మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jun 08, 2020 , 07:00:09

తిరుపతి వెంకన్న దర్శనం

తిరుపతి వెంకన్న దర్శనం

హైదరాబాద్‌: సుమారు రెండున్నర నెలల తర్వాత తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో దేశవ్యాప్తంగా ఈ రోజు ఆలయాలు తెరచుకున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి తిరుపతి వెంకన్న భక్తులకు దర్శనమిచ్చాడు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలి రెండు రోజుల పాటు దర్శనాల ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. తొలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు దర్శనాలకు అవకాశం కల్పించింది. ఈ నెల 10న స్థానికులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనుంది. జూన్‌ 11 నుంచి సాధారణ భక్తులకు వెంకన్న దర్శనమివ్వనున్నాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి 20న తిరుమల ఆయలం మూతపడింది. స్వామివారికి నిత్యకైంకర్యాలు జరుగుతున్నప్పటికీ, భక్తులను అనుమతించలేదు.  

వైరస్‌ వ్యాప్తి నివారణకు టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అలిపిరి నుంచి శ్రీవారి సన్నిధి వరకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు దర్శనాలకు ఏర్పాట్లు చేసింది. గంటకు ఐదు వందల మంది చొప్పున, రోజుకు ఆరు వేల మందికి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూడు వేల మందికి ప్రత్యేక దర్శనం, మరో మూడు వేల మందికి సాధారణ దర్శనానికి ఏర్పాటు చేశారు. 

ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. జూన్‌ నెల కోటాను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఉంచనుంది. సర్వదర్శనం టికెట్లను నేరుగా వచ్చే భక్తులకు ఇవ్వనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, బస్టాండ్‌, శ్రీనివాసం ప్రాంతాల్లో టికెట్ల పంపిణీ చేయనున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా అలిపిరి వద్ద తనిఖీ కేంద్రం ప్రారంభించారు. భక్తులు మధ్య భౌతిక దూరం, శుభ్రత పాటించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు మూడు భాషల్లో సూచికలు ఏర్పాటు చేశారు. భక్తులకు దగ్గరగా సేవలందించే సిబ్బంది కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో ఒక్కో హాల్లో రెండు వందల మందిని మాత్రమే అనుమతిస్తారు.


logo