శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Mar 16, 2020 , 13:35:40

పాక్‌లో 400కు పైగా హిందూ దేవాలయాల పునరుద్ధరణ

పాక్‌లో 400కు పైగా హిందూ దేవాలయాల పునరుద్ధరణ

పాకిస్థాన్‌లో గత మూడు దశాబ్దాలుగా మూలన పడిన సుమారు 400కు పైగా హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్టు ‘గల్ఫ్‌ న్యూస్‌' ఇటీవల వెల్లడించింది. అక్కడి మొత్తం 428 దేవాలయాలకుగాను 408 ఆలయాలు 1990 తర్వాత బొమ్మల దుకాణాలు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లుగా మార్చివేయబడ్డాయి. వీటన్నింటినీ దశల వారీగా తిరిగి తెరవాలని అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. వాటిలో సియాల్‌ కోట్‌లోని ప్రసిద్ధ జగన్నాథ్‌ దేవాలయం, సుమారు వెయ్యేళ్ల కిందటి శివాలయం వంటివి ఉన్నాయి. 

పాకిస్థాన్‌లో పూజలకు నోచుకోకుండా, ఆక్రమణలకు గురైన దేవాలయాలన్నింటినీ క్రమపద్ధతిలో పునరుద్ధరించాలన్న డిమాండ్‌ ఆ దేశంలో చాలాకాలంగా ఉన్నది. స్వాతంత్య్రం తర్వాత పాకిస్థాన్‌లోని అనేక ఆలయాలు, పలువురు హిందూ కుటుంబాల ఆధ్వర్యంలోనివి సైతం స్థానికుల బలవంతపు ఆక్రమణలకు గురైన సంగతి తెలిసిందే. చాలావరకు ఆలయ సముదాయాలు అక్కడి సాధారణ ప్రజల ఉపయోగానికి బదలీ చేయగా, వాటిలో కొన్ని మదరసాలు (విద్యాసంస్థలు)గానూ మారాయి. ఇప్పుడు వీటన్నింటినీ తిరిగి పునరుద్ధరించి హిందువులకు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్టు పై వార్తాకథనం పేర్కొంది. మొత్తం మీద 400కు పైగా వున్న దేవాలయాలను పున:ప్రారంభింపజేసి, వాటిని పాకిస్థాన్‌లోని హిందూ పౌరులకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ దేశంలో చారిత్రక ప్రసిద్ధినొందిన రెండు దేవాలయాలు సియాల్‌కోట్‌, పేష్వార్‌లతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తున్నది. 

ఈ మేరకు అక్కడి జగన్నాథ్‌ దేవాలయం, వెయ్యేండ్ల కిందటి శివాలయాల పునరుద్ధరణ పనుల ప్రారంభానికి ఇప్పటికే అంతా సిద్ధమైనట్లు పై వార్తాకథనం పేర్కొంది. 1992లో బాబ్రీ మశీదు విధ్వంసం తర్వాత అక్కడి హిందువులు పై శివాలయ సందర్శనను మానుకొన్నారు. అలాగే, పేష్వార్‌లోని గోరక్‌నాథ్‌ దేవాలయాన్ని పున:ప్రారంభించాలని అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేయడమేకాక ఆ ప్రాంతాన్ని ‘వారసత్వ ప్రదేశం’గా కూడా ప్రకటించింది. ఇక, ఇప్పట్నుంచీ ఏడాదికి 2 నుంచి 3 దేవాలయ సముదాయాల చొప్పున పాకిస్థాన్‌ ప్రభుత్వం అన్ని గుళ్లనూ పున:ప్రారంభించనున్నారు. అయితే, అంతకు ముందు ‘ఆల్‌ పాకిస్థాన్‌ హిందూ రైట్స్‌ మూవ్‌మెంట్‌' ఆధ్వర్యంలో జరిగిన ఒక అధ్యయనం ఆ దేశంలోని హిందూ దేవాలయాల స్థితిగతులను’ వెల్లడించింది. మొత్తం 428 దేవాలయాలు ఉండగా, వాటిలో 408 ఆలయాలు 1990 తర్వాత టాయ్‌ స్టోర్స్‌, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలుగా మారినట్లు ఆ సర్వేలో తేలింది. 

అయితే, ఇటీవలి ఒక ప్రభుత్వ అంచనా ప్రకారం ‘కనీస స్థాయిలో సింధ్‌లో 11, పంజాబ్‌లో 4, బాలోచిస్థాన్‌లో 3, ఖైబర్‌ పాక్తుంక్వాలో 2 హిందూ దేవాలయాలు 2019లోనే తెరుచుకొన్నాయి. భారతదేశం వైపున్న పంజాబ్‌నుండి గురునానక్‌ జన్మస్థలానికి వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం కర్తార్‌పూర్‌ సాహెబ్‌ కారిడార్‌ను తెరవడానికి పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈమధ్య అంగీకరించింది. దీనితోపాటు పాకిస్థాన్‌ పరిపాలనలోని కాశ్మీర్‌లో శారదాపీఠానికి నెలవైన ప్రాచీన సరస్వతీ దేవాలయ సందర్శనకు రావాలనుకొనే హిందూ యాత్రికులను అనుమతిస్తూ ఒక మార్గం ఏర్పాటుకు చెందిన ప్రతిపాదనకు కూడా అక్కడి ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు పై వార్త వెల్లడించింది.


logo