e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home చింతన Shakthi | జననీ.. విజయ కారిణి

Shakthi | జననీ.. విజయ కారిణి

శివుడు ఆలోచన! శివాని, అంటే పార్వతి.. శక్తి రూపిణి. శక్తి ఒక్కటే! కానీ ఎన్నో రూపాలు. బ్రాహ్మి, ప్రణవ నాదానికి సంకేతం. అది సృష్టి మూలం. వైష్ణవి, సృష్టికి రూపకల్పన చేసిన ప్రజ్ఞా రూపిణి. మాహేశ్వరి, సృష్టి రూపానికి వ్యక్తిత్వాన్ని అనుగ్రహించే మరొక శక్తి కోణం. కౌమారి, నిత్య యౌవన రూపిణి. ఆమెది అనుభూతి కాంతి. వారాహి, అనుభవ శక్తి. దహన శక్తి. ఐంద్రీ, సృష్టి నియమాలను నియంత్రించి నిర్దేశించేశక్తి. అది సమస్త ప్రాణుల్లోనూ ఉండే ఎరుక, నిత్య స్పృహ. చాముండ, చిత్తవృత్తులను సంహరించి, యోగ స్థితులను అనుగ్రహించే జ్ఞాన వరదాయిని.

ఈ శాక్తేయ పార్శ్వానికి భిన్నంగా తంత్ర స్వరూపంగానూ భవాని బ్రహ్మవిద్యా రూపిణి. ఆమె అపరాజిత. అంటే పరాజయం ఎరుగనిది, జయకేతన ధారిణి. ఆమెను ఎవ్వరూ గెలువలేరు. కనుక విజయరూపిణి! మహితత్వానికి, జ్ఞానానికి ఆమె దివ్యశక్తి స్వరూపిణి.

- Advertisement -

మంత్ర, తంత్ర, యంత్రాత్మికమైన శక్తి, రజోగుణాన్ని ప్రకటిస్తూ దుర్గగా, సాత్విక గుణంతో శోభిల్లుతూ సరస్వతిగా మనకు అనుభవంలోకి వస్తుంది. ఎన్నెన్నో రూపాలు, ఎన్నెన్నో నామాలు, ఎన్నెన్నో భావాలు… అన్నీ కలిపి ఒకటే. అదే దైవీశక్తి. లలిత, అన్నపూర్ణ, అపరాజిత, చాముండ, గాయత్రి, సావిత్రి, జగద్ధాత్రి, రాజరాజేశ్వరి, భద్రకాళి, కాత్యాయని, మనోన్మని, కామేశ్వరి, శతాక్షి, ఉమ, వింధ్యవాసిని, రక్తదంత, శాకంబరి, భ్రమరాంబ… ఏ పేరుతో పిలిచినా, ఏ భావంతో తలచినా, ఏ రూపంతో కొలిచినా ఆమె శక్తే!

మనలోని ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల సమగ్ర స్వరూపమూ దేవే!
ఇక, శరన్నవరాత్రులలో మనం ఉపాసిస్తూ, పది రోజుల పూజలను ‘ద స ర’ అని క్లుప్త, సంక్షిప్త , సంకేత నామంతో వైభవోపేతంగా జరుపుకొంటాం. నిజానికి అవి మూడు సంకేత అక్షరాలు.
ద అంటే దుర్గాశక్తి.
స అంటే సరస్వతీశక్తి.
ర అంటే రమాశక్తి.
దుర్గాశక్తితో మరణ భయాన్ని, శారదాశక్తితో అజ్ఞానాన్ని, లక్ష్మీశక్తితో అభద్రతను జయించి, మనం అమృతత్వాన్ని సాధించుకోవాలి.

అంతేకాక దుర్గాశక్తితో మనం మనపై విజయం సాధించాలి. అహంకారం, దంభం, ప్రగల్భం, అతిశయం, ఆభిజాత్యం, తీవ్ర మమకారం, లాలస, భోగం, అసూయ, మదం, మాత్సర్యం, కామం, క్రోధం, మోహం వంటి వ్యతిరిక్త శక్తులను జయించినపుడే మనం విజేతలం అవుతాం.

సరస్వతీ శక్తితో సదాలోచన, సదాచారం, శుద్ధవాక్కు , వశ్యవాక్కు, సిద్ధవాక్కు, వాక్పటిమ సాధించుకుని మాటను మంత్రంగా మార్చుకోవాలి. ప్రతి పలుకును సర్వజన సమ్మతంగా, హితంగా, ఉద్వేగ రహితంగా, ఉల్లాస సహితంగా పలకాలి. మానవుణ్ని, మాధవుణ్ని నుతించగల స్థాయిలో మాటలు పవిత్రతతో కూడి ఉండాలి.

రమాశక్తితో ఇటు లౌకిక సంపదను సృష్టిస్తూనే, సంపదను దానం, యజ్ఞం, సాయం వంటి ధర్మ కార్యకలాపాల ద్వారా
జీవితాన్ని ఫలప్రదం చేసుకుంటూ అటు ఆధ్యాత్మిక సంపత్తిని సాధించాలి. సంపద పాపిష్ఠిది కాదు. కానీ, పాపిష్ఠి వాడి చేతిలో సంపద ఉండకూడదు. అది లోక కంటకం కాకుండా, కలిగిన ప్రతి వ్యక్తి నలిగిన వాడిని కాచుకోవాలి.
ఇంతటి శక్తి స్వరూపిణికి అచ్చ తెలుగు పేరు, అమ్మ!
అమ్మ గర్భాలయం పదార్థంగా బ్రహ్మాండం! కానీ యదార్థంగా అది హిరణ్య గర్భం!
కారణం లేని ప్రేమ, రాగం, అనురాగం, వాత్సల్యం, దయ, కరుణ, సేవ, త్యాగం, సహనం, సమర్థత, సమన్వయరీతి కలబోసుకుని, మన తనువుకు కారణమైన తల్లి సర్వధా దేవీ స్వరూపమే! కనుకనే, ‘మాతృదేవోభవ’!
తల్లికి ప్రథమ వందనం.
దేవీ స్వరూపానికి నిత్యప్రణుతి. ఈ రోజులన్నీ మనలోని భావమాలిన్యాలను పోద్రోలి, అజ్ఞాన అంధకారాన్ని పోకార్చి, ఆసురీభావాలను ఏమార్చి కేవలం మానవతను దివ్యస్థితిలో నిలుపుకొనే ఉపాసనా కాలం!
ఆ రీతి మన జీవితాన్ని తీర్చిదిద్దుకునే మహదవకాశం.

వి.యస్‌.ఆర్‌.మూర్తి
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త
9440603499

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement