మంగళవారం 02 మార్చి 2021
Devotional - Jan 20, 2021 , 07:05:09

నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల

నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల

తిరుమల : ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ కోటాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. భక్తులు గమనించి ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని సూచించింది. కాగా, ఈ నెల 19న రథసప్తమి సందర్భంగా దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది.

రథసప్తమి రోజున మలయప్పస్వామి వారు ఏడు ప్రధాన వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై.. రాత్రి చంద్రప్రభ వాహనంతో సేవలు ముగుస్తాయని, చక్రస్నానం ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 5.30గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9-10 మధ్య చిన్నశేష వాహనం, 11-12 గంటల మధ్య గరుడ వాహనం, మధ్యాహ్నం 1-2గంటల మధ్య హనుమంత వాహనం, 2-3గంటల మధ్య చక్రస్నానం, సాయంత్రం 4-5 మధ్య కల్పవృక్ష వాహనం, 6-7 మధ్య సర్వభూపాల వాహనం, రాత్రి 8-9 మధ్య చంద్రప్రభ వాహనసేవ జరుగుతుందని టీటీడీ తెలిపింది.

VIDEOS

logo