బుధవారం 30 సెప్టెంబర్ 2020
Devotional - Sep 15, 2020 , 11:31:53

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఏడాది కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఏడాదికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజా సామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు. కాగా, ఆలయంలో ఉదయం 6గంటల నుంచి 9 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. 


బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమజనంలో ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అధికమాసం సందర్భంగా అక్టోబర్‌ 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం.. టీటీడీ ధర్మకర్తల మండలి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. ఇందు కోసం జీయర్‌ స్వాములు, ఆగమ సలహదారులు, ప్రధాన అర్చకులతో చర్చించి సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లపై చైర్మన్ సుబ్బారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిత్యం దాదాపు 12వేల మంది  భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఏకాంతంగా జరిగే వాహన సేవలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని చెప్పారు. బ్రహ్మో్త్సవాల సందర్భంగా 23న గరుడసేవ రోజున ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ పట్టవస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఎస్వీబీసీ సీఈవో సురేష్ పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.