బుధవారం 21 అక్టోబర్ 2020
Devotional - Sep 22, 2020 , 19:12:16

కివీఫ్రూట్‌.. నెమలి పింఛాలతో శ్రీవారికి స్నపన తిరుమంజనం

కివీఫ్రూట్‌.. నెమలి పింఛాలతో శ్రీవారికి స్నపన తిరుమంజనం

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో మొదటిసారిగా కివీఫ్రూట్‌, నెమలి పింఛాలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్వామివారి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత మలయ్యప్ప స్వామి వారి ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ కంకణభట్టార్‌ గోవిందాచార్యులు కార్యక్రమం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన కార్యక్రమంలో వివిధ రకాల మాలలతో ఉభయ దేవేరులతో శ్రీవారు దర్శనమిచ్చారు. ప‌లు ర‌కాల సుగంధ ద్యవ్రాలతో అభిషేకం చేస్తుండగా, ప్రత్యేక మాలలను అలంకరించారు. కివీఫ్రూట్‌, ఫైనాపిల్‌, నెల్లికాయలు, బ్లాక్ వెల్వెట్‌, ముత్యాలు- నందివర్థనం, నెమలి  పింఛాలతో, పవిత్రమాలలు, వట్టివేరు, రోజ్‌ పెటల్స్‌తో తయారు చేసిన మాలలు, కిరీటాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించామని ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. 


ఆకట్టుకున్న మక్కజొన్న, యాపిల్‌ మండపం

స్నపన తిరుమంజనం నిర్వహించే రంగ నాయ‌కుల మండపాన్ని వివిధ ర‌కాల సంప్రదాయ పుష్పాలు, కట్‌ రోజ్‌ ఫ్లవర్స్‌, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, మక్కజొన్నలు, యాపిల్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కనులపండువలా సాగిన స్నపన తిరుమంజనాన్ని ఎస్‌వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు డీపీ అనంత, శేఖర్‌రెడ్డి, గోవింద హరి పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.