e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home చింతన సతి ఆత్మాహుతి

సతి ఆత్మాహుతి

విదుర మైత్రేయ వార్తాలాపంలో ‘దక్ష చరిత్ర’ మృదుమధురంగా సాగుతోంది. ‘ఆత్మా త్వం గిరిజా మతిః’- సర్వజీవులకు శివుడు ఆత్మ, శక్తి స్వరూపిణి అయిన సతీదేవి మతి అనగా బుద్ధి. ఆత్మను తిరస్కరించిన మతి గతి తప్పినట్లే. మతి ఆత్మకు సుముఖమైతే అదే సుగతి, సమాధి! విముఖమైతే అదే దుర్గతి, వ్యాధి! విరుద్ధంగా ఉండటమే వ్యాధి- ఉండవలసిన చోట లేకపోవడం. ఇదే అస్వస్థత, అపదేశం! దీనికి వ్యతిరేకం సమాధి. ఉండవలసిన చోట ఉండటం- స్వస్థత, ఉపదేశం! ‘అపదేశ ముడిగితే అదే ఉపదేశం’ అని వేదాంత భేరి! స్వస్థానంలో ఉండుటే ఉపదేశం, పరస్థానంలో చేరుటే అపదేశం. తనకు ఆత్మయే స్వస్థలం, అనాత్మయే పరస్థలం. ఇది సనాతన ధర్మ రహస్యం.

సతి ఆత్మాహుతి

సతీదేవి చరిత్రలో పితృ స్నేహానికి, పతినిష్ఠకు మధ్య సంఘర్షణ తలెత్తుతుంది. సదాశివుని స్వభావ ప్రభావాలు సర్వమంగళ (సతి)కి తెలియనివి కావు. స్వభావం కారుణ్యం! మూర్తీభవించిన కరుణ- కరుణావతారం! మరి ప్రభావం? అది అనితరం, అనిర్వాచ్యం. కపాలి కామాంతకుడు- కాముని కంటితో కాల్చివేసినవాడు, కాలాంతకుడు- కాలుని (యముని) కాలితో కూల్చివేసినవాడు! అయినా అట్టి పెనిమిటి- భర్తను కాదని పుట్టింటికి పయనం! దానికి పరిణామం? పెనుముప్పు. మహామాయా స్వరూపిణికి కూడా మమతా మోహమా? ఆహా! ఆహా! మోహ మహిమ ఊహాతీతం కదా! ఇదే లోకాతీత అయిన లలితామాత (బాలా లీలా వినోదినీ) ఆడే లీలా వినోదం! భారతీయ వనితామణులకు- గృహిణులకు ప్రమోదంతో కూడిన ప్రబోధం! ఇది పరమార్థం. ఇక కథారసాన్ని ఆస్వాదిద్దాం-

- Advertisement -

పితృ గృహానికి వెళ్లి అయిన వాళ్లందరితో కూడి ఆనందించాలన్న అభిలాషకు సదాశివుడు సానుకూలంగా స్పందించలేదని సతీదేవి స్వాంతం-మనసులో పరితాపం పొంగి పొరలింది. కోరిక తీరక కలిగిన కోపావేశంలో ఆమె వివేకం కోల్పోయింది. అవ్యాజమైన అనురాగంతో తనకు ఆనందంగా అర్ధ దేహాన్ని సమర్పించి అలరించిన అసమానుడైన- తనతో సమానుడు లేని, తన స్వామిని త్యజించి తండ్రిని చూడాలన్న తపన తీవ్రం కాగా, తుంటరితనంతో త్వరితగతిని ఒంటరిగానే పుట్టింటికి పయనమైంది.

తండ్రిగాని, తల్లిగాని, తోబుట్టువులు గాని, చివరకు తనయులు కూడా తనకు ఏదైనా మితంగా ఇచ్చేవారే. కాని, మితమనేది లేకుండా హితకరమైనవన్నీ అపరిమితంగా ఇచ్చే పతిదేవుని మెచ్చక మతిమాలిన సతి మూర్ఖంగా శివుని వదలి మఖా (యజ్ఞా)నికి బయల్దేరింది. శివుని విడిచిన శక్తికి అమంగళం కాక మంగళం ఎలా సిద్ధిస్తుంది?

మూలంలోని ‘అప్రతి పూరుషం’ అనే విశ్వేశ్వరుని విశేషణాన్ని పోతన అమాత్యుడు కూడా వ్యాఖ్యాత శ్రీధర స్వామిని అనుసరిస్తూ ‘స్వసమాన రహితుడు’ అనే అనువదించాడు. కుసుమ శర (మన్మథ) వైరి- శివుని ఈ స్వసమాన రాహిత్యాన్ని(సాటి, పోటీ లేని మేటితనాన్ని) శివ భక్త యోగి భర్తృహరి ఎంతో భవ్యంగా ఇలా సంభావించాడు- ‘క్షణ మాత్రం కూడా కాంతను ఎడబాసి ఉండలేక తన మేను (దేహం)లోనే ఆమెను ‘అరపాలు’గా అర్ధాంగిగా అమర్చుకొన్న అభవుని- శివుని మించిన ఆసక్తుడు- కాముకుడు, రాగి లోకంలో మరొకడు లేడు. మన్మథుని తన మూడవ కంటిమంటలో ఆహుతి చేసి కామినీ సంగరహితుడై అలరారిన ఆశుతోషుని- ఉబ్బులింగని, మించిన అనాసక్తుడు- నిష్కాముడు, విరాగి కూడా మరెవ్వడున్నాడు? పూర్ణ అనురక్తుడు, పరిపూర్ణ విరక్తుడు కూడా విరూపాక్షుడే! శివునికి కల అనురాగాతిశయం కాని, విరాగాతిశయం కాని లేని కారణాన అతని వలె భోగించడానికికాని, త్యజించడానికికాని చేతకాని అన్యులందరూ లోకంలో కష్టజీవనులే అవుతున్నారట!’

కినుకతో వృషభ వాహనం మీద అతివేగంగా వెళుతున్న సతీదేవి వెనుక భద్రత కోసం వేలకొలది రుద్రానుచరులు, యక్షులు- నందీశ్వరుడు ముందు నడవగా బాజా భజంత్రీలతో బయల్దేరారు. హరిద్వారం, గంగాతీరంలోని ‘కనఖల’ క్షేత్రంలో యజ్ఞశాలను వీక్షించారు. వీనుల విందుగా వేదధ్వనులు వినిపిస్తున్నాయి. యాగశాలలో ప్రవేశించిన సతీదేవిని చూడగానే తల్లి, తోబుట్టువులు, పినతల్లులు అనురాగంతో ఆదరించి, అక్కున చేర్చుకొని యోగక్షేమాలు అడిగారు. పరాశక్తి జగదంబ పితృపాదులకు ప్రణామం చేసింది. కాని, తండ్రి తనవైపు తలెత్తి కూడ చూడనందుకు మానవతి అయిన సతి మనస్సు చివుక్కుమంది. ఆయన చేస్తున్న యజ్ఞంలో రుద్రునికి భాగం లేదని చటుక్కున గ్రహించింది.

‘యక్ష స్వరూపాయ జటాధరాయ’- యక్షరూపంగా అవతరించిన శివునికి భాగం లేని యజ్ఞానికి ‘యజ్ఞో వై విష్ణుః’- యజ్ఞ స్వరూపుడైన విష్ణువు కూడా రాడు, రాలేదు. బ్రహ్మ, దధీచి మొదలైన కొందరు మహర్షులు కూడా పాల్గొనలేదు. దాక్షాయణికి కోపాగ్ని జ్వాలల్లో లోకాలన్నీ దహించాలన్నంత ఉద్రేకం కలిగింది. దురహంకారంతో రుద్రహీనంగా యజ్ఞం చేస్తున్న క్షుద్రుడైన దక్షుని వధిస్తామని ముందుకు దూకుతున్న ప్రమథ గణాలను సతి కనుసన్నలతో వారించింది. పెచ్చరిల్లిన రోషావేశంతో ఉచ్చస్వరంతో తండ్రిని ఇలా హెచ్చరించింది-

‘పితాశ్రీ! పరమేశ్వరుడు ప్రాణులందరికీ ప్రియమైన ఆత్మ స్వరూపుడు. ఆయన దృష్టిలో అందరూ శిష్టులే, ఆయనకు ఇష్టులే. దుష్టులు, అయిష్టులూ ఎవ్వరూ లేరు. సృష్టిలో శర్వుడు- శివుడు, సర్వులలో శ్రేష్ఠుడు. ఎవ్వని యందు ద్వేషభావన లేని పావన స్వభావుడు, నిర్దోషి, మహాదేవుడు అయిన సదాశివుని ద్వేషించేవాడు నీవు తప్ప లోకంలో ఎవడున్నాడు? ‘శివ’ అనే రెండక్షరాల పవిత్రనామాన్ని ఒక్కమారు ప్రాసంగికంగా నోటితో పలికినా, మనఃపూర్వకంగా భావంలో నిలిపినా ప్రాణుల సర్వపాపాలు భస్మమైపోతాయి. అట్టి పరమ మంగళ స్వరూపుడు, మహాదేవుని నీవు ద్వేషించుట నాకెంతో వింతగా ఉంది. నీవే అత్యంత అమంగళ స్వరూపుడవు. పరమ శివుని పాదార విందాలలోని బ్రహ్మానందమనే మకరందాన్ని తమ మనస్సులనే మధుకరా (తుమ్మెద)లద్వారా భక్తితో త్రాగి మైమరచు వారు మహాజ్ఞానులు. కాలకాలుని చరణకమల ద్వయం కొలిచేవారికి కొంగు బంగారం. విరించి- బ్రహ్మ, మొదలగు విబుధ వరేణ్యులు (దేవతాశ్రేష్ఠులు), కపాలి (శివుడు) నర్తించేటప్పుడు ఆయన అరికాలి నుండి రాలిపడే పవిత్ర ధూళిని నిర్మాల్యంగా పరమానందంతో శిరస్సున ధరిస్తారు.’

దేహ త్యాగానికి నిశ్చయించుకొన్న దాక్షాయణి ధర్మం యొక్క యథార్థ తత్తాన్ని ఇలా వ్యాఖ్యానించింది- జనకా! ధర్మపాలన దీక్షాపరుడైన హరుని నిందించే పాపాత్ముని నాలుకను పరపర కోసి వెయ్యాలి. అలా చేత కాకపోతే నిందను సహించిన తానే తనను బొంద పెట్టుకోవాలి. ఈ రెంటికీ సమర్థత లేకపోతే రెండు చెవులూ మూసుకొని ‘శివ-శివా’ అంటూ అక్కడి నుంచి తప్పుకోవాలి. ఇదే విశిష్టమైన ధర్మం. తండ్రీ! విశ్వపాలన కోసం విషపానం చేసిన నీలకంఠుని మీద నిందలు మోపావు. ఇక ‘దాక్షాయణీ’ (దక్ష పుత్రిక) అన్న పిలుపు నాకు దుర్భరం, దుస్సహం, ప్రాణాంతకం. నా ప్రాణేశ్వరుడు నన్ను ప్రేమతో గానీ, పరిహాసంగా గానీ ‘దాక్షాయణీ’ అని పిలిస్తే నేను పూర్వం మాదిరి చిరునవ్వులు చిందిస్తూ పరవశించి పోలేను. దుఃఖంతో కుమిలిపోతాను.

తండ్రీ! మా ఐశ్వర్యం, మా సిద్ధులు, మా భోగభాగ్యాలు అవ్యక్తాలు- మా సంకల్ప మాత్రంతో అవి వ్యక్తమవుతాయి. అవి బ్రహ్మవేత్తలకు, అవధూతలకే భోజ్యాలు- అనుభవైక వేద్యాలు. నీవు తలక్రిందుగా తపస్సు చేసినా అట్టి మహాసిద్ధులను పొందలేవు. కాన, నేను సంపన్నుడను, ఈ రుద్రుడు దరిద్రుడు అని అహంకరించమాక.-క్షుద్రుడా! సకల భువన శుభంకరుడు, భక్త జనాభయంకరుడు, భవనాశంకరుడైన శంకరునికి క్షమింపరాని అపరాధం చేసిన నీకు నేను దుహిత- కుమార్తెను కావడం నా దౌర్భాగ్యం. ‘అలమలం’- చాలు! చాలు! మరి మాటలెందుకు? నీ కూతురునని చెప్పుకోవడానికి నేను సిగ్గుతో కుచించుకు పోతున్నా. కటకటా! కుటిలాత్మా! ఈ మహి (భూమి)లో మాన్యులైన మహాత్ములకు హాని తలపెట్టేవారి పుట్టుకలు- జన్మలు, జనకా! పాతి పెట్టనా? పాడె గట్టనా?’

ఈ విధంగా ‘విజ్ఞాత్రి’ (సర్వం తెలుసుకొనే తెలివే స్వరూపంగా కల సాక్షిరూపిణి) అయిన సతీదేవి యజ్ఞశాల మధ్యంలో నిలబడి అజ్ఞుడు, అదక్షుడు అయిన ప్రతిపక్షి దక్షుని వీక్షించి వక్కాణించింది. ప్రాణపతి పశుపతి పాదపద్మాలలో సతి తన మతిని నిలిపి, ఆ పినాకి (శివుడు) తన ప్రేమాంకంలో పెట్టుకొని పరవశింపజేసిన తన పవ్రిత దేహాన్ని దక్షుని ద్రోహానికి ప్రతీకారంగాను, తాను తన పతికి చేసిన క్షమార్హం కాని ద్రోహానికి ప్రాయశ్చిత్తంగాను, పరిత్యజించాలని సన్నద్ధమై తనలో యోగాగ్నిని రగుల్కొల్పింది. గత కల్మష (పాపరహిత)మైన సతీదేవి విశుద్ధ దేహం ఆ విశిష్ట వహ్ని జ్వాలలలో దగ్ధమై పోయింది.(సశేషం)

ఉ.‘నీల గళాపరాధి యగు నీకు దనూ భవ నౌట చాలదా?చాలు గుమర్త్య! నీదు తనుజాత ననన్‌ మది సిగ్గు వుట్టెడిన్‌ న్నేల ధరన్‌ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్‌ గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడగన్‌.’

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సతి ఆత్మాహుతి
సతి ఆత్మాహుతి
సతి ఆత్మాహుతి

ట్రెండింగ్‌

Advertisement