గురువారం 09 జూలై 2020
Devotional - Jun 05, 2020 , 13:08:45

భక్తుల దర్శనాలకు సిద్ధమవుతున్న ఆలయాలు

భక్తుల దర్శనాలకు సిద్ధమవుతున్న ఆలయాలు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించడానికి దేవాలయాలు సిద్ధమవుతున్నాయి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మార్చి నెలలో మూతపడ్డాయి. ఆలయాల్లో పూజాధికాలు జరుగుతున్నప్పటికీ భక్తులకు ప్రవేశం కల్పించడం లేదు. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో ఈ నెల 8 నుంచి ఆలయాలు తెరచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల పరిసరాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దర్శనానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించడంతోపాటు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఢిల్లీలోని కల్కా జీ దేవాలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద శానిటైజేషన్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భౌతిక దూరం పాటించేలా ప్రత్యేకంగా మార్కింగ్‌ చేస్తున్నామని తెలిపారు. భక్తులు దేవతా మూర్తులను ముట్టుకోవడానికి వీల్లేదని, ప్రసాదాల పంపిణీ ఉండదని మొరదాబాద్‌లోని చాముండా దేవాలయ అధికారులు ప్రకటించారు. ఆలయాన్ని ఇప్పటికే శుద్ధిచేశామని వెల్లడించారు. 

దేవాలయంలోకి భక్తులను విడతలవారీగా అనుమతిస్తామని, ఒకసారి ఐదు నుంచి పది మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఢిల్లీలోని కనౌట్‌ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హనుమాన్‌ దేవాలయ అధుకారులు ప్రకటించారు. ఆలయంలోకి ప్రవేశించే గేట్‌ వద్ద శానిటైజేషన్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆలయంలో ప్రసాదాలను పంపిణీ చేయడం లేదని తెలిపారు.  

ఒడిశాలోని ప్రముఖ పూరీజగన్నాథ్‌ దేవాలయం భక్తుల దర్శనాలకు సిద్ధమవుతున్నది. స్వామివారికి స్నానపూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంజాబ్‌ అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయంలో శానిటైజేషన్‌ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దేవతా మూర్తులను, మత గ్రంథాలను ముట్టుకోవడం వంటివి చేయకూడదని, భక్తులను గుంపులుగా అనుమతించమని, భౌతిక దూరం పాటించాలని అధికారులు ప్రకటించారు. తమిళనాడులోని మధురైలో ఉన్న మురుగన్‌ దేవాలయంలో వైకాశి విశాఖం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

ఉత్తరప్రదేశ్‌లోని తక్వియత్‌ ఉల్‌ ఇమామ్‌ మసీద్‌ను ప్రార్థనల కోసం సిద్ధం చేస్తున్నారు. మసీదు మొత్తాన్ని శానిటైజేషన్‌ చేశారు. ప్రార్థనల కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మసీదు అధికారులు చెప్పారు. 


logo