శుక్రవారం 04 డిసెంబర్ 2020
Devotional - Oct 29, 2020 , 02:35:54

అన్యథా శరణం నాస్తి!

అన్యథా శరణం నాస్తి!

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్‌ కారుణ్య భావేన రక్ష రక్ష పరాత్పర॥

- ఆత్మ ప్రదక్షిణ మంత్రం

మనకు వెలుగును, వేడిమిని ఇవ్వడమే కాక ఆహారం, ఆరోగ్యం, చైతన్యాలను ప్రసాదించే సూర్యుడికి ఉదయం వేళ తూర్పువైపునకు ముఖం చేసి నిలబడితే కుడివైపు దక్షిణ దిశ అవుతుంది. ‘దక్షిణ’ శబ్దంలోనే ‘శ్రేష్టమైంది’ అని అర్థం ఉంది. సమర్థుడైన నాయకుడు దక్షిణ నాయకుడు. పెద్దలకు ఇచ్చి నమస్కరించేది దక్షిణ. శరీరంలో కుడిభాగం సమర్థవంతమైంది కావడం వల్ల అది ‘దక్షిణ భాగం’ అవుతుంది. తమ చుట్టూ తాము కానీ, మరో సమర్థవంతమైన దానిచుట్టూ కానీ కుడివైపునకు తిరగడం ‘ప్రదక్షిణం’ అవుతుంది. ఈ ‘ప్రదక్షిణం’ అనే శబ్దం లోకంలో సాధారణార్థాల్లో విపరీతంగా వినియోగిస్తున్నాం. తమ పనుల కోసం ఏవైనా కార్యాలయాల చుట్టూ కానీ, పెద్దవారి చుట్టూ కానీ తిరిగిరావలసి వస్తే ‘వారిచుట్టూ ప్రదక్షిణం చేయడమే సరిపోతుందనే’ భావాన్ని కూడా వ్యక్తపరుస్తుంటారు.

‘ప్రదక్షిణ భావాన్ని’ మనకు అత్యున్నతంగా తెలియజేసేది ఈ సృష్టి మాత్రమే. మన సౌరమండల కేంద్రమైన సూర్యుడు అత్యంత శక్తివంతుడు. సూర్యునిచుట్టూ ఆగకుండా నిర్దేశిత కక్ష్యలో భూమి తిరుగుతుంది. భూమి మాత్రమే కాదు, సౌరమండలంలోని ఇతర గ్రహాలన్నీ ఈ ప్రదక్షిణం చేస్తూనే ఉన్నాయి. సృష్టి మొత్తంలోనూ ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. పెద్దశక్తి చుట్టూ చిన్న శక్తులు తిరగడం మనకు అనుభవమే. భూమి సూర్యునిచుట్టూ ప్రదక్షిణం చేస్తే, భూమి చుట్టూ చంద్రుడు సంచరిస్తాడు.  దీనివల్ల ఒకదాని శక్తి మరొక దానికి ప్రసారమవుతుంటుంది. భూమి కూడా తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ సంచరిస్తుంది. ఒకటి ఆత్మభ్రమణం కాగా, మరొకటి పరిభ్రమణం. అదేవిధంగా తమలోని చైతన్యం చుట్టూ మనస్సూ, శరీరాలు సంచరిస్తే దానిని ‘ఆత్మప్రదక్షిణం’ అని, ఒక దైవమో, మరో శక్తి చుట్టూనో సంచరిస్తే దానిని ‘దైవప్రదక్షిణం’ అనీ అంటున్నాం. ‘ప్రదక్షిణం’ చాలా విలువైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మనకన్నా ఉన్నతమైన దానిచుట్టూ మనం ఉంటే మన శక్తీ, స్థాయీ విస్తరిస్తాయని తెలుపుతున్నదీ ప్రదక్షిణం. శక్తివంతులైన వాళ్లదే ఈ లోకం. శక్తిహీనులు ఎప్పటికైనా మరో శక్తిచుట్టూ సంచరిస్తూ ఉండాల్సిందే. తాము శక్తివంతులు కావాలంటే అత్యుత్తమ శక్తిని లక్ష్యంగా చేసుకొని దానిచుట్టూ సంచరించాలి. శక్తిహీనుని చుట్టూ ప్రదక్షిణం చేస్తే తమ శక్తిని కోల్పోయి, తాము ఉపయోగపడని స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. తమ కిందివారిని తాము కాపాడాలంటే, తమకన్నా శక్తివంతుణ్ణి తాము ఆశ్రయించాలి. ఈ ప్రకృతి నియమం జీవితంలోనూ, సమాజంలోనూ ప్రతీ క్షణమూ మనకు కనిపిస్తూనే ఉంటుంది.

మనిషి నిరంతరం ఆనందం, ఉన్నతి, సంతృప్తి, సంతోషాదుల వైపు దృష్టిసారిస్తూ, అది తప్ప ‘మరో శరణం లేదు’ అనుకుంటే, ఆ దైవగుణాలే మనకు నిరంతరం వినియోగపడుతుంటాయి. ఎప్పటికీ సమస్యలు, ఒత్తిడులు, చికాకులు, బాధల వైపు దృష్టిని కేంద్రీకరించి వాటిచుట్టూనే ఆలోచనా పరంపరలను కొనసాగిస్తే (ప్రదక్షిణం చేస్తే) శారీరక, మానసిక శక్తులన్నీ అదృశ్యమైపోయి, పూర్తిగా బలహీనుడవుతాడు. దేవాలయాల్లో దైవం చుట్టూ ప్రదక్షిణం చేయడం అంటే శక్తి చుట్టూ నిరంతరం సంచారం చేయడమే. అది తప్ప, మరో మార్గం లేదని విశ్వసించడమే. ఎటువంటి సమస్యలు జీవితంలో ఎదురైనా సమస్యను ఆలోచించకుండా, పరిష్కారమైన శక్తిచుట్టూ మనసును కేంద్రీకరిస్తే వ్యక్తి శకిమంతుడవుతాడు. మానవుడు మహనీయుడవుతాడు. ఆనంద స్వరూపుడూ అవుతాడు.


-  సాగి కమలాకరశర్మ