శనివారం 30 మే 2020
Devotional - Mar 24, 2020 , 16:58:30

ఇతిహాసాల్లో ఉగాది ప్రాశ్య‌స్తం !

ఇతిహాసాల్లో ఉగాది ప్రాశ్య‌స్తం !

 ఇతిహాసాల్లో ఉగాది గురించి ప‌లు చోట్ల ప్ర‌స్తావ‌న ఉంది. ఆ విశేషాల‌ను తెలుసుకుందాం... మనం నిత్యం చెప్పుకునే రుతువుల‌లో మొద‌టిది వ‌సంతం. ఈ వ‌సంతం చైత్ర‌మాసంతో ప్రారంభ‌మ‌వుతుంది. చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినాధిప‌తిగా ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రసజగత్తును సృష్టించాడ‌ని చెప్తారు. ఇక  ఉగాది.. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు కాబట్టి ఉగాదిగా మారింది. యుగం అంటే రెండు లేక జత అని కూడా అర్థం. గ‌ణితంలో కూడా యుగ్మం, యుగ్మాలు అనే ప‌దాల‌ను వాడుతుంటారు.

ఉత్తరాయణ, దక్షిణాయనాలకు ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాబట్టి ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. ఇక ఇతిహాసాల‌లో ఉగాది గురించిన ప్ర‌స్తావ‌న ప‌రిశీలిస్తే..ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. 

త్రేతాయుగంలో ఉగాది రోజే  శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. విక్రమార్కుడు, శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించారు. వికారినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీశార్వారి నామ తెలుగు సంవత్సరాది ఉగాదిని జరుపుకునే సమయం, ముహూర్తం వివ‌రాలు ప‌రిశీలిస్తే.. ఉగాది పర్వదినం మార్చి 25 బుధవారం. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఛైత్ర శుద్ధ పాడ్యమి మొదలైనా పండగ మాత్రం బుధవారం జరుపుకోవాలి. ఎందుకంటే శాస్త్రోక్తంగా సూర్యోదయం సమయంలో తిథి ప్రకారం పండుగ చేసుకోవాల‌ని శాస్త్ర‌వ‌చ‌నం.  


logo