మంగళవారం 09 మార్చి 2021
Devotional - Jan 15, 2021 , 21:12:49

శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కనుమ పండుగ సందర్భంగా ఐదోరోజు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఆలయ ప్రధాన అర్చకుడు భద్రయ్య ఆధ్వర్యంలో గోపూజ, బసవన్నకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామిఅమ్మవార్లను కైలాస వాహనంపై అధిష్టింపజేసి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం జరిపించారు. ఆలయ దక్షిణ మాడ వీధిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో స్థానిక మహిళలతోపాటు భక్తులు పాల్గొని ఆకట్టుకునేలా రంగురంగు రంగవల్లులు వేశారు. ముగ్గులను ఆలయ అధికారులు పరిశీలించారు. 


వైభవంగా ఆదిదంపతుల కల్యాణం.. 

గురువారం సాయంత్రం నంది వాహనసేవ అనంతరం ఆదిదంపతులకు గిరిజన సంప్రదాయం ప్రకారం కల్యాణం ఘనంగా జరిపించారు. చెంచుల సమక్షంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణం నిత్యకల్యాణ మండపంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా జరిగింది. పరిసర ప్రాంతాలతోపాటు వివిధ జిల్లాల నుంచి చెంచులు వివాహాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. చెంచు సంప్రదాయం ప్రకారం స్వామిఅమ్మవార్లకు వెదురు బియ్యం, పుట్టతేనె, ఆభరణాలు సమర్పించి ఆదిదంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు అడవి పుత్రులు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo