e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home చింతన అహింసా పరమో ధర్మః

అహింసా పరమో ధర్మః

అహింసా పరమో ధర్మః

‘సత్యం, శాంతి, అహింస’ అనేవి సాధారణంగా కలిపి వాడే పదాలు. వాటి లక్ష్య, లక్షణాల సంబంధం అలాంటిది. ఉన్నది ఉన్నట్టుగా చూడటమూ, చెప్పడమూ, దాని ఆధారంగా నడచుకోవడం సత్యం. ఆర్ష దర్శనం, ధర్మం పరమాశయమే సత్యపాలన. ఈ సత్య చిన్మయానంద విభూతియే భగవంతుడు. సత్యపాలనయే మౌలికమైన భగవదారాధన. సత్యానికి వ్యతిరేకం కపటం, మోసం, మాట నిలబెట్టుకోకపోవడం. ‘సత్యం’ అంటే విశ్వసనీయత, సంశయ రాహిత్యం, భద్రత. దీని ఆధారంగా ఏర్పరచుకున్న జీవన వ్యవస్థయే ధర్మం. ఈ ధర్మ బలాలూ, ఫలాలే శాంతి-అహింసలు.

అహింస సమగ్రార్థం చాలా విస్తారమైంది. వ్యక్తి, సంఘం, ప్రకృతుల సంక్షేమానికి తూట్లు పొడిచే ప్రతిచర్యా, పరిణామమూ సుదూర దృష్టిలో హింసయే. ‘హింస’ అంటే కేవలం ఒక జీవిని బాధించడం, వధించడం మాత్రమే కాదు. ఒకరి మనసును గాయపరచడమే కాదు. సమస్తమైన ఉనికికి, ఆరోగ్యానికి, నియమవర్తనకు, ఫలానికి, తృప్తికి, సంపదకు, ప్రగతికి, సంక్షేమానికీ హాని కలిగించే ప్రతి పనీ హింసయే. అబద్ధాలాడటం, మోసం చేయడం, బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడమూ హింసే. దొంగతనం, లంచాలు తీసుకోవడం, తన వైఫల్యాలకు ఇతరులను నిందించడమూ హింసే. అహంకరించడం, తాను పొంది మురిసే ప్రేరణను ఇతరులకు అందివ్వకపోవడం, ఇతరుల గొప్పతనాన్ని చూడలేక దూషించడమూ హింసే. తన పరిధిలో జరిగే అన్యాయాలు, అధర్మాలను నిరోధించకపోవడమూ, సొంత లబ్ధికై వాటిని ప్రేరేపించడం కూడా హింసే.

ఒక్కొక్కసారి ఉద్దేశ్యం సరైందే అయినా వివేకహీనతతో హానికర చర్యలు చేపట్టడమూ హింసే అవుతుంది. నిస్వార్థంతో సకలజన సంక్షేమానికై అధర్మాన్ని అంతం చేయడానికి చేసే హింస అహింసే. భవిష్యత్తులో జరిగే మేలుకోసం కలుగచేసే తాత్కాలిక కష్టం, తత్సంబంధ పనులూ అహింసే. గురువు విధించే దండన, శస్త్రచికిత్స కోసం చేసే గాయం, నిజమైన శాంతి స్థాపనకై తీసుకొనే పోలీసు చర్యలు, దేశ సరిహద్దులను కాపాడుకోవడానికై చేసే యుద్ధమూ అహింసలే. సుఖశాంతులకూ, ప్రగతి నియతికీ ఆధారమైన అహింసా ప్రవృత్తిని సమాజంలో పెంపొందింపజేయడం తమ ప్రవర్తనాపరంగా, శాసనపరంగా అధికారుల బాధ్యత. అలాగే, సమాజంలో తామే ఒక ఉదాహరణగా నిలుస్తూ, సత్సంప్రదాయ సంపదను కాపాడుతూ బోధ చేయడం గురుతుల్యులైన మేధావుల బాధ్యత కూడా. వీటికి తోడుగా ప్రబలంగా విస్తరిస్తున్న ఇంద్రియ సుఖాధిక్యతనే ప్రగతిగా ప్రస్తుతించే వ్యాపార సంస్కృతిని కట్టడి చేయడం ప్రధానంగా చాలా అవసరం. దీంతోపాటు అంతర్జాలంలో విశ్వరూపాన్ని ప్రవర్ధమానంగా ప్రదర్శిస్తున్న సామాజిక మాధ్యమాల అల్పగుణ వికృతిని నియంత్రించడమూ బాధ్యతగానే గుర్తించాలి. అన్నిటినీ మించి విద్యావ్యవస్థలో అహింసను అన్ని స్థాయిల్లో ప్రముఖ పాఠ్యాంశంగా, ప్రవర్తనాంశంగా చేర్చడం అతిప్రధానం. ఫలవంతంగా ఇటువంటి చర్యలు విస్తృత స్థాయిలో తీసుకోబడకుంటే హింస ముఖ్యంగా మతాహంకారంగా, ధనాకాంక్షగా అసంఖ్యాక రూపాలలో పెరిగి, భూగోళాన్నే కబళిస్తుంది. వ్యక్తిగత జీవితాలను అస్తవ్యస్థం చేసి, సమాజాలనే అతలాకుతలం చేసి, ప్రకృతిని భయంకరంగా కలుషితం చేసి, భవిష్యత్తును వినాశనం వైపు తీసుకెళ్తుంది. సత్వర సంబంధాలతో, దూరాలు చెరిగిపోవడంతో భూగోళమే వ్యవహారంలో చిన్నది కావడం వల్ల ఈ చర్యలన్నీ ప్రపంచస్థాయిలో తీసుకోవలసిన పరిస్థితి ఉంది.

అహింసే ఇటు ఐహిక ప్రగతికీ, అటు ఆధ్యాత్మిక ఉన్నతికీ కీలకం. అందుకే, ఆర్షధర్మం ఎలుగెత్తి చాటింది, అహింసా పరమో ధర్మః. ధర్మ హింసా తథైవచ అని అంటూనే అహింసా పరమో ధర్మః, అహింసా పరమం తపః, దయా సమం నాస్తి పుణ్యం, పాపం హింసా సమం నహి అని కూడా అన్నారు. కనుకే, అందరమూ అహింస ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొని అనుష్ఠిద్దాం, ధర్మమార్గాన్ని అవలంబిద్దాం, ఆనందంతో జీవిద్దాం.

అహింసా పరమో ధర్మః

యముగంటి ప్రభాకర్‌
94401 52258

Advertisement
అహింసా పరమో ధర్మః

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement