బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Jul 04, 2020 , 18:35:32

ఉత్తమ గురు-శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం సాకారం

ఉత్తమ గురు-శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం సాకారం

న్యూఢిల్లీ : సమాజంలో నెలకొన్న అనేక సమస్యలకు సరైన గురు శిష్య సంబంధాలు లేకపోవడం కూడా ఒక కారణమని, ఉత్తమమైన గురు-శిష్య సంబంధంతోనే ఉన్నతమైన సమాజం సాకారమవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫేస్ బుక్ వేదిక ద్వారా తమ మనోగతాన్ని పంచుకున్నారు. గురువును ప్రత్యక్ష దైవంగా మన పెద్దలు చెప్పారని, తన దృష్టిలో గురువు దేవుడు మాత్రమే కాదని, జ్ఞానాన్ని ప్రసాదించే గురువు భగవంతునికి మించిన వారని, అందుకే తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని భగవంతుడి కంటే ముందు గురువుకే ఇచ్చి భారతీయులు గురువును గౌరవించారని తెలిపారు. 

కళాశాలలో శ్రీ పోలూరి హనుమజ్జానకీ రామ శర్మ, న్యాయ కళాశాలలో ఆచార్య భాగవతుల సత్యనారాయణ మూర్తి తన పట్ల పుత్రవాత్యల్యం చూపిన విషయాన్ని గుర్తుచేసుకొన్నారు. అలాగే తనలోని నాయకత్వ లక్షణాలకు సానబెట్టి ప్రజాసేవ దిశగా పురిగొల్పిన సోంపల్లి సోమయ్య, భోగాది దుర్గాప్రసాద్, రాజకీయ జీవితం తొలినాళ్ళలో స్ఫూర్తిని పంచిన తెన్నేటి విశ్వనాథం, జాతీయ స్థాయిలో లాల్ కృష్ణ అద్వానీ పేర్లను ఉపరాష్ట్రపతి స్మరించుకుని, అందరికీ పేరుపేరునా ప్రణామాలు తెలిపారు. తల్లిదండ్రుల అనురాగం గారంగా మారితే బిడ్డ భవిష్యత్ పాడవుతుందని, కానీ గురువు పెంచుకునే అనురాగం వారిని వృద్ధిలోకి తీసుకువస్తుందన్న ఆయన.. గురువు దృష్టిలో రాజు కొడుకైనా, సేవకుడి కొడుకైనా సమానులే అని, విద్య నేర్పిన గురువుల పట్ల జీవితమంతా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండటంతోపాటు గురువు గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పే రీతిలో ప్రవర్తించాలని సూచించారు.  

విశ్వగురువుగా ప్రఖ్యాతి గాంచిన భారతదేశంలో సనాతన కాలం నుంచి ఉన్న విద్యావ్యవస్థ ఘనతను వివరించిన ఉపరాష్ట్రపతి.. పరమేశ్వరుడి దక్షిణామూర్తి స్వరూపం గురించి, కుమార గురువైన గణపతి గురించి, గురువు శుశ్రూషలు చేసిన పురాణ పురుషుల గురించి, గురు భక్తిని చాటుకున్న మహనీయుల గురించి, ఆచార్య త్రయం గురించి, వివిధ శాస్త్రాలకు సంబంధించిన గురు పరంపరను గురించి అనేక విషయాలను కళ్ళకు కట్టారు. ఈ సందర్భంగా భారతీయ యువశక్తిని మేల్కొలిపిన స్వామి వివేకానంద, వారి గురువు రామకృష్ణ పరమహంసల గురు-శిష్య సంబంధం గురించి వివరించారు. 

సంస్కారం ఇవ్వని చదువు నిరుపయోగమైనదన్న మహాత్మా గాంధీ సూక్తిని ఉదహరించిన వెంకయ్యనాయుడు.. గురువులు జ్ఞానంతో పాటు పిల్లలకు సంస్కారాన్ని కూడా బోధించాలని, సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా, సంస్కారాన్ని మాత్రం తల్లిదండ్రులు, గురువులే నేర్పిస్తారన్నరు. గురుపౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించుకుని వారు చూపిన మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. 


logo