చిన్నారులకు విశ్వాసం


Tue,November 21, 2017 02:54 AM

-చిన్నారులకు భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రం
-సైబరాబాద్‌లో ఏర్పాటుచేసిన పోలీసులు..
-లైంగిక దాడుల నివారణ, బాధిత పిల్లలకు అండగా ఉండేందుకు సన్నాహాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లైంగిక దాడులకు గురవుతున్న బాలికలకు అండగా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. సోమవారం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, క్రైం డీసీపీ జానకీ షర్మిల విశ్వాస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సెంటర్‌లో హెల్ప్‌హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో బాధితుల్లో భయాందోళనను తొలగించి మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు.

లైంగిక దాడులకు గురవుతున్న పిల్లలకు అండగా నిలబడేందుకు సైబరాబాద్ పోలీసులు హెల్స్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మొదటి సారిగా విశ్వాస్ సపోర్ట్ కేంద్రాన్ని సోమవారం కొండాపూర్ ఏరియా దవాఖానలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, క్రైం డీసీపీ జానకీ షర్మిలతో కలిసి ప్రారంభించారు. ఈ కేంద్రంలో బాధితులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి వారిలో నెలకొన్న భయాందోళనను తొలగించి మానసిక ధైర్యాన్ని కల్పించనున్నారు. ఇలాంటి లైంగిక దాడులకు బలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు సూచిస్తారు. మొదటి సారిగా ఏర్పాటైన ఈ కేంద్రానికి పూర్తి సహకారం ఉం టుందని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. జిల్లా వైద్య శాఖ సూపరింటెండెంట్ నుంచి అవసరమైయ్యే సేవలు ఈ కేంద్రానికి అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.

చిన్నారులపై ఎక్కువగా కుటుంబ సభ్యులు లేదా దగ్గరి పరియస్తులే వారిపై లైంగిక దాడులకు పాల్పుడుతన్నారు.దీంతో ఈ ఘటనలను బయటికి రాకుండా చాలా మంది రాజీ కుదుర్చుకుంటున్నారు.ఫిర్యాదులు నమోదైన కేసులలో కూడా చిన్నారులు చెప్పలేని స్థితి లో ఉంటుండడంతో ఆ కేసులను చేధించడం ఓ సవాలుగా మారిందని సీపీ సందీప్ శాం డిల్య తెలిపారు. 2016 సంవత్సరంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చిన్నారులపై జరిగిన లైంగిక దాడుల సంఘటనలు 250. ఈ ఘటనలపై పోక్సా చట్టం(ప్రోటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎగెయిన్‌స్ట్ సెక్యూవల్ అబ్యూజ్డ్ యాక్ట్-2012) కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ విశ్వాస్ సపోర్ట్ కేంద్రంలో బాధితులకు పునరావసం కల్పించేందుకు రిహాబ్లిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించామని క్రైమ్ డీసీపీ జానకీ షర్మిల తెలిపారు. ఈ విశ్వాస్ సపోర్ట్ కేంద్రం బాధిత చిన్నారుల్లో ధైర్యం, భద్రతపై భరోసా కల్పిస్తామన్నారు. దేశంలోనే చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మొదటి భరోసా కేంద్రంగా వారిలో కొత్త వెలుగులు నింపుతుందని జానకీ షర్మిల వివరించారు.

బాధితులకు లక్ష పరిహారం

కామపిశాచుల బారిన పడి చితికి పోయే చిన్నారులకు పోక్సా చట్టం-2012 ప్రకారం బాధితులకు తక్షణమే లక్ష రుపాయాల ఆర్థిక సహాయం అందుతుంది. చాలా మంది అవగాహన లేపోవడంతో బాధితు కుటుంబాలు చిన్నారుల వైద్య పరీక్షల కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఈ కేంద్రంలో బాధిత కుటుంబాలకు ఈ పరిహారం అందేందుకు అవసరమైయ్యే ప్రక్రీయను ఇక్కడ వివరిస్తారు. ఈ సహాయం వారిని కొంత ఆదుకుని మానసిక ధైర్యాన్ని అందిస్తుందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కేంద్రంలో ప్రత్యేక కౌన్సిలర్లు

ఈ కేంద్రంలో మొత్తం 8 మంది ఛైల్డ్ కౌన్సిలర్లు, 8 మంది వైద్యులు, మానసిక నిపుణులను ఏర్పాటు చేశారు. కేంద్రంలో బాధిత పిల్లల నుంచి ఎఫ్‌ఐఆర్ నమోదుతో పాటు, దర్యాప్తుకు కావాల్సిన అంశాలను పోలీసులు సేకరించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని డిజైన్ చేశారు. ఇక్కడికి వారి రాగాన కంగారు పడకుండా ఆట బొమ్మలతో ప్లే స్కూల్ వాతావరణాన్ని సృష్టించారు. ఇలా బాధితులను అన్ని విధాల ఆదుకునేందుకు కావాల్సిన వైద్య, న్యాయ సలహాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. బాధితులు డిప్రెషన్‌లో ఉండకుండా వారికి భవిష్యత్తుపై నమ్మకం కల్పించేందుకు ప్రముఖ మానసిక నిపుణులతో ఇక్కడ కౌన్సిలింగ్‌ను ఇస్తారు.

బాధితుల్లో బాలురు 52 శాతం

భారతదేశంలో లైంగిక దాడులకు గురైనవారిలో బాలురు 52 శాతం, బాలికలు 47 శాతం ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. అందులో 5 సంవత్సరాల వయస్సు గల వారు అధికంగా ఉన్నారు. ఆ తర్వాత 12 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల వారు బాధితుల్లో ఉంటున్నారని అధికారులు వివరించారు. సైబరాబాద్‌లో ఇటీవల వచ్చిన ఫిర్యాదులో తండ్రే తన కన్నురెప్పను కాటేశాడు. ఫిర్యాదు అందినప్పటికి దర్యాప్తులో స్టేట్‌మెంట్ ఇవ్వడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. ఈ విధంగా చాలా సందర్భాల్లో చిన్నారులపై జరిగే దారుణాలు వెలుగులోకి రావడం లేదని అధికారులు తెలిపారు. చిన్నారులపై జరిగే దారుణాలపై ప్రతిఒక్కరు స్పందించాలని వీటిపై మౌనంగా ఉండడం చిన్నారుల భవిష్యత్తును కాలరాసినట్లేనని ఈ కేంద్రం ప్రారంభానికి వచ్చిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో హెల్ప్ హ్యాండ్ సంస్థ అధ్యక్షులు ముస్తాబా హాసన్ ఆస్కారి, సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, శంషాబాద్ డీసీపీ పద్మజ, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

345
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...