e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News సమ్మోహన సంక్రాంతి

సమ్మోహన సంక్రాంతి

పులిలా తరిమే చలి. మంచుబిందువులను ముత్యాల్లా ధరించి మిలమిల మెరిసే గడ్డిపరకలు. రాత్రులు దీర్ఘమై, పగళ్లు హ్రస్వమైపోయే గమ్మత్తయిన వాతావరణం. ఉదయ భానుడి నులివెచ్చని కిరణాల స్పర్శతో పులకించే ప్రాణికోటి. మందారాలకు జతగా బంతులు, చేమంతులతో హేమంత సీమంతినీ విలాసం, గంగిరెద్దుల ఆటలు.. వెరసి పౌష్యలక్ష్మిగా ప్రకృతి సరికొత్త కాంతులతో పరవశించే పర్వమే సంక్రాంతి పండుగ. వీధులన్నీ అందమైన రంగవల్లులతో, అందులో అలంకరించిన గొబ్బెమ్మలు.. కొత్తగా ఇంటికి చేర వచ్చిన ధాన్యలక్ష్మికి స్వాగతం పలుకుతుంటాయి. కొత్త ఆశలన్నీ అందాల గాలిపటాలై ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంటాయి. ఆడపడుచులు, అల్లుళ్ల రాకతో ఇల్లంతా సందడి. పిండివంటలు, ముత్తయిదువుల వాయనాలతో పండుగ శోభ రెట్టింపవుతుంది. సూర్యభగవానుడి ఆరాధన, గోపూజతో ఆధ్యాత్మికత పరిఢవిల్లుతుంటుంది. ఆచారాలు, సందళ్లు కలబోసిన అద్భుతమైన పండుగ సంక్రాంతి.

‘సమ్యక్‌ క్రాంతి సంక్రాంతి’- అంటే మనోజ్ఞమైన క్రాంతి. సౌరమానం ప్రకారం ప్రతినెలా ఒక్కో రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇలా సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి. కానీ, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని అంటే మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా చేసుకుంటాం. ‘తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’- మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుంచి తరువాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. భగీరథుడు గంగను భూమి మీదికి తెచ్చింది కూడా సంక్రాంతి రోజేనని అంటారు. మకర సంక్రమణంతో ఉత్తరాయణం మొదలవుతుంది. దేవతలకు పగటి వేళగా చెప్పే ఉత్తరాయణం ఆధ్యాత్మిక సాధనకు అనువైన సమయంగా పేర్కొంటారు. ఇచ్ఛా మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురుచూసి ఆ తర్వాతే తనువు చాలించాడు.

- Advertisement -

సంక్రాంతి పర్వదినం సందర్భంగా పితృదేవతలకు ప్రీతి కలిగించేలా పితృతర్పణాలు విడుస్తారు. సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికీ పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు, మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో తర్పణాలిస్తే ఏడాదిలో అన్ని సంక్రాంతులకూ ఇచ్చినట్టేనని చెబుతారు. అంతేకాదు, సంక్రాంతి సందర్భంగా పితృదేవతలకు సద్గతులు కలగాలనే సంకల్పంతో వారిపేరిట దానధర్మాలు చేస్తారు. భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్న దానం, పుస్తకదానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ, చెరుకుగడలు, రేగుపండ్లు ఇలా శక్తి మేరకు దానాలు చేస్తారు.

సంక్రాంతి రోజున గడపకు పసుపు పెట్టి, గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కట్టి, రంగురంగుల రంగవల్లులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తారు. ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారు. ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేసి సంక్రాంతి పురుషుడిని శ్రీమన్నారాయణుడిగా భావించి ఆరాధిస్తారు. సంక్రాంతి నోము నోచుకొని, ముత్తయిదువలకు వాయనాలు సమర్పిస్తారు. తెలంగాణలో పండుగ సందర్భంగా వారం ముందునుంచే రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. అలా సంక్రాంతిని ‘అప్పాల పండుగ’ అనికూడా పిలచుకుంటారు. ముఖ్యంగా నువ్వులు బెల్లంతో చేసిన ఉండలను ఇచ్చి పుచ్చు కుంటారు. బెల్లం-నువ్వులు దానం వల్ల గ్రహదోషాలు పరిహారం అవుతాయని నమ్మకం. అంతేకాకుండా, నువ్వుల లడ్డూలు ఈ కాలానికి శరీరానికి కావాల్సిన వేడిని, శక్తిని అందిస్తాయి. ఇలా ప్రతి ఆచారం వెనుక ఒక పరమార్థాన్ని నిక్షిప్తం చేశారు మన పెద్దలు. మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజును ముక్కనుమగా కూడా జరుపుకొంటారు.

మరుమాముల దత్తాత్రేయశర్మ
94410 39146

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement