గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jun 26, 2020 , 23:45:59

సూర్యుని అనంత పయనం!

సూర్యుని అనంత పయనం!

సూర్యుడు అదితి కుమారుడు కనుక ఆదిత్యుడు. దేవతలందరూ అదితి పుత్రులే. తొల్చూరు కొడుకైనందున ఆదిత్యనామం సూర్యునిపట్ల నిత్యమైంది. పరమేశ్వరుడాయనను లోకాలకు వెలుగునిచ్చే పనికి నియోగించాడు. ఒకచోట నిలబడి వుంటే, లోకాలన్నింటికీ వెలుగును ప్రసరింపజాలడు. కాబట్టి, నిర్విరామంగా తిరగాలి. తిరిగే ఉద్యోగం కనుక, ఆయనకు రథం లభించింది. ఆ రథానికి ఏడు గుర్రాలు పూన్చి వున్నాయి. సంతోషించాడు సూర్యుడు.

అనూరుడనే వాడు వచ్చి ‘అన్నా.. నేను మీ చిన్నమ్మ వినత కొడుకును. నీ రథాన్ని నడిపి పెడతాను’ అన్నాడు. కశ్యప ప్రజాపతికి అదితితోసహా అనేకమంది భార్యలున్నారు. వారిలో వినత, కద్రువలు కూడా ఉన్నారు. వీరు ధరణీదక్షుల కుమార్తెలు. స్వంత అక్కాచెల్లెళ్లు. సవతులుగా మారిన కారణంగా వారు చిన్ననాటి దెబ్బలాటలను మరచిపోలేక వాటిని ఈర్ష్యాసూయలుగా మలచుకొన్నారు. వీరు ఏకకాలంలో గర్భవతులైనారు. కద్రువ వేయిమంది పుత్రులను సంతానంగా కోరుకొన్నది. సర్పాలు ఆమె సంతానం. సర్వే సర్వత్రా పూజింపబడే బలవంతులైన ఇద్దరు కొడుకులు కావాలని కోరుకొన్నది వినత. కద్రువ, వినత ఏకకాలంలోనే గుడ్లను పెట్టినా కద్రువ పెట్టిన గుడ్లు పగిలి పిల్లలు పుట్టుకొచ్చారు. వినత పెట్టిన గుడ్లట్లే వున్నాయి. కద్రువ తనవద్ద కనబరిచే మాతృత్వపు ఆధిపత్యాన్ని వినత తట్టుకోలేక పోయింది. ఒక గుడ్డును చిదిమింది. అంతే! దానిలోంచి అమిత తేజశ్శాలి అయిన పిల్లవాడు, మిక్కిలి బాధతో బయటకు వచ్చాడు. అప్పటికతని శరీరంలో పైభాగమే ఏర్పడింది. ఊరువులు, జానువులు, పాదాలు ఏర్పడలేదు. ఊరువులు లేని కారణంగా అతడిని ‘అనూరుడు’ అన్నారు. ‘ఎంత లేదన్నా తమ్ముడు, వచ్చి అడిగాడు’ కాదనలేక సారథిగా పెట్టుకొన్నాడు సూర్యుడు. 

‘భ’ చక్రాన్ని నిర్దేశిత మార్గంలో చుట్టి రావడమే సూర్యుని పని. ఏడాదికోసారి ఆవృతిని పూర్తి చేయాలి. భూమిపై నుండి మనకు కనిపించే 27 నక్షత్ర మండలాలతోకూడిన 12 రాశుల వలయాన్ని ‘భ’ చక్రమంటారు. రథానికి రెండు చక్రాలుండాలి. ఇతడికిచ్చిన రథానికి ఒకటే చక్రం ఉంది. ఏడు గుర్రాలు వున్నాయి. గుర్రాలను అదుపు చేసేందుకు కళ్లాలను, పగ్గాలను ఇచ్చారు. కానీ, అవి తాళ్లతో చేసిన పగ్గాలు కావు, బతికి వున్న పాములు. చేతిలో నిలవవు, జారిపోతుంటాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకు పోతుంటాయి. సారథి ‘వున్నాడా’ అంటే వున్నాడు, లేడంటే లేడు. అతడు అనూరుడు. రథమెక్కి గుర్రాలకు వీపును పెట్టి సూర్యుడికి అభిముఖంగా కూర్చున్నాడు. తమ్ముడిమీద ప్రేమ కారణంగా ఏమీ అనలేకపోతున్నాడు సూర్యుడు.

ఇక, పయనం సంగతి. రథానికి కింద ఆధారమంటూ లేదు. నేలంటూ వుంటే కదా ఆధారముండటానికి. ‘దారిని గుర్తుపెట్టుకుందామా’ అంటే, అంతా ఆకాశమే, ఖాళీయే. వెళ్లవలసిన దూరమూ అనంతం. ఇన్ని అసౌకర్యాల మధ్య అలవికాని కష్టాలను అనుభవిస్తూ కూడా అనితర సాధ్యమైన పనిని నిరంతరాయంగా చేస్తున్నాడు సూర్యభగవానుడు. ‘తన పనిని పూర్తి చేసికొనగలిగిన సత్తా వున్న వారికి ఉపకరణాల సామర్థ్యంతో పనిలేదు’ అని దీని భావం. ఉపకరణ సామర్థ్యంతో పని లేని మన సూర్యభగవానునికి మనసారా నమస్కరిద్దాం.

వరిగొండ కాంతారావు 94418 86824


logo