e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home చింతన లోకోపకారానికే ‘యజ్ఞానంతర ప్రార్థన’ పంచ మహా యజ్ఞాలు

లోకోపకారానికే ‘యజ్ఞానంతర ప్రార్థన’ పంచ మహా యజ్ఞాలు

భారతీయులు మంచిపనిని ‘యజ్ఞం’తో పోలుస్తారు. ప్రసిద్ధ ‘పంచమహా యజ్ఞాల’తోపాటు యజ్ఞానంతరం యజమాని చేసే ‘దైవప్రార్థన’ కూడా లోకోపకారకమైందే.

అసలు పరోపకార కర్మకే ‘యజ్ఞమని’ పేరు. ఇదొక పుణ్యకార్యం. పరమాత్మను ధ్యానించడం ‘బ్రహ్మయజ్ఞం’. దైవానుగ్రహం దాని ఫలం. నేతితో అగ్నిలో ఆహుతులివ్వడం ‘దేవయజ్ఞం’. సమస్త జడదేవతలు పరిశుద్ధం కావడం, వాతావరణ కాలుష్యాలు తొలగిపోవడం దీని ఫలం. తల్లిదండ్రులను సేవించడం ‘పితృయజ్ఞం’. పిల్లలు ఋణవిముక్తులు కావడం తత్ఫలం. ఇంటికి వచ్చిన బంధువులకు, స్నేహితులకు, తెలిసిన-తెలియని వారందరికీ ఆతిథ్యం ఇవ్వడం ‘అతిథి యజ్ఞం’. ఆశీర్వాదం దీని ఫలం. చివరిది ‘భూతయజ్ఞం’. మానవేతర ప్రాణికోటి ఆకలి తీర్చడమే భూతయజ్ఞం. దాని ఫలం ప్రేమను పొందడం.

- Advertisement -

ఈ పంచమహా యజ్ఞాలు మానవుణ్ణి శ్రేష్ఠునిగా తయారు చేయడంలో ముఖ్యభూమికను పోషిస్తాయి. ‘మనుర్భవ’ అని వేదం ఇస్తున్న సందేశానికి ఆచరణ రూపమైన కర్తవ్యకర్మలే ఈ యజ్ఞాలు. ‘భగవద్గీత’లోనూ జపతపో దానజ్ఞాన యజ్ఞాలు వున్నాయి. యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్తి కావడం వల్ల యజ్ఞకర్తకు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఇండ్లలో ‘దేవయజ్ఞం’ చేయకుండా, అతిథులకు తృప్తి కలిగించకుండా భోజనం చేయరాదనే నియమం పూర్వకాలంలో ఉండేది. ఇప్పటికీ ఏ శుభకార్యం తలపెట్టినా యజ్ఞం చేయడం ఒక సంప్రదాయం. యజ్ఞం పూర్తి కాగానే ప్రార్థన చేయాలనే నియమమూ ఒకటి ఉంది. యజ్ఞం ఎంత ముఖ్యమో, ‘యజ్ఞానంతర ప్రార్థనా’ అంతే ప్రధానం.

ఓం తేజో‚సి తేజో మయి ధేహి
ఓం వీర్యమసి వీర్యం మయి ధేహి
ఓం బలమసి బలం మయి ధేహి
ఓం ఓజో‚సి ఓజో మయి ధేహి
ఓం మన్యురసి మన్యుం మయి ధేహి
ఓం సహో‚సి సహో మయి ధేహి

యజుర్వేదం (19-9)

‘ఓ పరమాత్మా! నీవు అనంతమైన తేజశ్శాలివి, పరాక్రమశక్తి కలిగినవాడవు, బలశాలివి, సామర్థ్యం కలవాడివి, అపరాధులపట్ల క్రోధాన్ని ప్రదర్శించేవాడవు, సహనశక్తి గలవాడవు. ఇవన్నీ మాకు సైతం ప్రసాదించు’. ఈ ప్రార్థనలో యజ్ఞకర్త అయిన యజమాని ఆరు (జ్ఞానం, పరాక్రమం, బలం, సామర్థ్యం, క్రోధం, సహనం) కోరికలు కోరతాడు. అవి పూర్తిగా ఒక శ్రేష్ఠ మానవుడు కోరే కోరికలే.

ఇక్కడ ‘తేజస్సు’ అంటే ‘జ్ఞానం’. మనం సర్వజ్ఞులం కాకున్నా కనీసం ‘లోకజ్ఞులం’ కావాలి. కనీసం తాను నివసిస్తున్న దేశం గొప్పతనాన్ని తెలుసుకోవాలి. దేశం పరాధీనం కాకుండా ప్రజలంతా పరాక్రమవంతులు (అప్రమత్తం) కావాలి. అప్పుడు ఇతరులు ఎవరూ మన వైపు కన్నెత్తి చూడటానికైనా సాహసించరు. బలమంటే ఇక్కడ మూడు (మనో, దేహ, ఆత్మ) రకాలు. ‘ఇచ్ఛా-క్రియ-చేతన’ శక్తులుగానూ వీటిని పిలుస్తారు.

ఏ పని చేయడానికైనా ‘నైపుణ్యం’ అవసరం. ‘ఓజస్సు’ అనే పదానికి ‘సామర్థ్యం, నైపుణ్యం’ అనే అర్థాలున్నాయి. బలంతోపాటు సామర్థ్యమూ ప్రజలకు అవసరం. శత్రువులపట్ల ఉండవలసింది క్రోధమే. కానీ, అది తాత్కాలికమే కావాలి. పరమాత్మకు కోపం ఉండదు. తాపం ఉండదు. ఎవరైతే తెలిసో, తెలియకో తనపట్ల, జనులపట్ల అపరాధం చేస్తారో వారిని శిక్షించేటంతటి క్రోధాన్ని మాత్రమే ఆయన కలిగి ఉంటాడు. ఏ జీవిపట్లా అకారణ కోపాన్ని ప్రదర్శించడు. అలాగని, పాపాత్ముల (నేరస్థులు)ను శిక్షించడంలో వెనుకాడడు. పరమాత్మ సహనమే నిజమైన సహనం. అజ్ఞానంతో తనపట్ల అపరాధాలు చేసేవారిని వెంటనే శిక్షార్హులను చేయడు. వారి తల్లిదండ్రులు, గురువులు, చివరికి స్నేహితులద్వారా ‘హితోపదేశం’ చేయిస్తాడు. వింటారా సరే, లేకపోతే వాళ్ల ఖర్మ. కనుక, సహనం పిరికివారి లక్షణమూ కాదు. సహనానికి అలవాటు పడ్డ సమయంలో ఆలోచనలకు పదును పెడతాం. అప్పుడు కాగల కార్యాన్ని గంధర్వులచేత నెరవేర్చుకొనే అవకాశమూ రావచ్చు. కొంత సహనం పాటించగలిగితే, శత్రువునైనా ఎదిరించడానికి కావలసిన అవకాశమూ లభించవచ్చు. ఈ విధంగా ‘యజుర్వేదం’లోని ‘యజ్ఞానంతర ప్రార్థన’లో అంతర్గతంగా దేశభక్తి భావన, లోకోద్ధరణ కాంక్ష ఇమిడి ఉన్నాయి. ఈ కారణంగానైనా ‘పంచమహా యజ్ఞాల’ ప్రాధాన్యాన్ని గుర్తెరిగి వాటిని ఆచరణలో పెట్టి పునీతులు కావాలి.

పరమాత్మ సహనమే నిజమైన సహనం. అజ్ఞానంతో తనపట్ల అపరాధాలు చేసేవారిని వెంటనే శిక్షార్హులను చేయడు. వారి తల్లిదండ్రులు, గురువులు, చివరికి స్నేహితులద్వారా ‘హితోపదేశం’ చేయిస్తాడు. వింటారా సరే, లేకపోతే వాళ్ల ఖర్మ.

ఆచార్య మసన చెన్నప్ప
98856 54381

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana