e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home చింతన ధీరవ్రతుని దిగ్విజయం

ధీరవ్రతుని దిగ్విజయం

‘శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరీత్య వివినక్తి ధీరః, శ్రేయో హి ధీరో‚భి ప్రేయసో వృణీతే ప్రేయోమన్దో యోగక్షేమాద్వృణీతే’ (కఠోపనిషత్తు)యమధర్మరాజు నచికేతునితో ‘బాలకా! వివేకవంతులు శ్రేయస్సు (సునీతి), ప్రేయస్సు (సురుచి)లను చక్కగ పరీక్షించి వాటిని విభజిస్తారు. అందు ‘ధీరుడు’ శ్రేయస్సును మాత్రమే స్వీకరిస్తాడు. మందబుద్ధిగలవాడు తృష్ణారాగాలకు లోనై ప్రేయస్సునే కోరి బంధనంలో పడతాడు.’

పంచవర్షాల పసివాడు ధ్రువుడు పురుషోత్తముని అలా ప్రస్తుతించగా పరమాత్మ ఎలా ప్రభావితుడయ్యాడో పరిశీలిద్దాం. మైమరచి వింటున్న నీతివిశారదుడు విదురునికి మైత్రేయ మహర్షి ప్రీతి పూర్వకంగా వివరించిన విషయాన్ని వైయాసకి (వ్యాస పుత్రుడు శుకుడు) పరీక్షిత్తుకు ఇలా ప్రవచించాడు.. ‘రాజా! తనకు భృత్యులైన భక్తుల యెడల అపరిమిత అవ్యాజ అనురాగం కల అచ్యుత భగవానుడు అంతరంగంలో ఆనందించి ధ్రువునితో ఇలా అన్నాడు..
‘ఓ రాజకుమారా ! నీ వ్రత దీక్ష అచంచలం. నీ అంతరంగంలోని అభిమతం నాకు అవగతమే. అది అత్యంత దుర్లభం. అయినా నీ ఆకాంక్షను తప్పక తీరుస్తా. ఇంత వరకు ఎవరూ అందుకోలేనిదీ, పొందరానిదీ, ప్రళయంలో విశ్వమంతా వినష్టమైనా విలయమొందక (నశించక), విరాజిల్లునదీ; కట్టుకొయ్య చుట్టూ పశువులు తిరుగునట్లు గ్రహాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రము, నక్షత్ర స్వరూపులైన ధర్ముడు, అగ్ని, శుక్రాచార్యాదులు, సప్తర్షులు.. వీరంతా నిత్యం ప్రదక్షిణం చేసే ‘ధ్రువ క్షితి’ అనే సర్వోన్నత స్థానాన్ని నీవు సాధించుకొంటావు. కాని, అంత సత్వరంగా కాదు. ఇకపై ముప్పై ఆరు వేల వత్సరాల అనంతరం. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నీవు సర్వజనరంజకంగా, ధర్మబద్ధంగా పరిపాలిస్తావు. ఇంద్రియాలను జయిస్తావు. నీ తండ్రి ఉత్తానపాదుడు వానప్రస్థానానికి ఉపక్రమిస్తాడు. నీ తమ్ముడు ఉత్తముడు అఖేటాని (వేట)కై అరణ్యానికి వెళ్లి యక్షుని చేతిలో అక్కడే అంతమవుతాడు. అతనిని అన్వేషిస్తూ నీ సవతి తల్లి సురుచి కారడవిలోని కార్చిచ్చులో పడి కాలిపోతుంది. అనఘా! యజ్ఞ పురుషుడనైన నన్ను నీవు అనేక యజ్ఞాలతో ఆరాధిస్తావు. అనంత సౌఖ్యాలు అనుభవించి, అంత్యకాలంలో అంతరంగాన నన్నే స్మరిస్తూ నాలో వచ్చి చేరగలవు’ అని వివరించి విష్ణువు వైకుంఠానికి వేంచేశాడు.

- Advertisement -

ఈ ధ్రువోపాఖ్యానం కఠోపనిషత్తు అనే ధ్వనికి పురాణం చేసే ప్రతిధ్వని అని ప్రారంభంలోనే ప్రస్తావించాను. కఠోపనిషత్తులో పరేతరాట్టు యముడు నచికేతుని ఉద్దేశించి ‘ధీర’ పదాన్ని పదే పదే ప్రయోగిస్తాడు. మూలంలో ‘సువ్రత’ అన్న సంబోధన ఉండగా అమాత్యుడు పోతన్న వెన్నుని (విష్ణువు)చే ‘ధీరవ్రత’ అని విన్నవింపజేసి ధ్రువుని ధీరత్వాన్ని ధ్రువీకరించాడు. ‘ఆవృత్త చక్షురమృతత్వమిచ్ఛన్‌’ (కఠోపనిషత్‌)- ఆత్మను, అమృతత్వాన్ని అభిలషించి అంతర్ముఖుడు అగువాడే ధీరుడు!

మైత్రేయ ఉవాచ- విశిష్ట చరితా! విదురా! విష్ణు భక్తులు మాత్రమే అందిపుచ్చుకోగల వరిష్ఠస్థానాన్ని పొంది కూడా విమాత (సవతి) వదిలిన వాగ్బాణాలచే కుంగిన మనస్సు గల మాణవకుడు (బాలుడు) ధ్రువుడు మాటిమాటికీ ఆ మాటలనే మననం చెయ్యడం చేత ఆ వాసనా (సంస్కార) ప్రభావంతో పురుషోత్తముడు ప్రత్యక్షమైనా ముక్తిని కోరుకోలేకపోయాడు. అందుకే, ‘అయ్యో! ఆరు నెలల్లో అచ్యుతుని దర్శించి కూడా కల్పాంతంలో చ్యుతమై (నశించి)పోయే అల్పమైన స్థానాన్నే కోరుకున్నానే! ఎంత పొరబడ్డాను! అపవర్గాన్ని (మోక్షాన్ని) వరించనీయక మాయ నన్ను అవరించింది. ఏమిటా మాయ? భేదదృష్టి! నిద్రించేవాడు అభిన్నుడే (ఒక్కడే) అయినా, కలలో దైవమాయకు చిక్కి భిన్నదృష్టిచే తనకంటె వేరుగా తనలోనే పెక్కురను (అనేకులను) చూచినట్లు, నేను కూడా ద్వైత దోషంచే కలుషితమైన మనస్సుతో ఏకరూపుడైన భగవానుని మరచి సోదరునే (ఉత్తముని) శత్రువుగా తలచి తలచి కలత చెందాను. ఆయుస్సు తీరిన ఆమయ (రోగ)గ్రస్తునికి అగదా (ఔషధా)ల వలె కొరగాని కోర్కెలు కోరాను.

‘పేదవాడు పృథివీపతి (మహారాజు) ప్రాపును పొందికూడా ఊక (తవుడు)తో కూడిన నూకలను యాచించినట్లు, కైవల్యమిచ్చే కంసారి (కృష్ణుడు) కనువిందుగా కనిపించినా సంసారపు పొందునే కోరాను. నావంటి మందమతి ఈ వసుమతిలో వేరొకడుంటాడా’ అని ధ్రువుడు పరితపించాడు. ఏమిటి దీనికర్థం? ‘భగవద్భక్తి యుతమైన ముక్తి ధ్రువలోక ప్రాప్తి కంటే భద్రమైన పదవి’ అనేగదా పరమార్థం!

ధ్రువుడు తన పట్టణానికి పయనమయ్యాడు. విదురా! సమాగతుడైన ధ్రువునికి తండ్రి స్వాగతం పలికాడు. బ్రహ్మరథం పట్టాడు. ఆలింగనం చేసి ఆనందాశ్రుధారలతో శిరస్సును అభిషేకించి ఆశీర్వదించాడు. ధ్రువుడు ముందుగా తనకు హరిభక్తిని రుచి చూపించిన సురుచికి సాగిలపడ్డాడు. సవతి తనను విసిరివేసి కసరికొట్టినా కమలాక్షుని కృప కలగడానికి కారణభూతురాలు ఆమేగా! అనంతరం ఉల్లములో ఆనందం వెల్లివిరియగా తన తల్లిదండ్రులకు వందనమాచరించాడు. జగన్నాథుడు అనుకూలమైతే జగత్తంతా అనుకూలమే! సురుచి ధ్రువుణ్ని అక్కున చేర్చుకొని ఆనందంగా ‘చిరంజీవ’ అని ఆశీర్వదించింది. సుతుని కౌగిలించుకున్న సునీతికి పాలిండ్లు పొంగులెత్తాయి. ధ్రువునికి రాజ్యాభిషేకం చేసి ధరణీపతి ఉత్తానపాదుడు విరక్తుడై తపోవనానికి వెళ్లి సుగతిని పొందాడు.

కం॥ ధీరవ్రత! రాజన్య కు
మారక! నీ హృదయ మందు మసలిన కార్యం
బారూఢిగా నెఱుంగుదు
నారయ నది వొందరాని దైనను నిత్తున్‌

మ॥ ధనహీనుండు నృపాలు జేరి మిగులన్‌ ధాటిన్‌ ఫలీకార మి
మ్మని యర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజ లో
చనుడే చాల బ్రసన్నుడైన నతనిన్‌ సాంసారికం బర్థి గో
రిన నావంటి విమూఢ మానసులు ధాత్రిం గల్గిరే యెవ్వరున్‌

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana