e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home చింతన నిర్వాణ సోపానం

నిర్వాణ సోపానం

నిర్వాణ సోపానం

శ్రీకపిల ఉవాచ- అమ్మా! మోక్షమందు కూడా అపేక్ష లేక నా ఆత్యంతిక భక్తియందు మాత్రమే దీక్షబూనిన నా అంతరంగ ఏకాంత భక్తులు అణిమ, మహిమ మొదలైన అష్టసిద్ధుల చేత సేవింపబడేది, అవ్యయమైన ఆనందాన్ని అనుభవింపజేసేది, మహనీయము, మహోన్నతము, సంపూర్ణ వైభవ విరాజితము, సమస్త సల్లక్షణ సముల్లసితము అయిన వైకుంఠధామాన్ని అధిరోహిస్తారు. అట్టివారు అవక్రమైన నా కాలచక్రానికి కూడా కొఱుకుడు పడనివారై, అజరామరులై, అనుపమ సౌఖ్యాలతో అలరారుతూ ఉంటారు. అమ్మా! అదెలాగంటావేమో వినవమ్మా-
‘సర్వుల యందు సముడనైన నేను స్నేహాతిశయంచే సుతుని వలెను, విశుద్ధమైన విశ్వాసంచే సఖుని వలెను, ప్రత్యుపకారం కోరని మహోపకారం సమకూర్చడం చేత సుహృత్‌తమునిగాను, సన్మంత్రోపదేశం వలన సద్గురూత్తముని వలెను (కృష్ణం వందే జగద్గురుమ్‌) వ్యవహరిస్తూ వారికి వరిష్ఠమైన ఇష్టదైవాన్నై సంపూర్ణ పుష్టి కలిగిస్తూ దుష్టమైన కాల చక్ర భయం వారి దరికి చేరకుండా వారిస్తూ ఉంటాను.’
అంటూ ప్రథమస్కంధం చివరలో మన పోతన మహాకవి, కృష్ణ వియోగ వ్యథతో గాఢంగా విలపిస్తూన్న గాండీవి (అర్జునుని)చే అన్నగారైన ధర్మరాజుకి చెప్పించిన ఈ పలుకులు ఈ సందర్భంలో స్మరణీయాలు.

అమ్మా! యథార్థానికి నా యందు భక్తి లేనిచో తీవ్రమైన మృత్యుభయం తొలగదు. ఎందుకంటావేమో- ఈ సృష్టి అంతా నిత్య భయగ్రస్తం! ‘లోకం శోక హతం చ సమస్తం’- లోకమంతా అస్తోకమైన- అంతులేని, శోకంచే హతాహతమై ఉంది. జ్ఞాన వైరాగ్యంతో కూడిన భక్తి యోగమే సకల శుభాలు వర్షించే మచ్చరణారవింద ప్రాప్తికి అమోఘ సాధనం. జననీ! ప్రధాన మనగా మూలప్రకృతి లేక మాయ. పురుషుడనగా జీవుడు. ఈ ఇద్దరికీ అధిపతిని నేనే. నేనే భగవంతుడను. జనార్దనుడను. జగదంతర్యామిని. ప్రత్యగాత్మ స్వరూపుడను. అట్టి నన్ను కాదని, త్రోసిరాజని ఇతర చిల్లరదేవుళ్లను ఎన్నుకొను వారు మిన్ను మన్నుల (దివికి భువికి) నడుమ కన్ను కానక ఎన్నో మారులు పుడుతూ గిడుతూ తిరుగుతూనే ఉంటారు.

మనుపుత్రీ! కంటికి వెనుక కూర్చుని కంటిద్వారా కాంచునదే- చూచేదే ‘ప్రత్యగాత్మ’. ‘ప్రతీపం అంచతి ఇతి ప్రత్యక్‌’- అనగా, శబ్దాది విషయాలు గోచరించే దిక్కుకు వ్యతిరేకం. ఇంద్రియాలకు వెనుక ఉంటూ ఇంద్రియాలనే గవాక్షాల-కిటికీల గుండా శబ్ద, స్పర్శాది విషయాలను గమనించేది. మనస్సుకు వెనుక ఉంటూ మనస్సుద్వారా సర్వం దర్శించేది. అవిద్యకు వెనుక ఉంటూ అవిద్యను అవగతం చేసుకొనేది- తెల్సుకొనేది. దేనికీ ముందుండక అన్నిటికీ వెనుక వర్తించేది. అమ్మా! అట్టి సర్వాంతర్యామిని, సర్వసాక్షిని, అత్యంత సూక్ష్మరూపుని, స్వయంజ్యోతి స్వరూపుడనైన ‘ప్రత్యగాత్మ’ను- అంతరాత్మని సాధకుడు జ్ఞాన వైరాగ్యంతో కూడిన భక్తిద్వారా తన దేహంలోనే దర్శించగలడు.

దేవహూతి- భగవాన్‌! నా వంటి ‘అబల’ కూడా ‘సబల’ అయి ‘నిర్వాణ’ పదవిని పొందగలిగే ప్రబలమైన మీ భక్తి స్వరూపాన్ని సముచితంగా, సముజ్జలంగా సాక్షాత్కరింప చెయ్యండి. ప్రభో! నిర్వాణ స్వరూపా! లక్ష్యాన్ని ఛేదించే బాణం వలె భగవత్ప్రాప్తిని ప్రసాదించే తత్తజ్ఞానాన్ని మందమతి అయిన దేవహూతికి కూడా తెలిసే విధంగా తేట పరచండి.

‘నిర్వాణ’ శబ్దానికి పరమ నివృత్తి, పరమ గతి అని అర్థం. గీతాశాస్త్రం ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం చివరలో భగవానుడు ‘బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి’- అని బ్రాహ్మీస్థితిని- బ్రహ్మగా ఉండుటను, ‘బ్రహ్మ నిర్వాణ’మని నిర్దేశించాడు. ఏమిటీ బ్రహ్మ నిర్వాణ మంటే? అఖండానంద స్వామి అత్యద్భుతంగా అభివర్ణించారు. మనిషి జీవితంలో మరణ పర్యంతం భీకరంగా తగులుతూ బాధించే బాణాలు మూడు- ఒకటి: దుఃఖ బాణం, రెండు: అజ్ఞాన బాణం, మూడు: మృత్యు బాణం. ఈ మూడు సాయకాలు- బాణాలు, సచ్చిదానంద పరబ్రహ్మ యొక్క స్వరూప భూతాలైన సత్‌, చిత్‌, ఆనంద లక్షణాలకి సాక్షాత్‌ విరోధులు. ఆనంద విరుద్ధం దుఃఖ బాణం. చిత్‌-జ్ఞాన విరుద్ధం అజ్ఞాన బాణం. సత్‌- సత్తా అనగా శాశ్వత ఉనికికి, సత్యానికి విరుద్ధం మృత్యు బాణం. ఈ మూడు బాణాలు ఏ బ్రాహ్మీస్థితిలో- జీవన్ముక్తిలో సంపూర్ణంగా ‘బాణేభ్యః నిష్క్రాస్తం’- నివృత్తమై అనగా తొలగిపోతాయో అదే నిర్వాణం లేక నిర్బాణం (వ్యాకరణ రీత్యా వ-బ లకు అభేదం). యోగం ద్వారా నిర్వాణ పదప్రాప్తి. యోగం సాక్షాత్తు- నేరుగా భగవంతుని విషయీకరించేదిగా, అనన్యంగా ఉండాలి. యోగం బాణమైతే యోగేశ్వరేశ్వరుడు నిర్బాణం- నిర్వాణం!

‘ప్రణవో ధనుః శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే, అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్‌’ అని ముండక ఉపనిషత్‌ మంత్రం. ‘ప్రణవం- ఓం కారం, ధనుస్సు. జీవుడు బాణం. బ్రహ్మము లక్ష్యమని చెప్పబడుతోంది. సాధక ధానుష్కుడు-విలుకాడు, అప్రమత్తుడై ఏకాగ్ర చిత్తంతో లక్ష్యాన్ని సాధించు- సాక్షాత్కరించుకోవాలి. అట్టితరి జీవుడు బ్రహ్మమే అగును’ అని మంత్రార్థం. జీవాత్మ, పరమాత్మల సంయోగమే యోగం! జగత్తులో ఏది సత్యం? ఏది అసత్యం?-దీన్ని చక్కగా గ్రహించడమే- అనగా నిత్య- అనిత్య వివేకమే జ్ఞానం. అంతఃకరణంలో ప్రియతముని అనగా ఆత్మకంటే ఇతరమైన అనాత్మ సంబంధ వాసనలు ఉండరాదు. ఇదే వైరాగ్యం!

తన దైవానికి ప్రియమైనది- ఆయన ప్రసన్నతకు కారణమైన దానిని చెయ్యడమే భక్తి! తనకు ప్రియునికి (పరమాత్మకు) మధ్య అవరోధంగా- అడ్డంగా ఏదున్నా సరే దానిని వదిలించుకోగలగడమే త్యాగం! అసత్‌- లేనిదిగా గ్రహించిన వస్తువు లేక విషయం నుంచి చిత్తాన్ని సర్వధా తొలగించడమే వైరాగ్యం! ఇక శేషించిన- మిగిలిన ఏకైక సత్‌- సత్య వస్తువును పొందే నిత్య నిరంతర ప్రేమ పూర్వక ప్రయత్నమే భక్తి!
(సశేషం)

మ.‘సమతన్‌ స్నేహము చే సుతత్వమును, విశ్వాసంబు చేతన్‌ సఖి త్వము, జాలన్‌ హితవృత్తి చేతను సుహృత్తంబున్‌, సుమంత్రోపదే శము చేతన్‌ నిజదేశికుండనగ నిచ్చల్‌ పూజ్యుడౌ నిష్ట దై వమునై వారికి గాల చక్ర భయముల్‌ వారింపుదుం గావునన్‌.’
క.‘మన సారథి మన సచివుడు మన వియ్యము మన సఖుండు మన బాంధవుడున్‌ మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియె మనుజాధీశా’.

సరైన జీవనం లేకపోతే సరైన ఆలోచనలు రావు. ఎవరైతే తమ కర్మఫలాల కోసం ఆరాట పడకుండా, వాటినన్నిటినీ దైవకార్యాలుగానే భావిస్తారో.. వారికి ఒక ఆదేశానుసారంగానే ‘సరైన జీవన విధానం’ అలవడుతుంది. ఇదే నిజమైన సదాచారం. కర్మయోగ పరమార్థమూ ఇదే.
గురు రాఘవేంద్రస్వామి
(శ్రీరాఘవేంద్ర తీర్థ)
జీవితకాలం: క్రీ.శ. 1595-1671

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
నిర్వాణ సోపానం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement