e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home చింతన ధ్రువ-దేవర్షి సంవాదం

ధ్రువ-దేవర్షి సంవాదం

‘అయం జీవః మద్భక్తో భవతు’- ఈ జీవుడు నాకు భక్తుడు కావాలని ఆ దేవుడు నిరంతరం భావిస్తూ ఉంటాడట. పండిన పండువద్దకు చిలుక పిలువకనే వచ్చునట్లు పరిపక్వత పొందిన
శిష్యుని అనుగ్రహించడానికి స్వయంగా ఆచార్యుడే అన్వేషిస్తూ రావడం భాగవత పురాణ ప్రత్యేకత! ‘ఈశ్వరో గురు రూపేణ గూఢ శ్చరతి భూతలే’- గోవిందుడే గురు రూపంలో గూఢంగా సంచరిస్తూ ఉంటాడు. అధికారి- యోగ్యత కల శిష్యుడే అపురూపమని- అరుదని ఆర్యుల- అనుభవజ్ఞుల అభిమతం!

తపస్సుకు పయనమైన ధ్రువుడు పట్టణపు పొలిమేరలు దాటాడో లేదో పరమ భాగవత పథ ప్రదర్శకుడు, భక్తి యోగ భాస్కరుడు, నిరంతర నారాయణ నామ సంకీర్తనా నిరతుడు, నయ విశారదుడు నారదుడు ఎదురొచ్చాడు. ‘నారదాత్‌ దేవ దర్శనం’ అని భాగవత భేరీ నినాదం. దేవర్షి నారద దర్శనమైతే దాసునికి- భక్తునికి దేవదేవుని, దామోదరుని దర్శనమైనట్లే! ‘ఊరక రారు మహాత్ములు’- మహర్షి రాక ఊసు పోక కాదు. అది సంకర్షణ భగవానుని సంకల్పానికి సంకేతం. ధ్రువుని జన్మ-జన్మాంతరాల పుణ్యఫలం!- ‘అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిమ్‌’ అని కదా భగవద్వాక్యం.

- Advertisement -

దేవర్షి దివ్యదృష్టితో ధ్రువుని ఉల్లము (మనస్సు)ను ఊహించి ఎల్ల పాపాలను పారదోలే తన చల్లని చేతితో పిల్లవాని తలను మెల్లగా స్పృశించాడు- హస్త మస్తక సంయోగం! మాంస పిండం మంత్ర పిండమయింది. పసివాని పూనికను, పట్టుదలను పరీక్షిస్తూ వానిని- పుత్రకా! సకల సంపదలతో సమృద్ధమైన నీ సదనాన్ని- రాజ భవనాన్ని త్రోసిరాజని అనేక ఆపదలకు, అపాయాలకు ఆలవాలమైన అరణ్యాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? అయిన వారు చేసిన అవమానాల వలన అంతరంగంలో అలమటిస్తున్నట్లు అగుపడుతున్నావు’ అని అడిగాడు.

‘పుణ్య పురుషా! నా పినతల్లి ప్రయోగించిన పదునైన పలుకుటమ్ముల- వాగ్బాణాల వలన నా మనస్సులో పడిన పుండును ‘సంసార రోగహర మౌషధ మద్వితీయం’- పరమాత్ముని పదధ్యానమనే మందుతో మాపుకొంటా’ అని బదులిచ్చాడు బాల భక్తుడు. నారదుడన్నాడు- ‘నాయనా! తోటి పిల్లలతో ఆటపాటలలో పోటీ పడుతూ పరవశించే పసి వయసు నీది. పెద్దల మాటల మూలంగా కలిగిన మానావమానాల ఆటుపోట్లను మనసుకు పట్టించుకొని ప్రవర్తించే ప్రౌఢ- పెద్ద వయసు కాదు. అబ్బాయీ! మీ అమ్మ చెప్పిన అధోక్షజుని- అచ్యుతుని ఆరాధన అనుకున్నంత సులభం కాదు. అదీకాక, గత జన్మల పుణ్యపాప కర్మల ఫలాలైన సుఖ-దుఃఖాలు ప్రతివాడు అనుభవించక తప్పదు. ఈ రెంటినీ సమంగా స్వీకరించి స్వాంతం (మనసు)లో సంతోషపడువాడు ‘సుజ్ఞాని’ అని సంభావించబడతాడు.

ఎందుకనగా, సుఖానుభవం వల్ల పుణ్యము, దుఃఖానుభవం వల్ల పాపము, రెండూ క్షీణించగా మోక్షం పొందుతాడు కనుక. సుగుణమణీ! గుణవంతుని చూచి సంతోషించాలి. గుణహీనుని కని జాలి పడాలి. తనకు సమానుడైన వానితో సఖ్యత నెరపాలి. నరపాల నందనా! (రాజ కుమారా!) అట్టి పాపరహితుని జోలికి తాపత్రయాలు రాజాలవు. కనుక, క్షత్రియ సంతానమని పంతానికి పోక ఈ వ్యర్థ ప్రయత్నం విరమించుకో. మొండి పట్టుదల మానుకో. నా మాట విను. మోక్షం మీద మక్కువ ఉంటే ముసలితనంలో సాధించుకోవచ్చు’-

ధ్రువుడు- మహాత్మా! క్షాత్ర ధర్మాన్ని అవలంబించిన నాలో వినయానికి, విశ్రాంత స్వభావానికి అవకాశమే లేదు. మా పూర్వీకులచే కాని, ఇతరులచే కాని ఇంతవరకు పొందబడని, మూడు లోకాలలో మహోన్నతమైన, మహోత్కృష్టమైన సుస్థిర స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నాను. దానిని అందుకొనే ఉపాయాన్ని ఉపదేశించు’ అని అర్థించాడు.

మైత్రేయ మహర్షి ముచ్చటిస్తున్నాడు- మహానుభావా! విదురా! ధ్రువుని ధ్రువత్వాన్ని- దృఢ దీక్షను ఇలా ధ్రువీకరించుకొని దేవర్షి అతనితో- వత్సా! నిన్ను పరమ పురుషార్థ- మోక్ష ప్రాప్తికై ప్రేరేపించింది శ్రీవత్సాంకుడైన పురుషోత్తముడే, సందేహం లేదు. కాన, సమాహిత- ఏకాగ్ర చిత్తంతో శ్రీహరినే సేవించు-

‘ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను పొందాలని పరితపించే పురుష శ్రేష్ఠునికి పావనమైన శ్రీహరి పాదపద్మ సేవనం తప్ప అన్య సాధనం లేదు- ‘ఏకమేవ హరేస్తత్ర కారణం పాద సేవనమ్‌’. తండ్రీ! పవిత్రము, పుణ్యప్రదము అయిన యమునా తీరంలోని మధువనం- బృందావనం నందనందనునికి, హరికి నిత్య నివాసస్థానం. అనఘా! అచ్చటికి వెళ్లి స్థిరమైన మనస్సుతో ఉరమున- హృదయంలో, మురహరుని నిల్పి ఉపాసించు.’

‘బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్ఛతి’- అవిముక్తేశ్వరుడు ఉమా ధవుడు- శివుడు ఆనంద కాననమును (కాశీని) వదలి అన్యత్ర పోనట్లు మాధవుడుకూడా మధువనమును-బృందావనమును విడిచి కాలు బయట పెట్టడు. పై కందం మూల శ్లోకానికి విధేయంగా కడు హృద్యంగా సాగిన పోతన అనువాద పద్యం.
(సశేషం)

క.‘పురుషుడు దవిలి చతుర్విధ
పురుషార్థ శ్రేయ మాత్మ బొందెద ననినన్‌
ధర దత్ప్రాప్తికి హేతువు
హరిపద యుగళంబు దక్క నన్యము గలదే?’-

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana