నగరంలో బంద్ పాక్షికం

Tue,September 11, 2018 12:19 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన భారత్‌బంద్ సోమవారం నగరంలో పాక్షికంగా జరిగింది. కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించి దుకాణాలను మూయించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. పలుచోట్ల ప్రధానమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న పార్టీల ప్రముఖులతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌బంద్‌లో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో వామపక్ష పార్టీలతోపాటు టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నేతలు ర్యాలీ చేపట్టి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రాస్తారోకో చేయడానికి యత్నించిన చాడా వెంకట్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, జనసేన నాయకుడు బిట్ల రమేష్, ఆర్‌ఎస్పీ నేత జానకీరాం, ఎస్‌యూసీఐ నాయకుడు మురహరి, సీపీఎం నాయకుడు డీజీ నర్సింహా,సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేతలు బూటం వీరన్న, పోటు రంగారావులను అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. ఈసందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులు ఎంతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో బషీర్‌బాద్ కూడలిలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు షేక్‌గౌస్ ఆధ్వర్యంలో ప్యారడైజ్ వద్ద ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. సీపీఎం నాయకులు అంబర్‌పేటలో నిరసన వ్యక్తం చేశారు.

తిలక్‌నగర్ చౌరస్తా నుంచి బతుకమ్మకుంట లేబర్ అడ్డా మీదుగా పాపాజీ దాబా వరకు ర్యాలీ సాగింది. మహేశ్వరం మండలంలో ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీశైలం రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నేత దేప భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో కొత్తపేట చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గండిపేట మండలంలో నిరసన చేపట్టారు. నార్సింగి ప్రధానచౌరస్తా వద్ద పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మల్లేష్, శంకరయ్యలు డిమాండ్ చేశారు. బంద్‌లో భాగంగా ఓయూలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జీపుకు తాడుకట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో పాఠశాలలకు ముందస్తు సెలవు ప్రకటించగా, మిగిలిన వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బస్సులు యధావిధిగా కొనసాగాయి. మియాపూర్‌లో టీడీపీ నాయకుడు మొవ్వా సత్యనారాయణ, మోహన్ ముదిరాజ్‌ల నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. తారానగర్ మార్కెట్‌లో దుకాణాలను బంద్ చేయించేందుకు యత్నించిన కాంగ్రెస్ మాజీఎమ్మెల్యే భిక్షపతియాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్ తదితరులను చందానగర్ పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు.

351

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles