e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home చింతన ధ్రువ చరిత్ర

ధ్రువ చరిత్ర

ధ్రువ చరిత్ర

నేను రాణిని. నా కడుపున పుట్టినవాడే తండ్రి తొడ ఎక్కటానికి అర్హుడు. నా సవతి కొడుకువైన నీకు ఆ అదృష్టం లేదు. కనుక, ఓ పట్టీ (పుత్రకా)! నీవు పద్మనాభుని (విష్ణుని) పాదపద్మాలను విడువక గట్టిగా పట్టుకో. ఆయన అనుగ్రహంతో నా కడుపున పుట్టు. ఆ పట్టున నీ కోరిక తీరుతుంది’ అని ధ్రువుణ్ణి నిష్ఠూరంగా హెచ్చరించింది.

శ్లో. ‘అధ్రువాయ కృతో యత్నః ధ్రువాయ పరికల్పితః
ధ్రువస్య యత్ప్రసాదేన వాసుదేవం నతో‚ స్మ్యహమ్‌.’

- Advertisement -

‘ఏ పరమాత్మ అనుగ్రహంతో, అశాశ్వతమైన తన తండ్రి అంకమును (ఒడిని)అధిరోహించుటకై అర్భకుడైన ధ్రువుడు చేసిన ప్రయత్నం అతనికి సర్వోన్నత శాశ్వతమైన ‘ధ్రువ’ స్థానాన్ని అందించి అలంకరింప చేసిందో, ఆ వాసుదేవునికి నమోవాకాలు’- అని మంగళా చరణం చేస్తూ భాగవత వ్యాఖ్యాత శ్రీధరస్వామి బాలభక్త ధ్రువుని ఉపాఖ్యానానికి వ్యాఖ్యానం ఆరంభిస్తాడు. సహజ పాండిత్యుడు పోతన అమాత్యుని సంస్కృత భాగవత అనువాదం అప్రతిహతంగా, అనితర సాధ్యంగా, సర్వజనామోదకరంగా, సర్వాంగ సుందరంగా సాగిపోతోంది. ధ్రువ చరిత్ర స్వాయంభువ- అనగా ప్రథమ మన్వంతరం లోనిది. చతుర్థ స్కంధంలోని ‘అర్ధ’ పురుషార్థాన్ని అన్వర్థంగా నిరూపించే ఈ ఘట్టం కూడా విదుర- మైత్రేయ సంవాద అంతర్గతమే.

స్వయంభువు అంటే బ్రహ్మదేవుడు. ఆయన కుడి-ఎడమ శరీర భాగాలనుంచి ఉద్భవించిన స్వాయంభువ మనువు- శతరూపలు మానవజాతికి మూల దంపతులు. వారికి ఇద్దరు పుత్రులు- ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వేదాంతపరంగా ఉత్తానపాదుడు జీవుని పంచకోశాలలో విజ్ఞానమయ కోశానికి ప్రతీకం-సంకేతం. జీవుల భేద (ప్రాపంచిక), అభేద (పారమార్థిక) అనుభవాలకి ఈ కోశమే ఆశ్రయం- స్థానం. దీనికి అనుగుణంగానే ఉత్తానపాద మహారాజుకి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. ‘నమో‚స్తు తే వ్యాస విశాల బుద్ధే’- భాగవత పురాణంలో విశాలబుద్ధిగల వేదవ్యాసుడు ప్రయోగించింది ‘సమాధి భాష’ అని గతంలో వివరించుకొన్నాం. ఆఖ్యాయికలు- కథలు ముందుకు సాగుతూ పోతుంటే వాటి అంతరార్థం అణకువతో వాటిని అనుసరిస్తూ వస్తూ ఉంటుంది. కథా కథన వైభవం కేవలం వాచారంభణం- వాగ్విలాసం మాత్రమే. కథలన్నింటికి భక్తి, జ్ఞాన, వైరాగ్య మూలకమైన ‘మోక్ష’ పురుషార్థమే పరమార్థమని శ్రీశుక దేవుడు ప్రవచించిన ‘ముక్తాయింపు’- ముగింపు మాట ముక్తి కాములకు కనువిప్పు. ఉర్వి (భూమి)మీద ఉన్న ప్రతి మానవ జీవుడూ ఉత్తానపాదుడే!

శ్లో. ‘నిష్క్రామన్‌ భృశ దుఃఖార్తో రుదన్ను చ్చైరథో ముఖః
యంత్రాదివ వినిర్ముక్తః పతత్యుత్తాన శాయ్యథః’.

అని వ్యాస వచనం. ‘ఉత్‌ తాన పాదః’- తలక్రిందికి, కాళ్లు పైకి పెట్టుకొని ఏడుస్తూ పుట్టేది ఒక్క మానవప్రాణి మాత్రమే. రెండు కాళ్లు సమంగా చాపుకొని కూర్చున్నవాడని కూడా విశేషమైన అర్థం వక్కాణించారు వ్యాఖ్యాతలు. ‘అవ్వా కావాలి బువ్వా కావాలి’- యోగమూ కావాలి భోగమూ కావాలి అనే ద్వంద్వ బుద్ధికల జీవుడే ఉత్తానపాదుడు. జోడు గుర్రాల స్వారి. అందుకే, ఇద్దరు భార్యలు- సునీతి, సురుచి. ‘సునీతి’ అభేదరూప అద్వైత బుద్ధి- చక్కని నీతి, నియమపాలన, సంయమనం, సదాచారం. తద్వారా అమృతతుల్యమైన యోగసిద్ధి! ‘సురుచి’ భేదరూప ద్వైత బుద్ధి- శుచి శుభ్రత లేని ‘రుచి’యందే అపరిమితమైన అభిరుచి. దుర్నీతి, దురాచారం, విషయ వ్యామోహం, విశృంఖలత్వం- విచ్చలవిడితనం. ఫలితంగా విషతుల్యమైన భోగసిద్ధి. పరిణామం ఘోరపతనం.

కఠోపనిషత్తు ప్రవచించిన శ్రేయస్సు (నివృత్తి), ప్రేయస్సు (ప్రవృత్తి) అనే సాధనా మార్గాలే సునీతి సురుచులు. శ్రేయస్సంటే నిత్య, నిర్విషయ, నిరామయ సుఖం. ప్రేయస్సనగా అనిత్యమైన విషయ సుఖం. సునీతి కుమారుడు ధ్రువుడు ఐదేళ్లవాడు, పెద్దవాడు. సురుచి పుత్రుడు ఉత్తముడు ధ్రువునికంటే చిన్నవాడు. ఉత్తానపాద మహారాజుకి పెద్ద భార్య, పట్టమహిషి అయిన సునీతి అంటే అరుచి, అయిష్టత, ఉపేక్ష, ఉదాసీనత. సురుచి అంటే అతి ఆసక్తి, అపేక్ష, భయం కూడా. భూమికి భర్త (మహారాజు) అయినా భార్యకు- సురుచికి భృత్యుడు.

ఒకనాడు ఉత్తానపాదుడు ఉత్తముని తన ఊరువు (తొడ)పై కూర్చోపెట్టుకొని ఉల్లాసంగా ముద్దాడుతున్నాడు. అదే సమయంలో చేరువలోనే వున్న ధ్రువుడుకూడా వడి-వడిగా వచ్చి తండ్రి ఒడిలో కూర్చొని సందడి చెయ్యాలని ఉబలాట పడ్డాడు. కాని, దగ్గరే ఉన్న సురుచికి దడిసి రాజు ధ్రువుని దగ్గరకు తీసి ఆదరింపలేదు. మహారాజు తన అందచందాలకు మురిసి తనను వలచినాడని, వలలో పడ్డాడని తలచి సౌందర్య గర్విత అయిన సురుచి విర్రవీగుతోంది. పెద్ద కొడుకైన ధ్రువుడు ఉండగా తన తనయునికి రాజ్యాధికారం దక్కదని ఆమె భయం. రాజు ప్రవర్తనకు గర్వించి సురుచి-
‘ఓరీ! నేను రాణిని. నా కడుపున పుట్టినవాడే తండ్రి తొడ ఎక్కటానికి అర్హుడు. నా సవతి కొడుకువైన నీకు ఆ అదృష్టం లేదు. కనుక, ఓ పట్టీ (పుత్రకా)! నీవు పద్మనాభుని (విష్ణుని) పాదపద్మాలను విడువక గట్టిగా పట్టుకో. ఆయన అనుగ్రహంతో నా కడుపున పుట్టు. ఆ పట్టున నీ కోరిక తీరుతుంది’ అని ధ్రువుణ్ణి నిష్ఠూరంగా హెచ్చరించింది.
(సశేషం)

క.‘అదిగాన నీ వధోక్షజు
పద పద్మము లాశ్రయింపు పాయక హరి నా
యుదరమున బుట్ట జేయును
వదలక యట్లయిన ముదము వడసెద వన ఘా!’-

ధ్రువ చరిత్రతంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధ్రువ చరిత్ర
ధ్రువ చరిత్ర
ధ్రువ చరిత్ర

ట్రెండింగ్‌

Advertisement