e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home చింతన విష్ణుచిత్తం నమామి

విష్ణుచిత్తం నమామి

‘పెరియాళ్వారు’ జయంతి (తిరునక్షత్రం) నేడు

గురుకుల మనధీత్య ప్రాహ వేదాన శేషాన్‌
నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతుకామః
శ్వశుర మమరవంద్యం రంగనాథస్య సాక్షాత్‌
ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి॥

- Advertisement -

సుప్రసిద్ధమైన ఈ సంస్కృత శ్లోకాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయాభిమానులైన విష్ణుభక్తులంతా ప్రతిరోజూ ఉదయాన్నే తప్పక పఠిస్తారు. భగవంతుని క్షేమాన్ని కోరి పరమాత్మకే రక్ష పెట్టిన విష్ణుచిత్తులవారి జయంతి నేడు. వారి అనన్య సామాన్యమైన భక్తిని అందరం ఆదర్శంగా తీసుకొంటూ, ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం.

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో పద్మ-ముకుందాచార్యులు దంపతులకు వారి ఆరాధ్యదైవమైన ‘వటపత్రశాయి’ అనుగ్రహంతో క్రోధన సంవత్సరం మిథున (జ్యేష్ఠ) మాసంలో శుక్లపక్ష ఏకాదశి (స్వాతి నక్షత్రంలో కూడిన) నాడు విష్ణుచిత్తులు అవతరించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరును సార్థకం చేసుకుంటూ విష్ణుచిత్తులు తమ చిత్తం (హృదయం)లో విష్ణువునే సుప్రతిష్ఠింపజేసుకొని, ఆ పరమాత్మ సేవయే తన జీవిత పరమావధిగా భావించి భారత, భాగవత పారాయణాలతో దైనందిన జీవితాన్ని కొనసాగించారు. భాగవతంలో మాలాకారుడు శ్రీకృష్ణునికి భక్తితో పూలమాలను సమర్పించిన ఘట్టాన్ని ప్రేరణగా పొంది, వటపత్రశాయికి తానుకూడా పరమభక్తితో తులసీమాలికలను, పుష్పమాలలను సమర్పించే లక్ష్యంతో నందనవనాన్ని ఏర్పాటుచేశారు. విష్ణుచిత్తులు తనకు తులసీవనంలో లభించిన శిశువుకు ‘గోదాదేవి’ అని నామకరణం చేసి ఆమెకు భాగవత కథలను ప్రతి నిత్యం వినిపిస్తూ, శ్రీమన్నారాయణుని పరమభక్తురాలిగా తీర్చిదిద్దారు.

పాండ్యరాజైన శ్రీవల్లభరాయలు పరతత్తాన్ని తెలుసుకోగోరి తన పురోహితులైన శెల్వనంబిద్వారా దేశదేశాలలోని తత్తజ్ఞులైన మహావిద్వాంసులతో ఒక ‘విద్వత్‌సభ’ను ఏర్పాటు చేయించి, మహాపండితులందరినీ ఆహ్వానించాడు. ‘పరతత్త నిర్ణయం చేసిన విద్వాంసునికి లభించేలా’ విద్యాశుల్కాన్ని సభామండపంలోని మధ్య స్తంభానికి వేలాడ దీయించాడు. ‘ఈ సభకు నువు వెళ్లి నేనే (విష్ణువే) పరతత్తమని శాస్త్రవాదంతో నిశ్చయింపుము’ అని వటపత్రశాయి స్వయంగా విష్ణుచిత్తులకు కలలో దర్శనమిచ్చి ఆజ్ఞాపించాడుట. ‘విద్యాగంధం లేని తోటమాలినైన నేను ఇందుకు అనర్హుడను’ అని విష్ణుచిత్తులు బదులిచ్చినా, ‘నిమిత్తమాత్రుడవై సభలోకి ప్రవేశించు. నేనే నీకు వాదించే శక్తిని కలిగిస్తాను’ అని వటపత్రశాయి ఆదేశించాడుట. భగవదాజ్ఞతో సభలోకి ప్రవేశించి విద్వన్మండలిని ఆశ్చర్యపరిచేలా శ్రుతి, స్మృతీతిహాస పురాణగ్రంథాలలోని ప్రమాణవాక్యాలను ఉదహరిస్తూ ‘శ్రీమన్నారాయణుడే పరతత్తమని’ నిర్ణయించగానే విద్యాశుల్కం విష్ణుచిత్తుల విజయాన్ని సూచిస్తూ కిందపడింది. దాంతో పాండ్యరాజుకూడా విష్ణుభక్తుడై, విష్ణుచిత్తుల సన్మాన శోభాయాత్రలో కాలినడకతో పాల్గొన్నాడు. వైకుంఠనాథుడైన శ్రీహరి లక్ష్మీదేవితో కలిసి గరుడవాహనంపై ఆ వేడుకకు తరలి వచ్చాడు. ‘పరమాత్మకు ఈ లోకులదృష్టి సోకి ఏమి ప్రమాదం వాటిల్లునో కదా’ అని భగవంతునికి రక్షగా ‘పల్లాండు పల్లాండు’ అంటూ ఎంతో గొప్పనైన ద్రావిడ ప్రబంధాన్ని విష్ణుచిత్తులవారు అప్పుడు పాడారు.

ఆళ్వార్లు భగవద్భక్తి సముద్రంలో నిమగ్నులై ఆ పరమాత్మ రూపగుణ చేష్టలను వర్ణిస్తూ, ప్రబంధాలను పాడి భగవదనుగ్రహంతో మోక్షాన్ని పొందాలని భావించారు. కానీ, ఈ విష్ణుచిత్తులు తాను కోరకుండానే భగవద్దర్శనం లభించినందుకు సంతోషించకుండా, మోక్షం కలుగాలని ఆశించకుండా భగవంతుని క్షేమాన్ని కాంక్షించడం ద్వారా ఆళ్వారులందరిలోకీ ‘పెద్ద ఆళ్వారు’ (పెరియాళ్వారు)గా ప్రసిద్ధులైనారు. వేదపఠనం చేసేవారు ‘హరిఃఓం’ అంటూ ఓంకారాన్ని ఉచ్చరించాకే వేదపారాయణం చేసినట్లు, పెరియాళ్వార్ల ‘తిరుప్పల్లాండు’ పఠించాకే ఇతర ఆళ్వార్ల ద్రావిడ ప్రబంధాలను అధ్యయనం చేయాలనే నియమం ఏర్పడింది. మహావిష్ణుభక్తులైన ఈ పెరియాళ్వార్‌ పెంపకంలో పెరిగినందువల్లనే గోదాదేవి సామాన్య మానవులను కాదని పరమాత్మనే భర్తగా వరించి శ్రీరంగనాథునికి భార్య అయింది.

సముద్రాల శఠగోపాచార్యులు
98483 73067

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana