శుక్రవారం 04 డిసెంబర్ 2020
Devotional - Oct 24, 2020 , 22:02:47

మహాగౌరీగా శ్రీశైల భ్రామరీ

మహాగౌరీగా శ్రీశైల భ్రామరీ

శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవరోజు శనివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అర్చక వేదపండితులచే ప్రత్యేక వేదికపై ఆసీనులైన ఆదిదంపతులకు షోడశోపచార పూజలు జరిపించారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబదేవి మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ నందివాహన సేవలో ఉత్సవమూర్తులై విహరించారు. తెల్లని వస్త్రాలు ధరించి చతుర్భుజాలను కలిగి అత్యంత శాంతమూర్తిగా కనిపించే అమ్మవారిని దర్శించుకోవడంతో పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మేళతాళాలతో వేదమంత్రాలు వల్లిస్తూ జరిగిన ఆలయ ప్రాకారోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖామాత్యులు గుమ్మనూరు జయరాం, శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితోపాటు ఈఓ కేఎస్ రామారావు, తదితర అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా సాంప్రదాయంగా వస్తున్న కుమారి పూజలు, ఆయుధ పూజలను శాస్తోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాకారోత్సవంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీహరి, పీఆర్‌ఓ శ్రీనివాసరావు, ఏఈఓలు మల్లయ్య, హరిదాసు పాల్గొన్నారు.

స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవీ నవరాత్రులలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరామ్ తోపాటు ఎమ్మల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలకు రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఈఓ కేఎస్ రామారావు స్వాగతం పలికారు. అర్చక వేదపండితులు పట్టు వస్త్రాలకు శాస్త్రిక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో భాసిల్లాలని కాంక్షిస్తూ మహాసంకల్పం పఠంచారు. 2021 వ సంవత్సరపు వార్షిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. శ్రీశైల వైభవాన్ని చాటుతూ క్షేత్ర పరివార దేవతామూర్తుల చిత్రాలతో ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన క్యాలెండర్ ను రూపొందించిన శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్ కుమార్‌ను అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.