అవగాహన పెంచేందుకు మహిళా స్వచ్ఛదూతలు


Mon,November 20, 2017 03:10 AM

-ఇంటింటికీ తిరిగి తడి,పొడి చెత్తపై ప్రచారం
-జీహెచ్‌ఎంసీ మరో వినూత్న ప్రయత్నం
-స్వచ్ఛ హైదరాబాద్ కోసం సీఆర్పీలు
-3600 మందిని నియమించేందుకు సన్నాహాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చెత్తను నాలాల్లో వేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డుపడి జరుగుతున్న అనర్థాలను వివరించడానికి బల్దియా వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. 3600 మహిళలను స్వచ్ఛదూతలుగా నియమించి నగరవాసుల్లో అవగాహన పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నది. వీరు ఇంటింటికీ వెళ్లి తడి,పొడి చెత్తను వేరుచేసి ఆటో ట్రాలీలకు అప్పగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రచారం చేస్తారు. నాలాల్లో చెత్త పేరుకుపోయి రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు పలు కాలనీలు, బస్తీలు నీట మునిగిన నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కొందర్ని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్‌పీ)లుగా నియమించి నాలాల పరివాహక ప్రాంతాల్లో నిర్వహించిన ప్రయోగం సఫలమైంది. ఈ నేపథ్యంలో ఇదే పద్ధతిని నగరం మొత్తం అమలు చేయనుంది. గ్రేటర్ పరిధిలోని 20 లక్షల ఇండ్లల్లో నివసించే వారిలో అవగాహన పెంచి అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ సాధించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటున్నది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 20 లక్షల గృహాల్లో నివసించే కుటుంబాలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. చెత్తను అస్తవ్యస్తంగా వేయడంతో నాలాల్లోకి చేరి వరద ప్రవహానికి అడ్డుపడుతున్నాయి. అంతేకాకుండా ఇండ్లల్లో సైతం చెత్తను ఇష్టానుసారంగా వేయడంతో ఏర్పడే అనార్థలను నగరవాసులకు వివరించే ప్రయత్నం జీహెచ్‌ఎంసీ చేస్తున్నది. చెత్తను ప్రణాళికాబద్ధంగా సేకరించడంతో అనేక లాభాలుంటాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది. అయినా నగరవాసుల్లో మార్పు రాకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే నగరవ్యాప్తంగా సీఆర్పీలను నియమించి ప్రజల్లో చైతన్యం తేచ్చేందుకు కృషి చేస్తున్నది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ 3,600 మంది మహిళాలను స్వచ్ఛదూత్ (సీఆర్పీ)లుగా నియమించేందుకు రూపకల్పన చేసింది.

గృహాలతో పాటు చిన్న వ్యాపార గృహాలు సైతం చెత్తను ఆటో ట్రాలీలకే అప్పగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని 20 లక్షల గృహాల్లో 15 లక్షలకు జీహెచ్‌ఎంసీ, 5 లక్షలకు ఐటీసీ కంపెనీ నేతృత్వంలో గృహాలను స్వయంగా సందర్శించి చెత్తను వేరు చేసే విధానంపై వివరించనున్నారు. అయితే ఒక్క సీఆర్పీకి 600 గృహాల చొప్పున కేటాయించి చెత్తపై అవగాహన కల్పించనున్నారు. ఈవిధంగా నగరమంతా ప్రచారం చేసి స్వచ్ఛ హైదరాబాద్ చేసేందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయనున్నారు. రెండు నెలల్లో కురిసిన భారీ వర్షాలతో నగరంలోని పలు కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. వీటికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాల్లో ఉండడంతో వరద ప్రవాహం నిలిచిపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు.

85 మంది సీఆర్పీలను నియమించి...

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే నగరంలో సీఆర్పీల నియామకంతో జరిగే ప్రయోజనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. మొదటి దశలో నాలాల పరివాహక ప్రాంతాల్లోని కాలనీ, బస్తీల్లో 85 మంది సీఆర్పీలను నియమించి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా చేపట్టిన ఈ కార్యక్రమంతో సీఆర్పీల ప్రయోగం విజయవంతమైంది. ఈ కార్యక్రమం నగరంలోని 20లక్షల గృహాల్లోని కుటుంబాలకు చైతన్యం కల్పించాలని మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

ఆయన ఆదేశానుసారం తక్షణమే ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చేపట్టిన కార్యక్రమాల్లో స్వచ్ఛ్ సీఆర్పీలు ఒకటి. మొదటి దశలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో 52వేల గృహాల్లోని మహిళాలను చైతన్యం చేసినట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా రెండో దశలో మరో 153 మంది సీఆర్పీలను నియమించి, వీరిని నాలాల పరివాహాక ప్రాంతాల్లో ఉండే గృహాల్లోని ప్రజలను అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. మురుగు కాలువలు, డ్రైనేజీల్లో, నాలాల్లో చెత్త వేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ఈ చెత్తను జీహెచ్‌ఎంసీ సేకరించే చెత్త ట్రాలీలకు రోజువారీగా అప్పగించాలని సీఆర్పీలు వివరించనున్నారు.

ఒక్కో మహిళా స్వచ్ఛ దూత్‌కు రూ.10వేలు....

నగరంలో పనిచేసే స్వచ్ఛదూత్ మహిళాకు రూ.10వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రతి నెలా సంబంధిత శానిటరీ సూపర్ వైజర్లు, అదనపు గృహాల నుంచి చెత్తను సేకరించినట్లు స్వచ్ఛ ఆటోడ్రైవర్లు కూడా ధ్రువీకరించిన అనంతరం పని ఆధారిత వేతనాన్ని ఈ సీఆర్పీలకు అందజేస్తారు. చురుకైన మహిళా స్వచ్ఛదూత్‌లకు నెలకు రూ.10వేల గౌరవ వేతనంతో నియమించాలని డిప్యూటీ కమిషనర్లను కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ఒక్కో రిసోర్స్ పర్సన్లు 600గృహాల్లోని నివాసితులను చెత్తను నాలాల్లో వేయకుండా తమకు అందించిన తడి, పొడి చెత్త బుట్టలో వేయాలని చైతన్యపర్చాల్సి ఉంటుందన్నారు.

315
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...