e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home చింతన జ్ఞాన దేవతలు!

జ్ఞాన దేవతలు!

‘ఆత్మవిద్య’ సాధనకు స్త్రీలు అర్హులు కారా?
నిహిర, హైదరాబాద్‌

జ్ఞాన దేవతలు!

‘ఆత్మవిద్య’ అంటే ‘బ్రహ్మవిద్య’. దీనికే ‘బ్రహ్మజ్ఞాన’మని పేరు. బ్రహ్మజ్ఞానం వేదాలను అధ్యయనం చేయడం వల్ల యోగసాధనతో లభిస్తుంది. దీనిని సంపాదించే అర్హత కేవలం మగవారికే కాదు, స్త్రీలకుకూడా ఉందని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు కేవలం మగవాళ్లకు మాత్రమే పరిమితమై, వారికే ఉపదేశాన్ని ఇస్తున్నాయనడం అబద్ధం. ‘యథే మాం వాచం కళ్యాణీ మావదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాగం శూద్రాయచార్వాయ స్వాయచారణాయ (యజుర్వేదం: 26-2). ‘వేదం అందరిదీ. మగవారిదేగాదు, స్త్రీలదికూడా. అందరికీ కళ్యాణప్రదమైంది’ అంటున్నది వేదం. ‘మనుర్భవ’ అని చెప్పే వేదసందేశం మానవులందరికీ వర్తిస్తుంది.

- Advertisement -

‘స్త్రీహి బ్రహ్మా బభూ విధ’ (ఋగ్వేదం: 8-33-19). ‘స్త్రీలు నాలుగు వేదాలు చదువుతూ ఆత్మజ్ఞానం సంపాదించి యజ్ఞాలకు అధ్యక్షురాండ్రు కావాలి’. ‘గాయత్రేణ ప్రతిమిమితే ఆర్కమ్‌ (ఋగ్వేదం: 1-164-24). ‘గాయత్రీ మంత్రోపాసనద్వారా స్త్రీ పురుషులిరువురూ పరమాత్మను చేరుకుంటారు’. ‘మాతృదేవోభవ’ (తైత్తిరీయోపనిషత్తు: 1-11.2) అనే వేదవాక్కు ‘స్త్రీ జ్ఞానదేవత’ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. నాటి గురుకుల వ్యవస్థ బాలబాలికలను సమానంగా చూసింది. ‘ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః, నిది ధ్యాసితవ్యః మైత్రేయి’ (బృహదారణ్యకోపనిషత్తు: 2-4-5) అని స్వయంగా ఋషి యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయితో అన్న పలుకులివి. ‘ఆత్మయే చూడదగింది, వినదగింది, మననం చేయదగిందని’ చెప్పడం వల్ల ‘ఆత్మవిద్య’ కేవలం మగవారికే కాదని తెలుస్తున్నది. వేదమంత్రాలకు అర్థం తెలిసిన విదుషీమణులూ వున్నారు. 25 మంది మంత్రదర్శినులు నాలుగు వేదాల్లోని 422 మంత్రాలకు అర్థం చెప్పారు. ఐతే, నాటికీ నేటికీ స్త్రీల సంఖ్య తక్కువే. ఆత్మజ్ఞానం కలిగిన వేదమంత్ర దర్శినులలో శ్రద్ధా కామాయని, శచీ పౌలోమి, యమీ వైవస్వతి, సూర్యా సావిత్రి, అపాలా ఆత్రేయి, విశ్వవారా ఆత్రేయి, దక్షిణా ప్రాజాపత్యా, ఊర్వశి, సరమా, మాతృనామాలు ముఖ్యులు.

పుట్టింది మొదలు విద్వాంసులయ్యే దాకా పిల్లలకు శిక్షణ ఇచ్చేది తల్లియే. ‘సహధర్మచారిణి’ అన్న విశేషణమొకటి చాలు అన్ని ధర్మాలు తెలుసుకునే అర్హత స్త్రీలకు ఉందని చెప్పడానికి! సంతానానికి ప్రథమ గురువైన స్త్రీ బ్రహ్మజ్ఙానానికి దూరంగా ఎట్లుంటుంది? నాలుగు పురుషార్థాలూ స్త్రీ పురుషులు కలిసి సాధింపదగినవే. మోక్షాధికారం ధర్మార్థ కామాలవలె ఇద్దరికీ సమానమే. అయినప్పుడు, స్త్రీలకు బ్రహ్మజ్ఞానార్హత లేదని ఎట్లా చెప్పగలం? గార్గి పదివేలమంది పండితులున్న జనకుని సభలో పరబ్రహ్మ గురించి వాదించి యాజ్ఞవల్క్యుణ్ణి బ్రహ్మవేత్తగా నిర్ణయించిందంటే, భారతీయ స్త్రీకి ప్రాచీనకాలంలో ఇంతకంటే మించిన గౌరవమేముంది? నిజానికి ‘బృహదారణ్యకోపనిషత్తు’లో గార్గి చరిత్ర సృష్టించింది. ఇదే విధంగా, మండనమిశ్రుని భార్య ఉభయభారతి తన భర్తకు, శంకరాచార్యులకు మధ్య జరిగిన వాదవివాదంలో మధ్యవర్తిగా వ్యవహరించిందంటే, ఆమెకుగల బ్రహ్మజ్ఞానాన్ని మనం ప్రశ్నించగలమా?

ఆచార్య ,మసన చెన్నప్ప
98856 54381

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జ్ఞాన దేవతలు!
జ్ఞాన దేవతలు!
జ్ఞాన దేవతలు!

ట్రెండింగ్‌

Advertisement