e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడిట్‌ పేజీ ప్రాణశక్తి ప్రదాత హనుమ!

ప్రాణశక్తి ప్రదాత హనుమ!

ప్రాణశక్తి ప్రదాత హనుమ!

భక్త సామ్రాజ్యానికి అధిపతిగానే భారతీయ భక్తలోకం హనుమంతుని భావిస్తున్నది. హనుమంతుని ప్రతీ కథను మనస్తత్వానికి సంబంధించిన కథగా అధ్యయనం చేస్తే, అనువర్తింపజేసుకుంటే రామాయణంలోని హనుమంతుని గాథలు మనకు కొంగ్రొత్తగా కనిపిస్తాయి. ‘రాముని దూత’ అన్నప్పుడు కేవలం ‘రామునికి నమస్కరించేవాడు’ అనే అర్థంలో కాకుండా, ‘ఆత్మభావాన్ని అవగాహన పరచుకొని దాని ప్రకారమే తన జీవనాన్ని గడుపుతూ, దానితోనే నిరంతరం కలిసి ఉండేవాడు’గా భావించాలి. అందుకే, ఆ ‘రామదూతను శరణు వేడటం’ అంటే మన మనస్తత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే. ‘రామాయణం’లోని హనుమంతుని పాత్ర ఒక సంజీవని వంటిది. అన్నిటికీ ప్రాణం పోసేది హనుమనే. లంకలో సీతమ్మకు రాముని రాకను చెప్పి ప్రాణం నిలిపాడు. ప్రత్యక్షంగా యుద్ధరంగంలో సంజీవని పర్వతం తెచ్చి లక్ష్మణునికి ప్రాణం పోసినవాడు. రాముని రాకను ముందుగానే చెప్పి భరతునికి ప్రాణశక్తి నిచ్చాడు. తన శక్తి తనకు తెలియనివాడు. కనుకనే, మరొకరి ప్రేరణతో ఉత్తేజితుడై విశ్వరూపాన్ని ప్రకటించాడు. వంద యోజనాల సముద్రాన్ని అవలీలగా దాట గలిగాడు.
‘రామనామ’ స్మరణతో ఎదురైన అడ్డంకులను అధిగమించగలిగినవాడు ఆంజనేయుడు. కాలానుగుణంగా, ప్రదేశానుగుణంగా అవసరమైనవిధంగా మాట్లాడటం, ప్రవర్తించడం తెలిసినవాడు. అందుకే, భారతీయులందరికీ ప్రాణశక్తి సమానం. ‘హనుమ లేని ఊరు, ఆయన స్మరణ లేని నోరు ఉండవని’ లోకభావన. ఆయన మార్గంలో అందరం నడిస్తే ఈ లోకంలోని సమస్యలన్నింటినీ అధిగమించి, కర్మలన్నీ అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకొని ఆనంద మార్గంలోకి చేరుకుంటాం. ఈ భావనను మనకు ‘రామాయణం’లోని ప్రతి సంఘటన ద్వారా తెలియజేస్తున్నాడు. హనుమంతుని స్మరణ వల్ల మనకు లభించే అంశాలన్నీ మనోధైర్యానికి సంబంధించినవే. మనం ఈ స్వామిని ఉపాసిస్తే సద్బుద్ధి, మానసిక బలం, కీర్తిప్రతిష్ఠలు, ధైర్యం, భయరహిత స్థితి, మానసిక భౌతికరోగాలకు దూరం కావడం, జడత్వం లేకపోవడం, సమయానుకూలంగా, సరిగ్గా మాట్లాడగలిగే శక్తి వంటివన్నీ అలవడుతాయి. ఈ గుణాలన్నీ మనసు పొందదగినవే. మూలశక్తితో కలయిక వల్ల మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. అది హనుమ ఉపాసనతోనే లభిస్తుంది.
హనుమంతుడు నవ వ్యాకరణాదులను అధ్యయనం చేసింది సాక్షాత్తు సూర్యనారాయణుని వద్దనే! సూర్యుడు ఆత్మ చైతన్యానికి ప్రతీక. వెలుగును, జ్ఞానాన్ని, తేజస్సును నిరంతరం ఉపాసించేవారికి అన్నిరకాల విద్యలు ఆనందంగా వస్తాయనడానికి హనుమంతుడు ఒక ఉదాహరణ. వాయు కుమారుడైన హనుమంతుడు అగ్నితత్త్వానికీ ప్రతీక. ‘ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి’ అనేవి ఒకదాని తర్వాత ఒకటిగా ఉద్భవించిన ‘పంచభూతాలు’. కాబట్టే, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని ఉత్పన్నమవుతుంటాయి. కార్యసాధకుడు అగ్నితత్త్వంతో కూడుకొని ఉండాలి. వాయుతత్త్వంలో ధ్యానమగ్నత ఉంటుంది. అది అగ్నితత్త్వంతో కూడుకున్నప్పుడే సృష్టి సాధ్యమవుతుంది. శరీరంలోని పంచభూతాల్లో వాయువు, అగ్ని ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. శరీరం చల్లబడినా, శరీరంలోని వాయువులు వెళ్లిపోయినా ఆ దేహం ఉపయోగపడదు. అందుకే, మనశ్శక్తిలో వాయు, అగ్నిశక్తుల ప్రభావం అధికంగా ఉన్నవారు ఎలాంటి కార్యాన్నైనా సాధించగలరనడానికి ప్రతీక మారుతి. అక్షరాలలో ‘రం’ శబ్దం అగ్నిబీజం. నిరంతరం శ్రీరామనామాన్ని ఉచ్చరించడం వల్ల ఆ అగ్నితత్త్వం శరీరంలో బాగా పెరుగుతుంది. శరీరగత పాపాలు లేదా వేర్వేరు వ్యవస్థల్లో కర్మవశాత్తు చేరిన అడ్డంకులు తొలగిపోవాలంటే ‘రామనామ పారాయణం’ చేయాలి. దానివల్ల శరీరం శుద్ధమవుతుంది. శుద్ధమైన మనసు అత్యంత శక్తిని పొందుతుంది. ఆ శక్తితో ఈ లోకంలో సాధించలేనిదంటూ ఉండదు. అమృతమయత్వం దానివల్లే సిద్ధిస్తుంది.

ప్రాణశక్తి ప్రదాత హనుమ!సాగి కమలాకరశర్మ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రాణశక్తి ప్రదాత హనుమ!

ట్రెండింగ్‌

Advertisement