మిషన్ భగీరథ పనుల పురోగతిపై..


Tue,November 21, 2017 02:50 AM

-గ్రామ కమిటీల నుంచి ధ్రువీకరణ తీసుకోవాలి
-దత్తత గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యటించాలి
-జిల్లా అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఎంవీ రెడ్డి
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : మిషన్ భగీరథ పనులకు సంబంధించి పనులు పూర్తయిన గ్రామాల నుంచి ధ్రువీకరణ తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్ భగీరథ కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు ఆయా గ్రామ కమిటీల నుంచి ధ్రువీకరణ తీసుసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌ను ఆదేశించారు. గ్రామాల్లో పైపులైన్ ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం, నల్లాల బిగింపు, గుంతలు పూడ్చడం వంటి పనులు పూర్తయినట్లు ధ్రువీకరణ తీసుకోవాలన్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండ పర్యటించాలని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు మండల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించడం లేదని, అట్టి అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యుత్ బకాయిల కారణంగా వసతి గృహాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయొద్దని, వసతి గృహాల విషయంలో సంయమనం పాటించాలన్నారు.

భూ రికార్డుల అప్‌డేషన్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను శుక్రవారంలోగా సమర్పించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలు, పశువైద్యశాలలు, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖలకు సంబంధించిన భూముల వివరాలపై నివేదికలను అందించాలన్నారు. భూ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ భూముల వివరాలతో పాటు దాతలు ఇచ్చినైట్లెతే వాటి వివరాలను సైతం పొందుపర్చాలన్నారు. అటవీ, వక్ఫు భూములకు సంబంధించిన వివరాలపై కూడా నివేదిక సమర్పించాలని, ఈ భూములు ఆక్రమణలకు గురైతే ఆక్రమణలో ఎంత విస్తీర్ణం ఉందో తెలుసుకోవాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులను నెల రోజుల్లోపు పరిష్కరించి ఫిర్యాదుదారునికి సమాధానాలు పంపాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

274
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...