్ ఫోర్టల్స్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. వారి డేటాను సేకరించి... తాము షైన్‌క్యారీర్.ఓఆర్‌జీ.ఇన్ నుంచి మాట్లాడుతున్నామని కెనడాతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు, ఇతర దేశాల్లో ఉద్యోగాలున్నాయంటూ నమ్మిస్తారు. ఆయా జాబ్ ఆఫర్లను తమ వెబ్‌సైట్‌కు సంబంధించిన ఈ మెయిల్స్ నుంచి నిరుద్యోగులకు పంపిస్తారు. వీరి మాటలు నమ్మిన చాలా మంది ఉద్యోగం వస్తుందని భావించారు. రిజిస్ట్రేషన్, బయోడేటా అప్‌డేట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ ఇలా.... అందిన కాడికి డబ్బు దోశారు. కొన్నాళ్ల పాటు నిరుద్యోగులకు టచ్‌లో ఉంటారు. ఆ తరువాత మీకు ఉద్యోగం ఇప్పించలేకపోతున్నాం, మీ డబ్బు మీకు వాపస్ ఆన్‌లైన్ ద్వారానే తిరిగి చెల్లిస్తామంటూ నమ్మిస్తారు. తాము ఒక లింక్ పంపిస్తామని, అందులో ఉండే పేజీలో మీ వివరాలు పూర్తి చేస్తే.. డబ్బు వాపస్ వచ్చేస్తాయంటూ సూచిస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక పేజీ ఓపెన్ అవుతుంది.. అందులో బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు నంబర్, సీవీవీ, ఓటీపీ నెంబర్లు ఫీడ్ చేయాలంటూ సూచనలు రావడంతో నిరుద్యోగి అన్ని వివరాలను నింపుతాడు. ఆ వివరాలు కాల్‌సెంటర్లోని సిబ్బంది సేకరించి, నిరుద్యోగి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా కాజేస్తుంటారు.

నగరవాసి ఫిర్యాదుతో..
తిలక్‌నగర్‌కు చెందిన ఒక నిరుద్యోగికి ఈ ఏడాది జూలైలో తాము షైన్‌క్యారీర్ నుంచి మాట్లాడుతున్నానని, కెనడాలో ఉద్యోగానికి మీ బయోడేటా ఎంపికైందని , రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 13003 చెల్లించాలని సూచించారు. దీనికి బాధితుడు అంగీకరించి డబ్బు చెల్లించిన తరువాత.... ఆ తరువాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ మరికొంత డబ్బు లాగేశారు. ఆ తర్వాత ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని, మీ డబ్బు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నామంటూ లింకు పంపించారు, అందులో నిరుద్యోగ యువకుడు వివరాలు పూర్తి చేయడంతో, అతని బ్యాంకు ఖాతాలో నుంచి రూ. సుమారు 90 వేల వరకు నగదును కాజేశారు. దీనిపై బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్సై వెంకటేష్ బృందం, డిల్లీ నుంచి ఈ మోసం జరిగినట్లు గుర్తించి, కాల్‌సెంటర్‌పై దాడి చేశారు. ఇదిలాఉండగా... మధ్యప్రదేశ్‌లోను ఇలాంటి మోసాలు చేయడంతో, అక్కడి పోలీసులు ఈ కాల్‌సెంటర్ ఆచూకీ తెలుసుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో తన కాల్‌సెంటర్ చిరునామాను మార్చేసి, మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు.

హైదరాబాద్ పోలీసులు పక్కాగా ఫ్లాన్ చేసి, ఈ కాల్‌సెంటర్‌పై దాడి చేయడంతో నిర్వాహకులతో పాటు అందులో పనిచేస్తున్న వారు చిక్కారు. వీరి నుంచి 26 మొబైల్ ఫోన్లు, 5 ల్యాప్‌టాప్, రెండు రూటర్లు, 8 డెబిట్, క్రెడిట్ కార్డులు, 2 చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా ఒక ఖాతా చూడగా ఒక్క నెల రోజుల్లోనే రూ. 34 లక్షలు నిరుద్యోగులు డిపాజిట్ చేసినట్లు తెలిసిందని అదనపు డీసీపీ తెలిపారు. ఇప్పటి వరకు రూ. కోటి వరకు మోసం చేసినట్లు తెలుస్తున్నదని, బ్యాం కు ఖాతాలన్నీ విశ్లేషిస్తే దేశ వ్యాప్తంగా వీరి మోసం రూ. 10 కోట్లకుపైగానే ఉంటుందనే అనుమానం కలుగుతుందని, నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం వస్తుందన్నారు. వైజాగ్, చెన్నై, హైదరాబాద్, అలహాబాద్, భోపాల్‌తో పాటు పలు రాష్ర్టాలకు చెందిన బాధితులు ఉన్నారన్నారు.

283

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles