గురువారం 03 డిసెంబర్ 2020
Devotional - Nov 20, 2020 , 21:07:14

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ

తిరుమ‌ల :  శ్రీ‌వారి ఆల‌యంలో శ‌ని‌వారం జ‌రుగ‌నున్న పుష్పయాగానికి శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీవిష్వక్సేనుల వారిని ఆల‌యం నుంచి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహ‌ణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 9 నుంచి 10 గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. కార్యక్రమంలో ఆల‌య ప్రధానార్చకులు  వేణుగోపాల దీక్షితులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

రేపు పుష్పయాగం..

శ్రీ‌వారి ఆల‌యంలో శనివారం పుష్పయాగం సంద‌ర్భంగా రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.