అన్నపూర్ణాదేవి
ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ॥
అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఒక చేతిలో మధురసాలతో కూడిన మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించిన రూపంలో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ ఎర్రని శరీర ఛాయతో, మెడలో తారహారాలు ధరించి, నిండు చంద్రుడిలా ప్రకాశించే ముఖంతో, విశాలమైన త్రినేత్రాలతో భాసిల్లుతుంటుంది. తన బిడ్డల ఆకలి తీర్చటానికి దుర్గాదేవి.. అన్నపూర్ణగా అవతరించింది. ఈ తల్లిని ఉపాసించిన వారికి ఏ లోటూ ఉండదు. బ్రహ్మతేజస్సు, వాక్సిద్ధి కలుగుతాయి. అంతేకాదు, తనను కొలిచినవారి సకల కార్యభారాన్నీ ఈ తల్లే వహిస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. అన్నపూర్ణకు దద్యోజనం (పెరుగన్నం), కట్టెపొంగలి నివేదనగా సమర్పించాలి. ఈ రోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పారాయణం చేయాలి. శక్తికొద్దీ అన్నదానం చేయాలి.
మహాలక్ష్మీదేవి
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్
సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్య సాహసాలు, విజయాలు ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి. సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో ఈమె మధ్యశక్తి. శ్రీసూక్తం లక్ష్మీదేవి వైభవాన్ని ఎంతగానో ప్రకటిస్తుంది. అగ్ని, మత్స్య పురాణాలు లక్ష్మీదేవి ఆకృతి, శిల్ప నిర్మాణ నియమాలను వివరంగా చెబుతున్నాయి. అష్టలక్ష్ములకూ అధిష్ఠాన దేవత ఈమె. మహాలక్ష్మి ఉపాసనతో లౌకిక సంపదతోపాటు అలౌకికమైన మోక్షసంపద కూడా లభిస్తుంది. శ్రీసూక్త విధానంగా ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తర నామాలతో అర్చించి, పూర్ణాలు నివేదన చేయాలి. అమ్మకు ప్రీతిగా సువాసినీ పూజ చేయాలి.