e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ఆరోగ్యమే మహాభాగ్యం!

ఆరోగ్యమే మహాభాగ్యం!

ఆరోగ్యమే మహాభాగ్యం!

శరీర మాద్యమ్‌ ఖలు ధర్మ సాధనమ్‌
దేహే సరోగేతు నచార్థ సిద్ధిః॥
అరుగ్ణతాం దార్ఢ్య మపీహ లబ్ధుం
సదౌషధమ్‌ కాయ పటుత్వ సాధకమ్‌ (ఆర్యోక్తి)

విద్యుక్త ధర్మాలనూ, రోజువారీ విధులనూ నిర్వర్తించడానికి మనకు కావలసింది ఆరోగ్యవంతమైన శరీరం. దేహం రోగాల కుప్పగా మారితే మనం ఏ పనీ చేయలేం, మరేదీ సాధించలేం. ‘శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి అనుభవజ్ఞులైన వైద్యులు రూపొందించిన బలాన్నిచ్చే మంచి ఔషధాలను సేవిస్తుండాలి. ఆరోగ్య సూత్రాలను పాటిస్తుండాలి’ అని భారతీయ సనాతన ధర్మం మనకు ప్రబోధిస్తున్నది.
జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైందీ, మన ప్రాణాలను నిలబెట్టడానికి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదింపజేసేదీ ‘జిహ్వ’ (నాలుక). దీని కోరికలకు లొంగిపోయే మనసును బుద్ధితో నియంత్రిస్తుండాలి. రాత్రిపూట మీగడ పెరుగుతో భోజనం చేసినా, సత్తుపిండి తిన్నా ఆరోగ్యానికి ఒకింత నష్టమే. ఉప్పును చేతితో తీసికొని నమలడం, రాతిపై ఉన్న ఉప్పును తినడం మంచిది కాదు. పళ్లు తోముకునే వేళ మాట్లాడకూడదు. కాళ్లు కడుక్కున్న తర్వాతే తూర్పుదిక్కు ముఖం చేసి భోజనం చేయాలి. భోజన వేళ పరధ్యానం పనికిరాదు. భోజనాన్ని, మూత్ర విసర్జనలనూ నిలబడి చేయరాదు. సంధ్యావేళలలో నిద్ర, చిరిగిన పాన్పులపై పడుకోవడం మంచిది కాదు (మహాభారతం, అనుశాసనిక పర్వం: 4-105).
చదువుకునేటప్పుడు తలను చేతులతో తాకడం, అపరిశుభ్రంగా నిద్రించడం, తలంటుకొనే నూనెను శరీరానికి పూసుకోవడం మంచివి కావు. స్నానానికి ముందు అలంకరించుకోవడం, స్నానం చేశాక తడిసిన వస్ర్తాన్ని విసురుగా విడిచి వదిలేయడం, వేరేవాళ్లు విడిచిన వస్ర్తాలను మళ్లీ కట్టుకోవడం, మాసిన వస్ర్తాలను మడతలు మార్చి, తిరిగి కట్టుకోవడం వంటి అలవాట్ల వల్ల కూడా కీడు జరుగుతుందని నాటి శాస్ర్తాలు చెప్పాయి. మద్యపానం ఎప్పుడూ హానినే కలిగిస్తుంది. గత జన్మలలో ఎంతో పుణ్యం చేసి కష్టపడి సంపాదించుకున్న విజ్ఞానసంపద అంతా కూడా మద్యాన్ని సేవించిన మరుక్షణంలోనే నశించి పోతుందట. దీనికి అనుబంధంగా ఉండే జూదం కూడా ఎంతటివాళ్లకైనా సరే అంతిమంగా దుఃఖాన్నే తెచ్చిపెడుతుందని పెద్దలు చెప్తారు.
తను నమలిన వాని నమలు
నని మాంసము తెఱఁగు సెప్పు నాగమములు గా
వునఁ దద్భక్షణ ముడిగిన
ననఘ! తపంబునకుఁ జాలు నది యొక్కండున్‌ తిక్కనామాత్యుడు (మహాభారతం, అనుశాసనిక పర్వం: 4-293)

మద్యపానానికి తోడయ్యేది మాంసాహారం. దీన్ని విసర్జించడమే ఆరోగ్యప్రదం. ఎవరైతే మాంసం తింటారో వాళ్లను ఆ మాంసమే నమలి తిని వేస్తుందనేదిపై ఆర్యోక్తి. మాంసాన్ని వదిలివేసిన మాంసాహారులు వందేండ్లు కఠినమైన తపస్సు చేసినంతటి గొప్ప ఫలితాన్ని కూడా అదనంగా పొందుతారట. బయటి మాంసం సహాయంతో శరీరంలోని మాంసాన్ని పెంచుకోవడమనేది అనర్థాలకు హేతువవుతుంది. ఆరోగ్యంగా ఉండాలనుకునేవాళ్లు దాన్ని నివారించడమే మంచిదని శాస్ర్తాలు చెప్పాయి. ఆషాఢమాసం మొదలు ఆశ్వీయుజ మాసం వరకు ఉండే చాతుర్మాస్యాలలో అయితే ఈ మాంసం తినకుండా ఉంటే ఆయుష్ష్యూ, ఆరోగ్యమూ, బలమూ, కీర్తి కలుగుతాయి.
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛే ద్ధనమిచ్ఛేద్ధుతాశనాత్‌
జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్‌ మోక్షమిచ్ఛేజ్జనార్దనాత్‌ (ఆర్యోక్తి)

‘సూర్యున్ని ఉపాసించడం వల్ల ఆరోగ్యమూ, అగ్నిని ఉపాసిస్తే సంపదలూ సమకూరుతాయి. ఈశ్వరుని అనుగ్రహంతో జ్ఞానం సిద్ధిస్తుంది. జనార్దనుడు (విష్ణువు) దయ తలిస్తే మోక్షం అబ్బుతుందనేది’ ఆర్యోక్తి. వీటన్నిటిలోనూ ప్రధానమైంది ఆరోగ్యమే. మానవాళి వివేకంతో కలుషితమైన పదార్థాలను తినకుండా, వాతావరణ కాలుష్యాన్ని పెంచకుండా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే సమాజం సుభిక్షమవుతుంది.

ఆరోగ్యమే మహాభాగ్యం!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆరోగ్యమే మహాభాగ్యం!

ట్రెండింగ్‌

Advertisement