e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home చింతన నేడే చుక్క‌ల అమావాస్య‌.. సంతానం లేని వారు ఇవాళ ఈ వ్ర‌తం చేస్తే మంచిది

నేడే చుక్క‌ల అమావాస్య‌.. సంతానం లేని వారు ఇవాళ ఈ వ్ర‌తం చేస్తే మంచిది

ఆషాఢ అమావాస్యను ‘చుక్కల అమావాస్య’ అంటారు. ఆనాటి నోమును ‘దీపస్తంభ వ్రతం’ అనీ పిలుస్తారు. శ్రావణమాస ప్రారంభానికి వచ్చే అమావాస్య కనుక, ఆనాడు అధికసంఖ్యలో దీపాలు పెట్టి లక్ష్మీదేవిని పూజించడం అత్యంత మంగళప్రదమని శాస్ర్తాలు చెబుతున్నాయి.

ముత్తయిదువలు సంతానాన్ని, సౌభాగ్యాన్ని కోరుతూ ‘చుక్కల అమావాస్య’ నోము నోచుకొంటారు. ఈ వ్రతకథలో ‘దేవశర్మ అనే బ్రాహ్మణునికి సౌందర్యవతి, గుణవతి అయిన భార్య ఉన్నా, వారు సంతానానికి నోచుకోరు. వారు పరమేశ్వరుని ప్రార్థించగా, ‘బుద్ధిహీనుడైన దీర్ఘాయుష్యుడా, బుద్ధిమంతుడైన అల్పాయుష్యుడా ఎవరు కావాలి?’ అని అడుగుతాడు. వారు బుద్ధిమంతుడినే కోరుకొంటారు. అలా వరప్రసాదంగా జన్మించిన ఆ బాలుడు పెద్దయ్యాక, అల్పాయుష్యుడవడంతో ఎవ్వరూ తమ కూతురును ఇవ్వడానికి ముందుకు రారు. చివరకు ఒక పేదింటి పిల్లతో వివాహమవుతుంది. భర్త జన్మరహస్యం తెలిసిన ఆ అమ్మాయి ప్రతి దినం భక్తితో గౌరీపూజ చేస్తూ ఉంటుంది. విధి నిర్ణయం ప్రకారం కొన్నాళ్లకు చనిపోయిన తన భర్తను పార్వతీదేవి అనుగ్రహంతో ఆమె తిరిగి బతికించుకోవడం విశేషం. గత జన్మలో తాను దీపస్తంభ వ్రతమాచరించి ఉద్యాపన చేయనందున ఇలా వైధవ్యం ప్రాప్తించిందని తెలుసుకొంటుంది. ‘ఏ వ్రతం చేసినా ఆసాంతం నిష్ఠగా చేయాలని’ అమ్మవారిద్వారా గ్రహించి, ఆమె దానిని తిరిగి నిర్వర్తించడం ద్వారా స్త్రీలందరకు ఆదర్శంగా నిలుస్తుంది.

- Advertisement -

పూజా విధానం: ఇలా ప్రసిద్ధమైన ‘చుక్కల అమావాస్య’ రోజు సువాసినులు నిష్ఠగా గౌరీపూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. అమ్మవారి ముందు వంద సున్నపు చుక్కలు పెట్టి, వాటిమీద అదే సంఖ్యలో దారపు పోగులు పెడతారు. ఆ పసుపు దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాడు ధరిస్తారు. స్థోమత ఉన్నవారు బంగారు లేక వెండి చుక్కలను దానం చేస్తారు. ఈ సంఖ్య ఏడాదికి 100 చొప్పున పెరుగుతూ, 5వ సంవత్సరం నాటికి 500కు చేరుతుంది. ఈ సందర్భంగా కొన్నిచోట్ల కొందరు దీపపూజ కూడా చేస్తారు.

‘దీపాల పూజ’ ఎందుకంటే?:

ఆషాఢమాసంలో సూర్యుడు దక్షిణాయనంలో వున్నందున రాత్రివేళ చలి పెరుగుతుంది. చీకటి బద్ధకానికి, అనారోగ్యానికి, అజ్ఞానానికి చిహ్నం. కనుక, వాటిని పోగొట్టి వేడిని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ‘దీపాల పూజ’ను నిర్వహిస్తారు. పేడతో అలికిన స్థలంలో దీపాలు పెట్టి విధి విధానంతో పూజలు జరుపుతారు. ఇదే ‘దీపస్తంభ’ వ్రతం. పెండ్లికాని ఆడపిల్లలు గౌరీపూజ చేస్తారు. పసుపుముద్దను గౌరమ్మగా పూజించి ఆ తల్లి రక్షను ధరిస్తారు. ఫలితంగా మంచి వరుడితో పెండ్లి నిశ్చయమవుతుందన్న విశ్వాసం ప్రజలలో ఉంది. కొత్త కోడళ్ళుకూడా సత్సంతాన సౌభాగ్యాలకోసం ఈ వ్రతం ఆచరిస్తారు. ఆకాశంలోని చుక్కలను సూచిస్తూ నోచుకొనే నోముగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది.

పితృదేవతల ఆరాధన!

‘అమ’ అనే అవ్యయానికి ‘కలిసి (కూడి) ఉండటం’ అని అర్థం. అదే అమావాస్య. ‘ఎవరి కలయిక’ అంటే సూర్యుడు- చంద్రుడు ఎదురెదురుగా కాసేపు రావడం. దక్షణాయణంలోని ఈ ‘తొలి అమావాస్య’ వారికి ఆహ్వానం పలుకుతుంది. ఆరోజు వారికి తర్పణాలు సమర్పిస్తారు. ఇది మొదలు వారికి చేసే జపతపాలకు, పూజలకు విశేష ఫలితాలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. కొందరు ‘అమావాస్య’ అంటేనే ఏదో అపవిత్రమని భయపడిపోతారు. కానీ, ఇది అత్యంత శక్తివంతమైన తిథి. ముఖ్యంగా చుక్కల అమావాస్య రోజు దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతల ఆత్మలు శాంతించి, అనుగ్రహిస్తారన్న నమ్మకం బలంగా ఉంది.

వేముగంటి శుక్తిమతి
99081 10937

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana