గురువారం 29 అక్టోబర్ 2020
Devotional - Sep 23, 2020 , 17:47:57

రేపటి నుంచి తెరుచుకోనున్న గౌహతి కామాఖ్యా ఆలయం

రేపటి నుంచి తెరుచుకోనున్న గౌహతి కామాఖ్యా ఆలయం

గౌహతి : పలు నిబంధనల మధ్య అసోంలోని గౌహతి కామాఖ్యా ఆలయం  తలుపులు రేపటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఆలయాన్ని మార్చి 17 నుంచి మూసివేశారు. అన్‌లాక్‌-4 నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

అసోంలోని మహా శక్తిపీఠ్ కామాఖ్యా ఆలయ తలుపులు రేపటి నుంచి భక్తుల కోసం తెరుస్తున్నారు. దీనికి ఆలయ ట్రస్ట్ సన్నాహాలు ప్రారంభించింది. ఆలయ దర్శనం కోసం చాలా కఠినమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేశారు. గౌహతిలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో ఉండటంతొ.. ఆలయాన్ని తెరిచేందుకు ట్రస్ట్‌ వెనుకంజ వేసింది. అయితే ఆలయాన్ని తెరవాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతుండటంతో చివరకు కేంద్రం మార్గదర్శకాల మేరకు భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నారు. ప్రదక్షిణ కోసమే భక్తులు ఆలయంలోకి రావాలని ట్రస్ట్ ముందుగా ప్రతిపాదించింది. రేపటి నుంచి రోజుకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ప్రతి భక్తుడు 15 నిమిషాల కన్నా ఎక్కువ ఆలయంలో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం భక్తులకు ప్రవేశం కల్పించేందుకు ఆలయ ట్రస్ట్ పూర్తి సన్నాహాలు చేసింది.

లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 1500 నుంచి 2000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. పండుగ సీజన్‌లో 20 నుంచి 25 లక్షల మంది కూడా వస్తారు. ముఖ్యంగా జూన్ నెలలో జరిగే అంబువాచి పండుగ సమయంలో ఆలయంలో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

మార్గదర్శకాలు : ఆలయ వెబ్‌సైట్‌కు కనీసం ఒక రోజు ముందు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాలి. ఒకేసారి వంద మందికి పైగా ఆలయం లోపల ప్రవేశం ఉండదు. కరోనా నెగెటివ్‌ ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తారు. ఏ భక్తుడైనా 15 నిమిషాల పాటు ఆలయంలో ఉండొచ్చు. బయటి వ్యక్తులను ప్రత్యేక ఆరాధన మొదలైన వాటిలో అనుమతించరు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆలయాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు కూడా యాంటిజెన్ పరీక్ష చేయించుకోవాలి. ఇందుకోసం ఆలయంలో వైద్య బృందాన్ని కేటాయించారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేయడంతో ట్రస్ట్ చాలా నష్టపోయింది. ఈ సమయంలో ఆలయానికి విరాళాల చాలా తక్కువగా అందాయి. దాంతో గత 6 నెలలుగా ఆలయ ఆర్థిక పరిస్థితి బాగా ప్రభావితమైంది. ప్రతి ఏటా జూన్‌లో జరిగే ప్రసిద్ధ అంబూవాచి పండుగను కూడా నిర్వహించలేదు. ఈ కారణంగా ఆలయానికి విరాళాలు దాదాపు సున్నాగా మారాయి. ఆలయంలో 250 మంది ఉద్యోగులు ఉండగా.. శానిటరీ కార్మికులకు పూర్తి జీతం ఇస్తున్నారు.


logo