e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం 2021-02-21

యాదాద్రి వైభవం 2021-02-21

యాదాద్రి వైభవం 2021-02-21

జరిగిన కథ
మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఆయన ప్రభావంతో ఒంటరిగా స్వామి అన్వేషణకు బయల్దేరుతాడు త్రిభువనమల్లుడు.దట్టమైన అడవిలో ఎదురైన ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి.

‘అదిగో ఆ కొండపైనున్న శ్రీ నారసింహుని దర్శించుకో. ఆ జ్వాలా చక్రాన్ని సేవించుకో..’అని చెప్పి గిరిపుత్రుడు అడవిలో అదృశ్యమయ్యాక.. త్రిభువనమల్లుడు వడివడిగా అడుగులు వేయసాగాడు. ఆ రాత్రివేళ.. అంతటా చీకటి! చాలా దూరంలో ఎత్తయిన కొండమీద జ్వాల. ఆకాశంలోని అగ్ని నక్షత్రం, నక్షత్ర మండలం నుంచి కిందకు దిగి వచ్చిందా? అన్నట్టుగా వింతకాంతులతో వెలిగిపోతున్నది.తానెవరో, ఎక్కడున్నాడో, స్పృహలేదు.తానొక నరుడు.. కావాల్సింది నరసింహుడు.అప్పుడు ఊహలకందని అద్భుతం జరిగింది.ఆ చీకట్లో.. ఆ అడవిలో.. మృదంగనాదం మొదలైంది.

- Advertisement -

చిన్నగా వినిపిస్తూ.. క్రమక్రమంగా పెద్దదవుతున్నవి మృదంగ ధ్వనులు.

“ఇదిగో.. ఇదే యాదర్షి తపస్సు చేసిన మహా దివ్యక్షేత్రం.. ఇదే ఇదే.. యాదగిరీశుడు కొలువైన అపూర్వ పవిత్రాద్రి”

ఎవరో ఎవరికో చెప్తున్న మాటలు సన్నగా వినిపిస్తున్నాయి.

ఆ మాటలు వినిపిస్తున్న వైపునకు నడిచాడు.

అరణ్యంలో ఆ కొండ ప్రాంతంలో ఎవరివో పాదముద్రలు కనిపిస్తున్నాయి. కొండప్రాంతంపై స్పష్టంగా సన్నని వెలుగురేఖలతో కనిపిస్తున్న పాదముద్రలకు భక్తితో తలవంచి నమస్కరించాడు.

“ఇదిగో యాదర్షి తపస్సు చేసిన పుణ్యక్షేత్రం..

మీరు ఏమీ బాధ పడకండి.

మీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ వెళ్లిపోతాయి.”

‘ఈ మాటలు చెప్తున్నది ఎవరా?’ అని అటువైపు చూశాడు త్రిభువనమల్లుడు. ఒక పసి పిల్లవాడు. బహుశా ఎనిమిదో, పదో ఏండ్ల వయసు ఉండవచ్చు. ముద్దుముద్దు మాటలతో అంటున్నాడు. ఆ పిల్లవాడికి ఎదురుగా ఇద్దరు వృద్ధ దంపతులు ఒక పెద్దరాయికి చేరగిలబడి, ఆ మాటలు

వింటున్నారు.

“వెళ్లిపోతాయి. మా బాధలు, కష్టాలు, కన్నీళ్లు. మేం ఈలోకం నుంచి వెళ్లిపోయినప్పుడే.. మా ఊపిరితోపాటు అవీ వెళ్లిపోతాయ్‌. బతికినంత కాలం భరించవలసిందే.. రాసిపెట్టింది జరగక మానదు” అరవయ్యేండ్లు దాటిన ఆ వృద్ధుడు నిరాశగా బదులిచ్చాడు.

ఆయన చెప్తున్నది ‘అక్షరాలా నిజమే’ అన్నట్టుగా భర్త చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని కండ్లకు అద్దుకొంది. ఆయన భార్య నిండు ముత్తయిదువు.

ఆ మాటలు విని చిరుకోపంతో అన్నాడా పిల్లవాడు.

“అదిగో, మళ్లా అదే మాట అంటారు. ఎవరు ఎవరికి ఏది రాసిపెట్టి ఉంచినా, దాన్ని తుడిపేసి మళ్లీ మంచి రాత రాసేవాడు ఒకడున్నాడు”

చిన్నగా నవ్వాడు ఆ పెద్దాయన.

“రాసిన రాత మార్చే దేవుణ్ని చేరుకుందామనే, పడుతూ లేస్తూ ఈ అడవికి వచ్చాం. అసలు ఇన్ని అవస్థలు పడి ఈ కొండ ఎక్కింది ఎందుకో తెలుసా? బతికుంటామా.. దేవుణ్ని దర్శించుకుంటాం. ఊపిరి ఆగిపోయినా అంతకన్నా ఉత్తమం లేదు”

ఆ పెద్దాయన మాట తనకు ఏ మాత్రం నచ్చలేదన్నట్టుగా విసుగ్గా తల అడ్డంగా ఊపాడు పిల్లవాడు.

త్రిభువనుడు ఈ పిల్లవాడిని పరిశీలనగా చూశాడు.

గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న మునిబాలకుడిలా కనిపిస్తున్నాడు.

‘ఈ ముసలి దంపతులు ఎవరు? ఈ మునిబాలకుడు ఎవరు? వీళ్లు అర్ధరాత్రి ఈ కొండ ప్రాంతంలో ఎందుకున్నారు?’

“ఎవరు మీరు?” తన సహజసిద్ధమైన అధికార స్వరంతో ఆ పెద్దాయనను గద్దించి అడిగాడు.

ఆ వృద్ధుడు త్రిభువనుడి కేసి తేరిపార చూశాడు.

“ఇంత రాత్రిపూట ఇక్కడికెట్లా వచ్చారు?”

“నాయనా. నువ్వెవరో కానీ, సర్వసంగ పరిత్యాగిలా కనిపిస్తున్నావు. నా పేరు పద్మ

నాభయ్య. ఈమె నా భార్య లక్ష్మమ్మ. మాది ఈ భువనగిరి రాజ్యంలోనే ఒక చిన్నపల్లె. మాది వ్యవసాయ కుటుంబం”

ఈ వ్యవసాయదారుడెవరో కానీ తనను

‘సర్వసంగ పరిత్యాగి’ అనడం మాత్రం తనకే విచిత్రంగా అనిపించింది. తన జీవితంలో అన్నీ బంధాలు, అనుబంధాలే . బంధాల్ని వదులుకోవడం ఎప్పుడూ లేదు. అది తనకు సాధ్యం కూడా కాదేమో. రాజ్య భారాన్ని మోసే తనకు ఎటుపోయి, ఎటు చూసినా పాతాళ గడిగెలాంటి లంకెల సంకెళ్లే..! తనను నమ్ముకున్న వాళ్లు, వాళ్లని నమ్ముకున్న వాళ్లు.. ఇదొక లౌకిక వ్యవహారాల వలయం. దీనిలోంచి బయటకు రావడం జరిగే పని కాదు.

“ఓహో.. నువ్వుకూడా స్వామి దర్శనానికి వచ్చావా?”

ఆలోచనల గొలుసులను తెగ్గొడుతూ.. వినిపించిన ప్రశ్న ఆ పసి బాలుడిది.

“అవును”

“మరి, ఆ పెద్దాయన నిన్ను సర్వసంగ పరిత్యాగి అని పిలిస్తే.. అంత ఉలికి పడుతున్నావెందుకు?”

“అది నిజం కాదు కాబట్టి” సౌమ్యంగా చెప్పాడు త్రిభువనుడు

“మరి నిజమేమిటి?” నిలదీసి అడిగాడు మునిబాలకుడు.

“నా గురించి నాకే పూర్తిగా తెలియదు. ఇక నీకేం చెప్పగలను. నా సంగతి వదిలిపెట్టు. పాపం ఈ పెద్దవాళ్లిద్దరూ ఏదో కష్టంలో, దుఃఖంలో ఉన్నట్టు కనబడుతున్నారు. చెప్పండి మీకొచ్చిన కష్టమేమిటి?”

“అయ్యా.. మాకు ఒక్కడే కొడుకు. కలవారి ఇంటినుంచి కోడల్ని తెచ్చుకున్నాం. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మగపిల్లవాడు పెద్ద. వాడికి, అంటే మా ముద్దుల మనుమడికి నేనే పెండ్లి సంబంధం తీసుకొచ్చాను. కలిగిన కుటుంబం. పిల్ల యోగ్యురాలు! దాదాపు అంతా నిర్ణయమై పోయింది. కానీ ఇంతలో..”

‘ఇంతలో ఏం జరిగింది” అడిగాడు త్రిభువన మల్లుడు.

“ఎవరి దిష్టి తగిలిందో, ఎవరు ఏ మందు పెట్టారో.. తెలువదు కానీ, అకస్మాత్తుగా మా కొడుకు పిచ్చివాడై పోయాడు. ఏ గాలి సోకిందో, ఏ దుష్టశక్తి ప్రభావం చూపిందో? ఎంతో చక్కగా పొలం పనులు, పెండ్లి పనులు చేసుకుంటున్న వాడు కాస్తా, అకస్మాత్తుగా విపరీత స్థితికి మారిపోయాడు. ఉలికి ఉలికి పడతాడు. ఎవరో తరుముకొస్తున్నట్టు పరుగులు తీస్తాడు.

‘అదిగో.. ఆ చెట్టుమీద తలకిందులుగా వేలాడుతోంది.. నన్ను రమ్మంటుంది’ అంటుంటాడు. చూస్తే చెట్టుమీద ఎవరూ కనిపించరు. ఈ పిచ్చితనం చూసి, పెండ్లి సంబంధం ఎత్తిపోయింది. ‘ఈ పిచ్చి కుటుంబంతో సంబంధం మాకు వద్దే వద్దు..’ అని మాట ముచ్చటకు వొచ్చిన వాళ్లు.. మాటమాత్రం చెప్పకుండా వెళ్లిపోయారు..” ఇంక చెప్పలేను అన్నట్టు ఆపాడు.

“ఆ తర్వాత నేను చెప్తా.. కొడుకు పరిస్థితి ఇట్లా అయింది అని మేము కుమిలిపోతుంటే.. కోడలు అడ్డం తిరిగింది. ‘ఇంత విషం తిని చావండి కానీ, రోజూ గంజిపోయడం నాతోని కాదు’ అన్నది. తన చేతులల్ల శక్తి లేదన్నది.

‘పిచ్చివాడయిన మగాన్ని చూసుకోవాల్నా? పెండ్లి తప్పిపోయి మనసు మనసులో లేని కొడుకును చూసుకోవాల్నా.. లేకపోతే మీ ఇద్దరికీ సచ్చిందాకా సేవలు చేయాల్నా’ అన్నది. ఇంగమేము తట్టుకోలేకపోయినం. ఇంట్లనుంచి బయటపడ్డం. దారీదిక్కూ తోచక ఈ అడవిల పడ్డం. మా కష్టాలు, బాధలు ఎవరికి అర్థమవుతాయి? ఈ చిన్న పిల్లగానికి ఏమర్థమవుతుంది” ఏడుపు మాటల్ని మింగేస్తున్నది.

యాదాద్రి వైభవం 2021-02-21

త్రిభువనుడి మనసు వికలం అయింది. వీరు పేదవారైతే తను ధన సహాయం చేసేవాడు. బలవంతుల ద్వారా పీడింపబడే బలహీనులైతే, తాను కాపాడేవాడు. దేహబాధను దేవుడే తీర్చగలడు. భూమండలాన్ని పరిపాలించే అధిపతి అయిన తనకు, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే వీరికి భేదం ఏమీలేదు. రాజైనా రైతైనా సమస్య ఏర్పడితే పడే బాధ ఒకటే.

త్రిభువనుడిని చూస్తూ పరిహాసంగా నవ్వాడు పసివాడు. అతని అవిధేయత, ఇతరుల కష్టాలపట్ల సానుభూతి లేకపోవడం చూసి కోపం వచ్చింది. ప్రపంచం తెలియని పసివాడి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?

ఆ ముని బాలకుడిని కోపంగా ప్రశ్నించాడు.

“నువ్వు చిన్నపిల్లవాడివి. కష్టం అంటే తెలియని వయసు నీది. ఇతరులకు దుఃఖం కలిగితే సానుభూతి చూపాలన్న కనీస జ్ఞానం లేదు నీకు” మునిబాలకుడు ఇంకా పెద్దగా నవ్వాడు.

“ఆపు నీ దురుసుతనం” కోపంగా

గద్దించాడు.

“ఓహో, కోపం వచ్చిందా? ఏదో గొప్ప ఘోరం జరిగిపోయినట్టు.. ఇప్పుడున్న పరిస్థితులు.. ఇంక ఎప్పటికీ ఇలాగే ఉండి పోతాయీ అన్నట్టు.. వీరిద్దరు భావిస్తుంటే.. నేనేం చేయాలి? అసహాయతకు అవసరం కానీ, అజ్ఞానానికి సానుభూతి ఎందుకు?” నవ్వుతూనే అడిగాడు పసివాడు.

“ఇది అసహాయత కాదా? కొడుకు పిచ్చివాడై పోయాడు. కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఇంకా మాకు గంజిపోయడానికి, ఆదుకోవడానికి ఎవరున్నారు?” నిస్సహాయంగా ప్రశ్నించాడు పద్మనాభయ్య.

‘నేనున్నాను’ అని అనబోతుండగా.. మునిబాలకుడు అన్నాడు.

“నువ్వు కాదు. వీరిద్దరికీ అండగా, అందరూ ఉన్నారు.”

“అబద్ధం. మాకు ఎవరూ లేరు” లక్ష్మమ్మ ఏడుస్తూ అన్నది.

“మీకు తల్లి ఉంది. తండ్రి ఉన్నాడు. సోదరుడు ఉన్నాడు. స్నేహితుడున్నాడు. అన్నీ ఇచ్చేవాడు మీతోనే ఉన్నాడు. ఎవరూ లేరు అనడం అబద్ధం. ఎవరూ లేరు అనుకోవడం మీకై మీరు ఏర్పరుచుకున్న భ్రమ” విస్పష్టంగా పలికాడు ఆ పసి బాలుడు.

“లేరు మాకెవరూ లేరు” ఇద్దరూ కోపంగా అరిచారు.

“లేదు ఉన్నారు” దృఢంగా చెప్పాడు బాలుడు.

“వాళ్లిద్దరూ.. మాకెవరూ లేరు అని అంత ఇదిగా చెప్తుంటే.. నీ తలకెక్కదా? నీ మొండితనం నీదేనా? పసివాడివి కాబట్టి, క్షమించి వదిలేస్తున్నాను. వారికి క్షమాపణలు చెప్పుకొని, ఇక్కడి నుంచి వెళ్లిపో” కఠినంగా పలికాడు త్రిభువనుడు.

“ఎవరూ లేకపోతే.. ఇక్కడికెందుకు వచ్చారు? ఇక్కడెవరు ఉన్నారని వచ్చారు? మీరు తెలిసో తెలియకో అబద్ధం చెప్తున్నారు. నిజం ఏమిటో నేను చెప్తాను వినండి.

మీకు తల్లెవరో, తండ్రెవరో, అన్నెవరో, తమ్ముడెవరో, స్నేహితుడెవరో.. ఆ పేర్లు చెప్పమంటారా?”

“చెప్పు.. వాళ్లకు తెలియని, నీకు మాత్రమే తెలిసిన వాళ్ల వాళ్లెవరో.. చెప్పు” కటువుగా అన్నాడు త్రిభువనుడు.

“అయితే వినండి” ఆ ముని బాలకుడు కండ్లు మూసుకున్నాడు.

“మాతా నృసింహశ్చ – పితానృసింహ

భ్రాతా నృసింహశ్చ – సఖా నృసింహ

విద్యా నృసింహో – ద్రవిణం నృసింహ

స్వామి నృసింహా – సకలమ్‌ నృసింహ

ఇతో నృసింహా – పరతో నృసింహ

యతో యతాయాని తతో నృసింహ

నృసింహ దేవాన్నా పరాన్నా కించిత్‌

తస్మాన్‌ నృసింహ శరణం ప్రపద్యే..”

రాగయుక్తంగా పలికాడు.

“తల్లీ నరసింహుడే.. తండ్రీ నరసింహుడే.. సోదరుడు నరసింహుడే.. స్నేహితుడూ నరసింహుడే.. సకలం నరసింహుడే అయినప్పుడు – మీకు ఎవరూ లేకపోవడం ఏమిటి?”

త్రిభువనుడు ఆశ్చర్యపోయాడు.

నిజమే ఇది! ఇంతకీ ఎవరీ బాలుడు?

[email protected]

అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం 2021-02-21
యాదాద్రి వైభవం 2021-02-21
యాదాద్రి వైభవం 2021-02-21

ట్రెండింగ్‌

Advertisement