‘సామవేద’ సంబంధమైన ‘మహోపనిషత్తు’లో విరాట్ పురుషుని శరీర నిర్మాణం గురించిన విశేషాలు వున్నాయి. సృష్టి ప్రారంభంలో ఏకైక భగవానుడు నారాయణుడు మాత్రమే. భగవానుడు కాకుండా బ్రహ్మ, రుద్రుడు, జలం, అగ్ని, సోమమాదిగాగల దేవతలు ఎవరూ లేకుండిరి. ద్యులోకం, పృథ్వీలోకాలు కూడా లేవు. అంతేకాక నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడాదిగాగల వారెవరూ లేరు. ఇలాంటి పరిస్థితిలో ‘విరాట్ పురుషుని’కి ఒంటరిగా ఉండటం నచ్చలేదు.
‘విరాట్ పురుషుని’ అంతఃకరణంలో స్థితమై వున్న ధ్యానం ‘యజ్ఞస్తోమం’ అంటే, ‘శ్రేష్ఠమైన యజ్ఞం’. దానిద్వారా ఒక కన్య, పద్నాలుగుమంది పురుషులు (ప్రతీకలు) ఆవిర్భవించారు. ఆ పద్నాలుగుమంది పురుషులు ఎవరంటే, జ్ఞానేంద్రియాలు (5), కర్మేంద్రియాలు (5) కలిసి పది, పదకొండవది తేజస్సుతో కూడిన మనస్సు, పన్నెండవది అహంకారం, పదమూడవది ప్రాణం, పద్నాల్గవది ఆత్మ, వీటితోపాటు కన్య అయిన పదిహేనవది బుద్ధి’. ఇవి కాక, సూక్ష్మభూతాలైన పంచతన్మాత్రలు (5), పంచభూతాల (5) తోపాటు మొత్తం ‘ఇరవై అయిదు’ తత్తాల సంయోగం చేత విరాట్ పురుషుని శరీర నిర్మాణం జరిగింది. ఈ దేహంలోకే పరమాత్మ రూప ‘ఆదిపురుషుడు’ ప్రవేశించాడు.
తదనంతరం, భగవానుడైన నారాయణునికి మరొక కోరిక కలిగింది. అంతఃస్థలంలో వున్న మనస్సుతో ధ్యానం చేశాడు. దాంతో అతని లలాటం నుండి త్రినేత్రయుక్తుడు, చేతిలో త్రిశూలం ధరించిన ‘పురుషుడు’ ఉద్భవించాడు. ఈ సంపదపరుడైన పురుషుని శరీరంలో యశస్సు, సత్యం, బ్రహ్మచర్యం, తపం, వైరాగ్యం, నియంత్రిత మనస్సు, శ్రీసంపన్నత, ఓంకార సహితంగా నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం), సమస్త ఛందస్సులు ప్రతిష్ఠితమైనాయి. ఈ కారణంగానే ‘త్రిశూలధారి’కి మహాదేవుడనే పేరు వచ్చింది.
భగవంతుడైన నారాయణునికి మరొక కోరిక కలగడంతో తదేక ధ్యానం చేయగా, లలాటంపై చెమట బిందువులు పుట్టాయి. అవి విస్తృతమై నలువైపులా జలం వ్యాపించగా, అందులోనుండి ‘చతుర్ముఖ బ్రహ్మ’ ఆవిర్భవించాడు. ఏ విరాట్ పురుషునికి వేలాది తలలు, వేలాది నేత్రాలు, అన్ని రకాల మంగళకారుడై, సర్వత్రా వ్యాపించినవాడై, పరాత్పరుడై, నిత్యుడై, అన్ని రూపాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడో ఆ నారాయణుని బ్రహ్మ ధ్యానించాడు.
దీన్నిబట్టి, నారాయణుడే సంపూర్ణ విశ్వస్వరూపం. ఈ విరాట్ పురుషునిపైనే సమస్త జగత్తు జీవనం ఆశ్రితమై ఉన్నది. ‘సంపూర్ణ జగత్పాలకుడు, విశ్వరూపుడు, విశ్వేశ్వరుడు అయిన శ్రీనారాయణుడు క్షీరసాగరంలో యోగనిద్రలో ఉండటాన్ని’ బ్రహ్మ తన ధ్యానంలో దర్శించినట్లు ‘మహోపనిషత్తు’ పేర్కొన్నది.
యం.వి.
నరసింహారెడ్డి
98491 10922