శుక్రవారం 30 అక్టోబర్ 2020
Devotional - Sep 21, 2020 , 12:57:13

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడిగా మలయప్ప

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడిగా మలయప్ప

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆల‌యంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ర‌కు స్వామివారిని సింహ‌ వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు. శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. నిద్రలేవగానే దర్శించే వాటిలో అతి ముఖ్యమైంది సింహదర్శనం. సోమరితనం నశించి పట్టుదలతో ముందుకు సాగి సర్వత్రా విజయం సాధించి ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. కార్యక్రమంలో పెద్దజీయర్‌ స్వామి, చినజీయర్‌ స్వామి, ఈవో అనిల్‌కుమార్‌ సంఘాల్‌, బోర్డు సభ్యులు అనంత శివకుమార్‌, శేఖర్‌రెడ్డి, గోవింద హరి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఎస్‌వీఎస్‌ఓ గోపినాథ్‌ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్‌, పేష్కార్‌ జగన్‌మోహన్‌చార్యులు పాల్గొన్నారు.