గురువారం 28 మే 2020
Devotional - May 03, 2020 , 10:09:35

శ్రీవారి ద‌ర్శ‌నాలు లేక నేటికి 45 రోజులు

శ్రీవారి ద‌ర్శ‌నాలు లేక నేటికి 45 రోజులు

తిరుమ‌ల: కోట్లాది మంది ఇలవేల్పు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం భక్తులకు దూరమై 45 రోజులు అవుతోంది. తిరుమల చరిత్రలో శ్రీవారి దర్శనాలు ఇన్ని రోజులు నిలిపివేయ‌డం ఇదే తొలిసారి. కరోనా వైరస్ కార‌ణంగా మార్చి నెల మూడో వారం నుంచి దర్శనాలను నిలిపివేశారు. కేంద్ర ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా తిరుమలలోనూ లాక్ డౌన్ ను టీటీడీ పొడిగిస్తూ వచ్చింది. ఈ క్ర‌మంలోనే శ్రీవారి దర్శనంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో మరో రెండు వారాల పాటు దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్టు టీటీడీ ఇప్ప‌ట‌కే ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కేంద్రం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక మే 17 త‌ర్వాత‌ లాక్ డౌన్ ను ఎత్తివేస్తే, పరిమిత సంఖ్యలో అయినా భక్తులకు దర్శనాలను కల్పించాలని టీటీడీ భావిస్తున్న‌ది. అందుకు అవలంభించాల్సిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభించింది. 

కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోయేదాకా భక్తుల సంఖ్యపై పరిమితి విధించే అవకాశముంది. అయితే సాధారణ పరిస్థితుల్లో రోజువారీ వచ్చే భక్తుల్లో నాలుగోవంతు మందిని మాత్రమే దర్శనాలకు అనుమతించే అవ‌కాశం ఉన్న‌ది. అందులోనూ... కేవలం ఆన్‌లైన్‌, టైమ్‌ స్లాటెడ్‌ భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు.  వైకుంఠం క్యూ కాంప్లెక్సు ద్వారా అనుమతించే సర్వ దర్శనాన్ని కొంతకాలం పాటు ఆపివేయాలనే ప్రతిపాదన తెస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మొత్తం ఒక రోజులో 20 వేల నుంచి 22 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. అప్పుడు మాత్రమే క్యూ మార్గంలో, ఆలయంలో భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేయించే వీలుంటుందని అధికారులు సూచిస్తున్నట్టు తెలిసింది. ఖ‌చ్చితంగా మాస్కులు, శానిటైజ‌ర్ ఏర్పాటు వంటివి చేయ‌నున్న‌ట్లు సమాచార‌మ్‌. అయితే ఈ నెల 10వ తేదీ తరువాత సమావేశం కానున్న టీటీడీ పాలక మండలి బోర్డు, దర్శనాల విషయంలో భారీ మార్పులను ప్రకటిస్తుందని సమాచారం. 


logo