e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఎడిట్‌ పేజీ శుద్ధ చైతన్యమే ‘పరబ్రహ్మం’

శుద్ధ చైతన్యమే ‘పరబ్రహ్మం’

శుద్ధ చైతన్యమే ‘పరబ్రహ్మం’

గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ మాగమవిదః
హరేః పత్నీం పద్మాం హరసహచరీ మద్రితనయాం
తురీయా కాపి త్వం దురధిగమ నిస్సీమ మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ.
-ఆది శంకరాచార్యులు (సౌందర్యలహరి: 97)

అమ్మా, పరబ్రహ్మ మహిషీ! నిన్ను వేదాదులు బాగా తెలిసిన జ్ఞానులు కొందరు వాక్కులను ఇచ్చే బ్రహ్మపత్నియైన ‘సరస్వతి’గా కొలుస్తారు (‘గీ’ అంటే వాక్కు). కొందరు శ్రీహరి పత్నియైన శ్రీలక్ష్మిగా ఆరాధిస్తారు. మరికొందరు శంకరుని సహచరి, పర్వతరాజు పుత్రికయైన హైమవతిగా పూజిస్తారు. కానీ, దేశకాలాలకు అతీతురాలివి, ఎల్లలు లేని మహిమ గలదానివి (నిస్సీమ మహిమా: లలితా సహస్రనామం), అనంత ప్రకాశరూపిణివి, ఊహాతీతమైన దానివి. అలతి మనస్కులు, ఇంద్రియ నిగ్రహణ లేనివారు చేరరాని దానివైన నీవు పరబ్రహ్మ లేదా సదాశివుని సతీదేవిగా, చంద్రకళగా భావింపబడే శ్రీ విద్యాస్వరూపిణివై, మహామాయగా ప్రకటితమవుతున్నావు. ఎవరు ఏపేరుతో పిలిచినా నీవు ఆ మూడింటికీ అతీతమైన ‘తురీయావస్థ’కు చెందిన దానివి.
ఆదిశక్తి తనలోని సాత్వకీ శక్తి ఆధారంగా లక్ష్మిని, రాజసీ శక్తి ఆధారంగా సరస్వతిని, తామసీ శక్తి ఆధారంగా పార్వతిని సృజించి, వరసగా విష్ణువు-బ్రహ్మ-శంకరులకు ఇచ్చి సృష్టికార్య నిర్వహణ చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు ‘దేవీ భాగవతం’ చెబుతున్నది. సృష్టిలో భాగమై ఉంటూనే సృష్టికి అతీతంగా ఉండటం ‘తురీయావస్థ’. జాగృత, స్వప్న, సుషుప్తావస్థలకు అతీతమైన అవస్థా ‘తురీయమే’. స్థూలసూక్ష్మకారణ శరీరాలకు అతీతమైన దానినీ ‘తురీయమనే’ అంటారు. నామరూప రహితమైన శుద్ధచైతన్యమే ‘పరబ్రహ్మం’. ‘బ్రహ్మం’ అంటే ‘పరివ్యాప్తమని’ అర్థం. అంతటా వ్యాపించిన పరబ్రహ్మ తత్త్వంగా, మహామాయ స్వరూపిణివై ఈ విశ్వాన్ని మోహింప చేస్తున్న తల్లీ నీకు వందనం’. బ్రహ్మతత్త్వాన్ని తెలిసినవారు, వేదాలలో చెప్పినట్లుగా నిర్వికారుడు, నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, నిత్యము, సత్యము, శాశ్వతమూ అయిన సదాశివుని ఆరాధిస్తారు. జగత్తంతా ఆవరించింది సదాశివ తత్త్వమే. స్త్రీపురుష భేదం లేనట్టి ఆ తత్త్వమే అంతటా నిండిన ఆదిశక్తి. ఆమె తనలాంటి మరికొన్నింటిని సృజించాలని అనుకున్నది. అదే శుద్ధ చైతన్యమై, మహామాయగా అవతరించింది. ఆ ఆదిశక్తియే రెండు (స్త్రీ పురుషులు)గా, అనేకంగా మారి అనంత సృష్టి జరిగింది. శక్తి పదార్థాలుగా అవతరించిన ఆదిశక్తి శూన్యంలో నిండిపోయింది. శూన్యం, పదార్థం పరస్పరాధారితాలు.
నిజానికి ‘ఏకమేవాద్వితీయం బ్రహ్మ’ అన్నారు. ఉన్నది ఒక్కటే, అదే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ తత్త్వమే సృష్టిలోని ప్రతిజీవిలో, ప్రతివస్తువులో చైతన్యరూపంలో ప్రకాశిస్తున్నది. సాధకులకు ఆదిశక్తి ఆంశగా ప్రకటితమైన సరస్వతి, శ్రీలక్ష్మి, పార్వతిలు తమవద్ద ఉన్న శక్తులను ఇవ్వగలరు. కానీ, ప్రతిజీవి అంతిమ గమ్యమైన మోక్షాన్ని అమ్మ తప్ప, మరెవరూ ఇవ్వలేరు. తాత్త్వికంగా సరస్వతీదేవిది ‘ఐం’కార బీజం, లక్ష్మిది ‘హ్రీం’కార బీజం, పార్వతిది ‘శ్రీం’కార బీజం. కాగా, ‘ఓం’కార బీజం తురీయమైన అమ్మవారిది. నిజానికి ఈ మూడూ ఆమె స్వరూపాలే. ఒక్కొక్క ప్రయోజనాన్ని ఆశించి బహిర్గతమైన మూలతత్త్వానికి మూడు పార్శ్వాలుగా వాటిని గుర్తించాలి. ఒక వ్యక్తి తాను కుమారునిగా, సోదరునిగా, భర్తగా, తండ్రిగా, తాతగా గుర్తింపబడినా మూలంలో ఒక్కడే అయినట్లుగా, అమ్మ ఒక్కతే సృష్టి నిర్వహణలో వివిధ పాత్రలను పోషించే సమయంలో పలు రూపాలలో గుర్తింపబడుతుంది. సాధకుడు (జ్ఞాత) ఏది సాధించాలన్నా ముందుగా కావలసింది జ్ఞానం. తదుపరి ఆ జ్ఞానాన్ని ఆసరా చేసుకొని సంపదను సాధించాలి. రెంటినీ సమన్వయం, సద్వినియోగం చేసుకుంటూ అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని సాధించాలి. దానినే ‘జ్ఞేయం’ అంటారు. ‘బ్రహ్మ స్వరూపిణీ’, ‘ఆజ్ఞేయ’, ‘అనంత’, ‘అలక్ష్య’, ‘అజ’, ‘ఏక’, ‘అనేక’, ‘మాతృక’, ‘జ్ఞాన స్వరూపిణి’, ‘శూన్య, శూన్యసాక్షిణి’ అయిన ఆ ‘చిన్మయాతీత’ అమ్మవారు అందరికీ శుభదాయిని కావాలి.
శుద్ధ చైతన్యమే ‘పరబ్రహ్మం’పాలకుర్తి రామమూర్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శుద్ధ చైతన్యమే ‘పరబ్రహ్మం’

ట్రెండింగ్‌

Advertisement