మంగళవారం 27 అక్టోబర్ 2020
Devotional - Sep 26, 2020 , 16:32:56

నకిలీ వైబ్‌సైట్లను అరికట్టేందుకు టీటీడీకి షిర్డీ సంస్థాన్‌ సరికొత్త ప్రతిపాదన

నకిలీ వైబ్‌సైట్లను అరికట్టేందుకు టీటీడీకి షిర్డీ సంస్థాన్‌ సరికొత్త ప్రతిపాదన

తిరుమల : నకిలీ వెబ్‌లైట్లను అరికట్టేందుకు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ సరికొత్త ప్రతిపాదనను టీటీడీ ముందుంచింది. దేశంలోని అన్ని ప్రముఖ హిందూ దేవాలయాలు తమ వెబ్‌సైట్‌లో మిగిలిన ఆలయాల సైట్ల వివరాలను పొందుపరచాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనను పరిశీలించాలని టీటీడీ పాలకమండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం అన్నమయ్య భవనంలో టీటీడీ ఉన్నతాధికారులు, షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ అధికారుల బృందంతో ధర్మకర్తల మండలి చైర్మన్‌ సమావేశం నిర్వహించారు.

కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు దర్శనం కల్పిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు తీసుకుంటున్న చర్యలు పరిశీలించేందుకు సంస్థాన్‌ అధికారులు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో కొవిడ్‌ పరిస్థితుల్లో తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న దర్శనం, వసతి, క్యూలైన్ల నిర్వహణ, అన్నదానం, శ్రీ‌వారి సేవ, అకౌంట్స్‌, ల‌డ్డూ ప్రసాదం కౌంటర్ల నిర్వహణపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌తో అవగాహన కల్పించారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న సామాజిక, ధార్మిక కార్యక్రమాలను వివరించారు. చైర్మన్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని, ఎలాంటి లోపాలు లేకుండా సంప్రదాయం ప్రకారం వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా హిందూ ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు అన్ని ప్రముఖ ఆలయాలతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందు కోసం అన్ని ప్రముఖ ఆలయాలతో ఒక ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి, ఏడాదికోసారి సమావేశమై ఆలోచనలు పంచుకునేలా చూస్తామన్నారు. ఏపీ సీఎం జగన్‌ ఆదేశంతో టీటీడీ దక్షిణాది రాష్ట్రాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుందని చైర్మన్‌ సంస్థాన్‌ అధికారులకు చెప్పారు. తమిళనాడులో త్వరలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. షిర్డీ సంస్థాన్ సీఈఓ హ‌రిశ్చంద్ర భ‌గాటే మాట్లాడుతూ తిరుమ‌ల‌లో క్యూలైన్లు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం, భద్రత తదితర అంశాలను బృందం ప్రత్యక్షంగా పరిశీలించిందని చెప్పారు. టీటీడీ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ సంస్థాన్‌కు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.

త్వరలో టీటీడీ అమలు చేయబోతున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కూడా ప్రారంభించాలని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి షిర్డీ ట్రస్ట్‌ అధికారులను కోరారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి సభ్యుడు శివకుమార్‌ తరఫున ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు పాలక మండలితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భగాటే హామీ ఇచ్చారు. సమావేశంలో ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు  శివ‌కుమార్‌, శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈఓ  ధ‌ర్మారెడ్డి, జేఈఓ బ‌సంత్‌కుమార్‌, సీవీఎస్‌ఓ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసీఏఓ బాలాజీ, షిర్డీ సంస్థాన్ డెప్యూటీ సీఈఓ రవీంద్ర ఠాక‌రే, హెచ్‌ఓడీలు సోమనాథ్‌, గోవింద్‌ పాల్గొన్నారు.


logo