బుధవారం 30 సెప్టెంబర్ 2020
Devotional - Sep 14, 2020 , 19:28:10

నిబంధనల మధ్య తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

నిబంధనల మధ్య తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

తిరువనంతపురం : శబరిమల ఆలయం దీపావళి తరువాత సాధారణ ప్రజలకు అందుబాటులో రానున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయం బోర్డు నిబంధనలు సిద్ధం చేసింది. నవంబర్ 16 నుంచి అయ్యప్ప దర్శనం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆలయంలో దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక కమిటీ కొన్ని సూచనలు చేసింది. 

ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అయ్యప్ప స్వామి దర్శనం గురించి వివరించే స్థితిలో లేనందున ప్రత్యేక కమిటీ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు దర్శనానికి ముందు 14 రోజులు, దర్శనం తర్వాత 10 రోజులు స్వీయ నిర్బంధంలో గడపాల్సి ఉంటుంది. ఆలయంలో జరిపే పూజలకు ఎవరినీ అనుమతించరు. సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు నెలవారీ ఆరాధన కోసం ఆలయం తెరుస్తారు. అయితే ఈ సమయంలో భక్తులకు ప్రవేశానికి అనుమతించరు. మకరవిలక్కు సందర్భంగా మార్గదర్శకాలను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉన్నది.

నవంబర్-డిసెంబర్ రెండు నెలలు శబరిమల ఆలయానికి ప్రత్యేకమైనవి. మలయాళ క్యాలెండర్‌లో వీటిని మండలం, మకరవిలక్కు నెల అంటారు. ఈ నెలల్లో అయ్యప్ప స్వామి తత్వశాస్త్రానికి ఇక్కడ ప్రాముఖ్యం ఉన్నది. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. సుమారు ఒకటిన్నర నెలలపాటు భక్తులు స్వామి దర్శనం కోసం ఇక్కడకు తరలి వస్తారు. గత కొన్ని సంవత్సరాల్లో స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య 3 మిలియన్లకు చేరింది.

ప్రత్యేక కమిటీ చేసిన సూచనలు

20 ఏండ్లలోపు, 50 ఏండ్లు పైబడిన వారిని అనుమతించకూడదు. ఆలయ సందర్శనకు ముందు 14 రోజుల స్వీయ నిర్బంధకాలం అవసరం. దర్శనం అనంతరం కూడా 10 రోజుల స్వీయ నిర్బంధ కాలం ఉంటుంది. 5000 మందికి ఒకేసారి ఆలయంలో ప్రవేశం లభించనున్నది. ఆలయంలో క్రమం తప్పకుండా కొవిడ్ -19 టెస్టులు జరుపాలి. ఈ నియమాలు ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. ప్రధాన పూజల సమయంలో 50 మంది మాత్రమే హాజరవ్వాలి. ఆన్‌లైన్ అనుమతులు, వర్చువల్ క్యూ సిస్టమ్స్, ప్రసాదం వంటి వాటిని తిరస్కరించడం కోసం కూడా సూచనలు ఉన్నాయి. 

శబరిమల ఆలయ దర్శనం చాలా కాలంగా వివాదంలో ఉంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న స్త్రీల ప్రవేశించానికి అనుమతించరు. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత కూడా పరిస్థితి అదే మాదిరిగా ఉన్నది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. చాలా మంది మహిళలు బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.


logo