కోరిక బలంగా ఉన్నప్పుడే దానిని సాధించాలనే తపన పెరుగుతుంది. అందుకు తగిన మార్గాలూ కనిపిస్తాయి. ఏదైనా సాధించాలంటే కావాల్సింది సంకల్ప బలం. అదొక్కటే సరిపోతుందా అంటే.. నిర్విరామ కృషి అవసరం. దానికి దైవానుగ్రహం తోడవ్వాలి. మరి దైవానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? అందరికీ కలిగే సందేహం. దేవుడు కరుణించాలంటే దానధర్మాలు చేయాలనే భావన చాలామందిలో ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నవాడే ఇవన్నీ చేయగలడు. మరి నిరుపేదలను దేవుడు కరుణించకుండా ఉండడు. ఈశ్వరుడి ముందు అందరూ సమానులే. ఎవరూ ఎక్కువా కాదు. ఎవరూ తక్కువా కాదు. దైవానుగ్రహానికి కావాల్సింది విత్తం కాదు చిత్తం. మనం చేసే కర్మలు అంతఃకరణ శుద్ధితో చేయాలి. ఏ పని చేసినా ఆత్మసాక్షికి సమాధానం చెప్పగలగాలి. అంతరాత్మకు జవాబుదారిగా ఉండాలి. ఈ లక్షణాలున్న కార్యసాధకులకు దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది.