స్వచ్ఛ నగరాన్ని సాధిద్దాం..


Mon,November 20, 2017 03:08 AM

ఉప్పల్: హైదరాబాద్ నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి అనుగుణంగా నిరంతర పర్యవేక్షణతో టాయిలెట్లను కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు, గతంలో ఉన్నవాటిని ఉపయోగంలోకి తెస్తున్నామన్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో ఆదివారం ఎలక్ట్రానిక్ షీ-టాయిలెట్‌ను కార్పొరేటర్లతో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో వెయ్యికిపైగా పబ్లిక్ టాయిలెట్స్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నగరంలో కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా 40 షీ-టాయిలెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

షీ-టాయిలెట్స్ నిర్వాహణకు అవగాహనలో భాగంగా మహిళ అటెండెంట్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. గౌరవ గృహాలుగా వ్యవహరిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ ప్రస్తుతం నగరంలో 382 ఉన్నాయన్నారు. వీటిలో బీవోటీ టాయిలెట్లు 135, ప్రీ ఫాబ్రికెటెడ్ 109, సులభ్ 46, ఇంజినీరింగ్ 57, షీ-టాయిలెట్స్ 15, కమ్యూనిటీ టాయిలెట్లు 20 ఉన్నాయని తెలిపారు. వీటికితోడు మరో 74 పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

నగరంలోని పెట్రోలు బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లలోని టాయిలెట్లను నగరవాసులు ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. వీటితోపాటు ఉచిత టాయిలెట్లు ఉన్నాయనే బోర్డులు కూడా పెట్టిస్తున్నామన్నారు. నగరంలోని హోటళ్లు, బంక్‌ల్లోని 675 టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ టాయిలెట్లను మరింత సానుకూలత లభించేలా ఇజ్జత్ షూర్‌లుగా వ్యవహరించాలన్నా కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ సూచనల మేరకు గ్రేటర్ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్లను గౌరవ గృహాలుగా పేర్కొంటున్నామని మేయర్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డా.ఎన్.యాదగిరిరావు, కార్పొరేటర్లు గోపు సరస్వతిసదానంద్, మేకల అనలాహన్మంతరెడ్డి, బేతి స్వప్నాసుభాష్‌రెడ్డి, గంధం జ్యోత్న్సనాగేశ్వర్‌రావు, ఏఎంవోహెచ్ డా.ఉమాగౌరి, శానిటేషన్ సూపర్‌వైజర్ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

251
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...