గురువారం 29 అక్టోబర్ 2020
Devotional - Sep 19, 2020 , 08:41:42

తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..

తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..

తిరుమల : తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాలకు అంకురార్పణ క్రతువును అర్చకులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించనున్నారు. రాత్రి జరిగే పెద్దశేష వాహనసేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన టీటీడీ.. వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపేందుకు చర్యలు తీసుకుంటోంది.

శుక్రవారం రాత్రి సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం జరిపారు. స్వామివారి సేనాపతి అయిన విశ్వక్సేనుల వారిని శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షిణగా రంగనాయకుల మండపానికి తీసుకువచ్చారు. వైదిక కార్యక్రమాల అనంతరం యాగశాలలో అంకురార్పణ జరిగింది. ఉత్సవాల విజయవంతం కావడానికి స్వామివారి ఆశీస్సులు కోరుతూ నవధాన్యాలను మొలకెత్తించారు.

శనివారం సాయంత్రం 6.03గంటల నుంచి 6.30గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. దీనికి కోసం విష్ణుదర్భతో తయారు చేసిన ఏడు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడెల్పుతో తయారు చేసిన చాపలను, 211 అడుగుల పొడవుతో తాడును సిద్ధం చేశారు. రాత్రి 8గంటలకు పెద్దశేష వాహనసేవతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు స్వామి వారు వివిధ వాహన సేవలపై దర్శనమిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో లోపల కల్యాణ మండపంలో వాహనసేవలను కొలువుదీర్చి, వైదిక క్రతువులు నిర్వహించి, సేవలపై స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపడుతారు.

ఇదిలా ఉండగా.. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలను ఏకాంతంగా ఆగమోక్తంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ నెల 23న గ‌రుడ‌సేవ రోజున సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య ఏపీ సీఎం జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నందున గరుడ సేవ రోజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించాలని తాము కోరినందువ‌ల్లే సీఎం హాజరవుతున్నారని పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.