e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home చింతన జీవో దేవః సనాతనః

జీవో దేవః సనాతనః

జీవో దేవః సనాతనః

యోగవేత్తలకు నేత కపిలదేవుడు సద్గుణవ్రాత మాత దేవహూతికి ఇలా బోధించాడు- అరవింద లోచనా! అమ్మా! నిందనీయమైన గుణాలు లేక బృందారకు (దేవత) లందరికీ వందనీయుడనైన నా యందు పొందికగా నిండార నిలుపవలసిన భక్తియొక్క విలక్షణ స్వరూప స్వభావాలను సలక్షణంగా నీకు నిరూపించాను. అంతిమంగా భక్తుని అంతఃకరణం భగవంతుని స్వరూపాన్ని సంతరించుకోవటమే భక్తి!
అంబా! అట్టి అమలిన, ఆత్యంతిక, నిర్గుణ భక్తి అలవడే వరకు నా భక్తుడు స్నాన, పూజాది నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు నిష్కామంగా నిర్వర్తించాలి. సర్వప్రాణులయందు నేనే (పరమాత్ముడే) కొలువై ఉన్నట్లు కనుగొని అందరితో కలివిడిగా మెలగాలి. అమ్మ, నాన్నలను ఆచార్యుని ఆదరిస్తూ, ఆనందింప చెయ్యాలి.
నా రూప దర్శనం, నా గుణ కీర్తనం, నా మూర్తి వందనం, నా పాదార్చనం, నా చరిత్ర శ్రవణం, నా నామస్మరణం, సతతం సత్సంగ సేవనం. దీనులయెడ దయ, సాటివారితో సఖ్యత, ఇంద్రియ సంయమనం, కర్మ జంజాటంలో చిక్కుపడకుండా ఉండుట, ప్రాణాయామాది యోగాభ్యాసం మొదలైన ఆత్మ (దైవ) గుణాలు అలవరచుకోవాలి. జననీ! శ్రద్ధతో ఈ ధర్మాలు ఆచరించిన భక్తుని మనస్సు శుద్ధమై నా గుణాలు విన్నంతనే నా యందు నిబద్ధ (లగ్న)మవుతుంది.
ఈ ప్రకరణంలో కపిలుడు తన ప్రవచనానికే పరాకాష్ఠగా భారతీయ సనాతన భాగవత ధర్మం యొక్క సార్వకాలిక (ఇటర్నల్‌), సార్వభౌమ (యూనివర్సల్‌) సత్య స్వరూపాన్ని సాక్షాత్కరింపచేస్తూ సర్వోత్కర్ష (హైలైట్‌)గా ఇలా ఉద్ఘోషించాడు-
అమ్మా! అఖిల ప్రాణుల అంతరంగా (హృదయా)లనే అరవిందా (కమలా)లలో అంతరాత్మనై నేను అహర్నిశం- ఎల్లవేళలా, అవిచ్ఛిన్నం (ఎడతెగని ఉనికి)గా అలరారుతూ ఉంటాను. అట్టి ఆత్మేశ్వరుడనైన నన్ను అవజ్ఞ-అలక్ష్యం చేసి, పట్టించుకోకుండా కేవలం నా అర్చామూర్తులను- కొయ్య, మట్టి, రాతి, లోహపు పూజాప్రతిమలను, విగ్రహాలను మాత్రమే పవిత్రాలని భావించి మిక్కిలి ఆడంబరంగా అర్చించువాడు చొక్కపు-అత్యంత అవివేకి. నా ఆరాధనను అపహసించు అపరాధి. అట్టివాడు ఆత్మవంచకుడే కాక అఖిల జగద్వంచకుడు కూడా. సర్వజీవ అంతర్యామినైన నన్ను సముచిత శ్రద్ధాభక్తులతో ఆరాధింపని వాని అర్చన (పూజ)లన్నీ భూతి- బూడిద, లో వేల్చిన హోమద్రవ్యాలవలె జననీ! వ్యర్థాలు, వ్యథా జనకాలే కాని నిత్యవిభూతి (ఐశ్యర్య) దాయకాలు- ఇహ, పర సాధకాలు కావు.
మాతా! సమస్త జీవకోటికి అంతరాత్మనైన నాకు, జీవరాశులకు మధ్య భేదం పాటిస్తూ మతిభ్రమణంతో మోసపూరితులై వైరబుద్ధి- శత్రుభావం, తో వ్యవహరించే వారికి మనశ్శాంతి మృగ్యం- మాయమైపోతుంది. వాడు నాతోనే వైరం పెట్టుకున్న వాడవుతాడు. భేదదృష్టి గలవాడిని మృత్యురూప భయం వెంటాడుతూ ఉంటుంది. అట్టి కుటిలాత్ములు, క్రూరకర్ములు కోట్ల కొలది ఖర్చు పెట్టి ఆర్భాటంతో అట్టహాసంగా నాకు అంఘ్రి-(పాద) పూజలు ఆచరించినా నా ఆత్మకు ఆనందం కలుగదు.
మూలంలోని (29వ అధ్యాయం) ‘అహం సర్వేషు భూతేషు’ మొదలుగా వరుసగా ‘ఆత్యంతిక భక్తి’కి ఏడుగడగా సప్తజ్ఞాన భూమికల వంటి ఏడు శ్లోకాలకి పునరుక్తి లేకుండా పుణ్యశ్లోకుడు, పునీతాత్ముడు, పోతనామాత్యుడు కావించిన సరళ సుందర సారభూతమైన తెనుగుసేత- పై చంపకమాల, సీసముల పద్య కైత.

చ. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి యనం దనర్చు నీ శు నను నవజ్ఞ సేసి మనుజుండొగి మత్ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై యుచిత భక్తిని నన్ను భజింపడేని నమ్మనుజుడు భస్మకుండమున మానక వేల్చిన యట్టి వాడగున్‌.

సీ. “అబ్జాక్షి! నిఖిల భూతాంత రాత్ముడనైన నా యందు భూత గణంబు నందు నతిభేద దృష్టి మాయావులై సతతంబు బాయక వైరానుబంధ నిరతులగువారి మనముల దగులదు శాంతి, యె న్నటికైన నేను నా కుటిల జనులమానక యెపుడు సామాన్యాధిక ద్రవ్య సమితిచే మత్పదార్చన మొనర్ప

తే.‘నర్థి నా చిత్తమున ముదం బందకుందుననుచు నెఱిగించి మఱియు నిట్లనియె గరుణ గలిత సద్గుణ జటిలు డక్కపిలు డెలమిదల్లి తోడ గుణవతీమ తల్లి తోడ.”

అయితే, అర్చామూర్తుల- విగ్రహాల, ఆరాధన వ్యర్థమా? నిషిద్ధమా? అంటే, కాదట. కపిలుడంటాడు- తన కర్తవ్యాన్ని ఆచరిస్తూనే సర్వప్రాణులలో ఉన్న పరమాత్మే తనలోకూడా ఉన్నాడన్న అనుభూతి- ‘వాసుదేవ స్సర్వం! సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్న సర్వాత్మభావం కలిగే వరకు నన్ను అర్చామూర్తి రూపంగా ఆరాధించాలి. కర్మనిష్ఠుని కర్మానుష్ఠానానికి కూడా ఇదే అవధి- హద్దు.
సర్వజీవుల యందు జగదీశ్వరుడు తన జీవకళా రూపాన ప్రవేశించి ఉన్నాడు. ప్రతి మనిషి, ప్రతి ప్రాణి పరమాత్మ యొక్క ప్రతిరూపం, ప్రతిబింబం. కనుక, ప్రాణులందరినీ గొప్పగా ఆదరిస్తూ మనసా నమస్కరిస్తూ ఉండాలి. నర-రూప నారాయణుని తిరస్కరించి చేసిన నారాయణ పూజ పూజకాదు, ప్రతారణ- మోసం. విడంబన- కేవల నటన. సర్వదేవ నమస్కారం దేవదేవునికి చెందినట్లే, సర్వజీవ తిరస్కారం కూడా త్రివిక్రమునికే తగులుతుంది. దేహం కోసం పశువువలె ఎవ్వరితోను వైరం పెట్టుకోరాదు. తన వాస్తవ స్వరూపాన్ని (జీవో దేవః సనాతనః- జీవుడు సనాతనుడైన దేవుడే) తెలుసుకోనంత వరకు మానవుడు పశువుతో సమానుడే. మృణ్మయ(మట్టి) విగ్రహంలో మాధవుని చూడగలిగే మనం చిన్మయ స్వరూపులైన సాటి మానవులలో చూడలేక పోతున్నాం. దీనినిబట్టి కపిలుని కృతయుగపు బోధలు ఈ కలికాలానికి మిక్కిలి సంగతాలు, సామయికాలు, సత్వర ఆవశ్యకాలు కదా!
మైత్రేయుడు విదురునితో అన్నాడు- కర్దమ మహర్షి అర్థాంగి దేవహూతి కపిలుని ఉపదేశం శ్రద్ధగా స్వీకరించింది. ఆమె సంసారబంధం సమూలంగా సమసిపోయింది. ప్రణమిల్లి కపిలుని స్తోత్రం చేసింది- మహాత్మా! మహాప్రళయ వేళ సమస్త భువన సముదాయాన్నీ నీ ఉదరంలో పదిలంగా పెట్టుకొని మహాసాగర మధ్యంలో మర్రి ఆకు పాన్పుపై మాయాశిశువువై ఒంటిగా శయనించి ఉంటావు. లీలగా నీ కాలి బొటనవ్రేలిని నోట పెట్టుకొని చీకుతూ దానినుంచి ఊరే అమృతాన్ని గ్రోలుతూ ఉంటావు. అట్టి దామోదరుడవైన నీవు నా పూర్వపుణ్య పరిపాకం వలన యోగభాస్కరుడవై నా ఉదరంలో ఉదయించావు. ఎంత దయ! ఎంత విచిత్రం స్వామీ! వేదగర్భుడవు, విష్ణు స్వరూపుడవైన నీకు వందనాలు!
‘మునీశ్వరులు, మహర్షులు, మహాభక్తులు పీయూష (అమృత) రసాన్ని పరిహరించి నిరంతరం నా పాదపద్మ మకరంద రసాన్నే గ్రోలుచుంటారెందుకబ్బా? ఇందులోని రహస్యం గ్రహించాలనే కుతూహలంతోనే వటప్రత శాయి తన పాదం నోటిలో పెట్టుకుని పీలుస్తున్నాడట’ అని కృష్ణ భక్తుడు చమత్కరిస్తాడు.
తరల హృదయుడైన కపిలుడు తత్తం బోధించి తరలిపోయిన తర్వాత తరుణీమణి దేవహూతి బిందుసరోవరం చేరి తపోదీక్షతో త్వరితగతిని తత్తానుభవం పొంది తరించింది. విదురా! ఆ మహాసాధ్వి సిద్ధి పొందిన క్షేత్రం ‘సిద్ధపదం’ అని ప్రసిద్ధి పొందింది. (ప్రస్తుత గుజరాత్‌ రాష్ట్రంలోని ఈ క్షేత్రం ఇపుడు సిద్ధపురం, మాతృగయ అని కూడా పిలువ బడుతోంది). సిద్ధ చారణాది సుగరణాలు స్తుతిస్తుండగా సముద్రుడు సాంఖ్యాచార్య శిఖామణి కపిలస్వామికి అర్ఘ్యపాద్యాలిచ్చి ఆయన నివాసానికి నికేతనం సమర్పించాడు. ఈశాన్య దిక్కున సురసరి (గంగా) సాగర సంగమ స్థలమే యోగీశుడైన కపిలుని ఆశ్రమం. ‘వందే విష్ణుం కపిలం వేద గర్భమ్‌’.

జీవో దేవః సనాతనః
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జీవో దేవః సనాతనః

ట్రెండింగ్‌

Advertisement